వైఎస్‌ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌, ఉద్రిక్తత

YS Avinash Reddy Arrested In Pulivendula - Sakshi

సాక్షి, పులివెందుల: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు మార్గమధ్యలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు.

అధికార, ప్రతిపక్ష నాయకుల సవాళ్లు, ప్రతిసవాళ్ల నేపథ్యంలో ఈ ఉదయం నుంచి పులివెందులలో హైడ్రామా చోటుచేసుకుంది. పులివెందుల అభివృద్ధిపై చర్చకు సిద్ధపడిన ఎంపీ అవినాష్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ నాయకులు కుట్రలు సాగించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అడుగడుగునా నియంత్రించారు. శాంత్రి భద్రతల సమస్య తలెత్తితే తానొక్కడినే చర్చకు వస్తానని, ఫలవంతమైన చర్చ జరగాలన్నదే తన ఉద్దేశమని అవినాష్‌రెడ్డి చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. పాత ఎమ్మెల్యే క్వార్టర్‌లో ఉన్న ఆయనను అరెస్ట్‌ చేసి బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ప్రజలకు వాస్తవాలు తెలియాలి
బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. పులివెందులకు వైఎస్సార్‌ ఏం చేశారో చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. కుంటి సాకులు చెప్పకుండా టీడీపీ నాయకులు ఏం చేశారో చర్చకు రావాలన్నారు. ఫలప్రదమైన చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అధికార పార్టీ వారిని వదిలేసి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను మాత్రమే ఎక్కడిక్కడ నిలువరిస్తూ పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top