పులివెందుల.. రికార్డుల గర్జన

Verdict Of The Pulivendula Constituency - Sakshi

ఇద్దరు సీఎంలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం

వైఎస్సార్‌ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఆ ఛాన్స్‌

మెజారిటీలలోనూ సంచలనాల నమోదు

సాక్షి, కడప: పులివెందుల నియోజకవర్గం మరో రికార్డు నమోదు చేసుకోనుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోనుంది. ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేకు మూడో పర్యాయం ముఖ్యమంత్రి హోదా దక్కుతోంది. 2004లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పులివెందుల ఎమ్మెల్యేగా ఎన్నికై తొలిసారి సీఎం బాధ్యతలు చేపట్టారు. 2009లో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కొద్ది కాలానికే ఆయన దురదృష్టవశాత్తూ అశువులు బాశారు. పదేళ్ల తర్వాత జరిగిన తాజా ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి సీటును అధిరోహించనున్నారు. 

ఈనెల 30న ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా రాజధానిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. తండ్రీ తనయులు ముఖ్యమంత్రి కావడం దేశ చరిత్రలోనే అరుదు. నిన్నటి ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ జిల్లా  మరికొన్ని న్ని రికార్డులను నమోదు చేసుకుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పులివెందుల ప్రజలు అతి ఎక్కువ మెజార్టీ( 90,110 ఓట్లు) కట్టాబెట్టారు. అదే అభిమానాన్ని కడప పార్లమెంటులోనూ ఓటర్లు చూపించారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డికి 3,80,976 ఓట్లు ఆధికత్యను ఇచ్చారు. రాష్ట్రంలో ఎంపీల మెజార్టీలలో ఆయనకు వచ్చిన మెజార్టే అధికం. వైఎస్‌ఆర్‌ కుటుంబం పట్ల జిల్లా ప్రజానీకం చూపిన అత్యంత ఆదరణకు నిదర్శనమిది. ఈరెండు రికార్డులు కూడా వైఎస్‌ఆర్‌ కుటుంబసభ్యులకే దక్కాయి. 10ఎమ్మెల్యే సీట్లు, 2పార్లమెంటు స్థానాలను వైఎస్సార్‌సీపీకి అప్పగించి జిల్లా ప్రజలు అపార అభిమానాన్ని ప్రదర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top