జగన్ ప్రభంజనం, చతికిలపడ్డ టీడీపీ

YS Jagan Mohan Reddy Leader Behind Huge Victory In AP Election Results 2019 - Sakshi

సాక్షి, అమరావతి : యావత్ దేశాన్ని ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభతో పాటు లోక్ సభ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం సాధించింది. ఏప్రిల్ 11 న జరిగిన పోలింగ్ అనంతరం దాదాపు 42 రోజుల తీవ్ర ఉత్కంఠ నడుమ గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండు నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందంజలో నిలిచింది. ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా చతికిలపడింది. ఇటు శాసనసభ అటు లోక్ సభ ఎన్నికలు రెండింటిలోనూ ఘోర పరాజయం మూటకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తోపాటు కీలకమైన నేతలు,మంత్రులు ఓటమిపాలయ్యారు. మరోవైపు తొలినుంచి దూకుడు ప్రదర్శించిన జనసేన అధినేత ఈ ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలింది. కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మట్టికరిచింది. అందుతున్న సమాచారం మేరకు 160కి పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

రాష్ట్ర శాసనసభలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలను (85 శాతానికి పైగా నియోజకవర్గాల్లో) కైవసం చేసుకుంది. టీడీపీ కేవలం 24 స్థానాలకు పరిమితం కావలసి వచ్చింది. జనసేన ఒక నియోజకవర్గానికి పరిమితమైంది. జిల్లాల వారిగా ఫలితాలను గమనిస్తే గతంలో ఎంతో అండగా నిలిచిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా టీడీపీకి ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేక చతికిలపడింది. ప్రతి ఎన్నికలోనూ భారీ మెజారిటీతో విజయం సాధించే చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఈసారి మెజారిటీ కూడా తగ్గింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. జనసేన కొన్ని స్థానాల్లో మూడో స్థానంలో నిలవగా అనేక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు. బీజేపీ నామమాత్రం పోటీ కూడా ఇవ్వలేకపోయింది.

లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై జాతి యావత్తు దృష్టి నిలిపించింది. యూపీఏకు దేశం పట్టం కడుతారని, అన్ని పక్షాలను ఏకం చేసి చక్రం తిప్పుతానిని చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షణలు చేస్తూ ఆయా పార్టీల నేతలను కలిసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో టీడీపీ ఓటమి తప్పదని తేల్చినప్పటికీ కొట్టిపారేస్తూ చంద్రబాబు పైకి బింకం ప్రదర్శించారు. జాతీయ స్థాయి సంస్థల ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధం తనకు సన్నిహితంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ తో పోస్ట్ పోల్ సర్వే పేరుతో ఫలితాలను వెల్లడించి చివరి ఎత్తుగడలకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో యావత్ దేశం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఆసక్తిని ప్రదర్శించారు. పార్టీ నేతల చుట్టూ తిరిగిన చంద్రబాబుకు ప్రజల మధ్యన నిలిచిన జగన్ కు మధ్య జరిగిన ఈ పోటీలో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. చంద్రబాబు చేసిన హడావిడి చూసి ఎన్నికల ఫలితాల అనంతరం జాతీయ స్థాయి చక్రం తిప్పుతారని కొన్ని రాజకీయ పక్షాలు భ్రమల్లో మునిగితేలాయి. 

చంద్రబాబు అంచనాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర ప్రజలు ఆయనకు గట్టి షాకిచ్చారు. అనేక జిల్లాల్లో మెజారిటీ సీట్లు సాధించిన టీడీపీ ఈసారి పూర్తిగా చతికిలపడింది. ఫలితాల్లో ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అదిపత్యం ప్రదర్శించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యలపై గడిచిన ఐదేళ్లుగా సాగించిన అనేక ఆందోళనలు, ప్రతి నిత్యం ప్రజల్లో ఉండటం, గడిచిన ఏడాది కాలం పాటు ప్రజల మధ్యన సాగించిన పాదయాత్ర ఈ ఫలితాలకు కారణమైనట్టు ఆపార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమం రాత్రి 10 గంటల తర్వాత కూడా కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ వీవీప్యాట్ ల లెక్కింపు కారణంగా ఫలితాలను అధికారికంగా ప్రకటించడంలో జాప్యం జరిగింది. గురువారం రాత్రి పది గంటల వరకు అందుతున్న సమాచారం మేరకు శ్రీకాకుళం (10) 8, విజయనగరం (9) 9, విశాఖ (15) 11, తూర్పు గోదావరి (19) 14, పశ్చిమ గోదావరి (15) 12, కృష్ణా (16) 13, గుంటూరు (17) 14, నెల్లూరు (10) 10, ప్రకాశం (12) 8, అనంతపురం (14) 12, వైఎస్సార్ (10) 10, కర్నూలు (14) 14, చిత్తూరు (14) 13 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనున్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన ఏ జిల్లాలోనూ అధికార టీడీపీ పట్టు నిలుపుకోలేకపోయింది. 

25న శాసనసభా పక్ష సమావేశం
ఎన్నికల్లో ఘనవిజయంతో ఉండవల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఫలితాల చివరి దశలో ఉన్న సమయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన తీర్పుతో తన విశ్వాసాన్ని బాధ్యతను పెంచుతుందని పేర్కొంటూ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశమైన అనంతరం ఈ నెల 25 వ తేదీన పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు పార్టీ ఒక ప్రకటనతో తెలియజేసింది. ఆ సమావేశంలో పార్టీ శాసనసభా పక్షం నాయకుడి ఎన్నుకుంటారు. అనంతరం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ ప్రతినిధి బృందం గవర్నర్ ను కలిసి ఆ మేరకు సమాచారం ఇవ్వనున్నారు. గవర్నర్ ఆహ్వానం మేరకు ఈ నెల 30 న మంత్రివర్గం పదవీ స్వీకార ప్రమాణం చేస్తుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top