కేరళ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ

Wayanad in Kerala to be Rahul Gandhi second seat - Sakshi

తిరువనంతపురం: కేరళలో కాంగ్రెస్‌ పార్టీ కంచుకోట అయిన వయనాడ్‌ లోక్‌సభ స్థానం నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పోటీ చేయబోతున్నారు. వాయనాడ్‌ నుంచి పోటీకి రాహుల్‌ గాంధీ అంగీకరించారని కేరళ కాంగ్రెస్‌ చీఫ్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ శనివారం తెలిపారు. ‘ఈ విషయమై నెలరోజులుగా చర్చలు కొనసాగాయి. మొదట్లో రాహుల్‌ గాంధీ అంగీకరించలేదు. కానీ ఎంతో నచ్చజెప్పిన తర్వాత ఆయన అంగీకరించారు’అని ఆయన విలేకరులకు వెల్లడించారు. 

ప్రస్తుతం రాహుల్‌ ఉత్తరప్రదేశ్‌లోని అమేథి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణ భారతదేశంలోనూ ఆయన పోటీ చేయాల్సిందిగా కర్ణాటక, తమిళనాడు, కేరళ నేతలు కాంగ్రెస్‌ అధినాయకత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. పార్టీ కేరళ విభాగం నేతలు రాహుల్‌ను పోటీ చేయాల్సిందిగా కోరారని, వారి అభ్యర్థనను ఆయన సానుకూలంగా పరిగణించనున్నారని అంతకుపూర్వం కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. దక్షిణాదిలో రాహుల్‌ పోటీ విషయమై కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్‌, బిదర్‌, మైసూర్‌ స్థానాలను, తమిళనాడులోని కన్యాకుమారి, శివగంగ స్థానాలను, కేరళలోని వయనాడ్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ అధినాయకత్వం పరిగణనలోకి తీసుకుంది.


 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top