విభజించి పాలన సాగిస్తున్నాయ్‌..

Yogi Adityanath comments on Congress and TDP and TRS - Sakshi

ప్రజలంతా ఒక్కటే అయినప్పుడు కులం, మతం తేడాలెందుకు?

కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలది ముస్లింలపై కపట ప్రేమ

తెలంగాణలో బీజేపీకి పట్టం కట్టాలి

రాష్ట్రానికి కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌లు చేసిందేమీలేదు

హైదరాబాద్‌ను భాగ్యనగరంగా పేరు మార్చాలి

వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

సాక్షి, నెట్‌వర్క్‌: కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు మతాలు, కులాలను విభజించి పరిపాలన సాగిస్తున్నాయని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విమర్శించారు. ప్రజాకూటమి మేనిఫెస్టో చూస్తే మతతత్వ భావాలను పెంపొందించే విధంగా ముస్లింలకు ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక తీసుకువస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా ఒకటే అయినప్పుడు అభివృద్ధిలో కులం, మతం తేడాలెందుకని ప్రశ్నించారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్లలో కులం, మతం తేడా లేని ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం సీఎం యోగి వికారాబాద్‌ జిల్లా తాండూర్, మేడ్చల్‌ జిల్లా పీర్జాదిగూడలో మేడ్చల్‌ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌ మధిర గ్రామం కిష్టయ్యగూడెం శివారులో, గోషామహల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు ముస్లింలపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు. ఈ పార్టీలకు మజ్లిస్‌ తోడైందని, వీరంతా కలిసి ముస్లింలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదులు, నక్సలైట్లను పెంచిపోషించటంతో పాటు కశ్మీర్‌లో వారికి బిర్యానీ వడ్డిస్తుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం ప్రజలకు రక్షణగా ఉగ్రవాదులను ఏరివేసేందుకు బుల్లెట్ల వర్షం కురిపిస్తుందని పేర్కొన్నారు. బీజేపీ గెలుపుతోనే రాముడి కలలు సాకారమయ్యి రామరాజ్యం ఏర్పడుతుందని యోగి తెలిపారు. 

ఒక్క హామీ నెరవేర్చ లేదు.. 
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ ఎన్నో హామీలిచ్చినా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారని యోగి ధ్వజ మెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్‌ దళితులకు మూడెకరాల భూమి, ఎన్నికలలోపు మిషన్‌ భగీరథ పథకం పూర్తి లాంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ప్రజలు అధికారాన్ని టీఆర్‌ఎస్‌కు కట్టబెడితే వారి ఆశలను వమ్ముచేశారని తెలిపారు. రాష్ట్రంలో మళ్లీ నిజాం పాలన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలకు కేసీఆర్‌ ప్రభుత్వం మోకాలడ్డుతోందని ఆరోపించారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే బీజేపీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

వారసత్వ రాజకీయాలకు స్వస్తి..
వారసత్వ రాజకీయాలకు ప్రజలు స్వస్తి పలకాలని యోగి పిలుపునిచ్చారు. ఒక సామాన్య కార్యకర్త సైతం బీజేపీలో ప్రధాని, సీఎం, ఉప రాష్ట్రపతితో పాటు ఉన్నత పదవులను పొందే అవకాశం ఉందన్నారు. కానీ కాంగ్రెస్‌లో సోనియా గాంధీ వారసుడిగా రాహుల్‌ గాంధీ, టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ వారసులుగా కుమారుడు, కూతురు, టీడీపీలో చంద్రబాబు వారసుడిగా లోకేశ్‌ పదవులను అనుభవిస్తున్నారని చెప్పారు. వారసత్వ రాజకీయాల ద్వారా ప్రజాస్వామ్యానికి ప్రమాదమన్నారు. పాకిస్తాన్‌లో, జమ్ముకశ్మీ ర్‌లో ఉగ్రవాదులకు దీటుగా జవాబిస్తున్నామని, దేశ రక్షణకు అత్యంత పాధాన్యమిస్తున్నామని చెప్పారు. దేశ భద్రత, అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని యోగీ తెలిపారు. 

భాగ్యనగరంగా పేరు మార్చాలి
హైదరాబాద్‌ నగరాన్ని భాగ్యనగరంగా పేరు మార్చాలని యోగి అన్నారు. గోషామహల్‌ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌ లోధా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రామరాజ్యం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఆయా సభల్లో, సమావేశాల్లో తాండూర్‌ అభ్యర్థి పటేల్‌ రవిశంకర్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీవీఎల్‌ నరసింహారావు, చింతా సాంబమూర్తి, కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగారం నర్సింహులు, జాతీయ కనీస వేతనాల కమిటీ చైర్మన్‌ ఆవుల గోవర్ధన్, మేడ్చల్‌ బీజేపీ అభ్యర్థి కొంపెల్లి (పెద్ది) మోహన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర నేతలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top