మహిళలే కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి 

Uttamkumar Reddy fires on KCR - Sakshi

  కేసీఆర్‌కు మహిళల ఓట్లు అడిగే హక్కు లేదు

  డిసెంబర్‌ 12న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

  మహిళా గర్జన సదస్సులో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ మంత్రివర్గంలో ఒక్క మహిళకుకూడా మంత్రిగా పనిచేసే సమర్థత లేదన్న కేసీఆర్‌కు మహిళల ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. మహిళలను తక్కువగా అంచనా వేసి మంత్రి పదవి ఇవ్వకుండా అవమానపర్చిన కేసీఆర్‌కు కుటుంబ సభ్యులతో కలిసి మహిళలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సోమవారం కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం షాపూర్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో జరిగిన మహిళాగర్జన సదస్సుకు ఉత్తమ్‌తోపాటు మాజీ మంత్రి డీకే అరుణ, మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద, కోశాధికారి గూడూరి నారాయణరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలను నిర్లక్ష్యం చేయడమే కాదు. మహిళా సంఘాల డబ్బులు కూడా కేసీఆర్‌ దోచుకున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి మహిళా సాధికారత సాధించిందన్నారు. 

ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే గెలుపు 
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పవనాలు వీస్తున్నాయని. 5రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీయే గెలుపు సాధిస్తుందని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే పలు మీడియా సంస్థల సర్వేలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. తెలంగాణలో డిసెంబర్‌ 12న ప్రమాణ స్వీకారంతో కాంగ్రెస్‌ ప్రభు త్వం ఏర్పాటు ఖాయమన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. వంద రోజుల్లో 6 లక్షల మహిళా సంఘాలకు లక్ష రూపాయల గ్రాంట్‌ విడుదల చేస్తామని, ఈ గ్రాంట్‌ తిరిగి కట్టాల్సిన అవసరం లేద న్నారు. ప్రతి మహిళా సంఘానికి పదిలక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేస్తామన్నారు. మహిళా సంఘం సభ్యులు ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 5లక్షల బీమా కల్పిస్తామన్నారు. అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామని, గ్రామాల్లో పనిచేస్తున్న మహిళా వర్కర్స్‌కు 10 వేల జీతం, తెల్ల రేషన్‌ కార్డ్‌ ఉన్న ప్రతి కుటుంబానికి 6 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. సన్నబియ్యంతో పాటు 9 రకాల సరుకులను రేషన్‌ ద్వారా అందజేస్తామని, దళిత, గిరిజనులకు ఉచితంగా రేషన్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామన్నారు.  

మహిళల ఆత్మగౌరవం అంత చిన్నదా: అరుణ 
బతుకమ్మ ఆడండంటూ రూ.50, రూ.100 చీరలిచ్చి మహిళలను కేసీఆర్‌ అవమాన పర్చాడని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. ముందస్తు ఎన్నికల నిబంధనతోనే చీరల పంపిణీ ఆగిందని, కానీ ఆ నెపాన్ని కాంగ్రెస్‌పై నెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. ముం దస్తు ఎన్నికలకు పొమ్మని కేసీఆర్‌కు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ ప్రభుత్వం మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో మహిళలు గమనిస్తున్నారన్నారు. మహిళలను గౌరవించలేని కేసీఆర్‌కు ఓటు అడిగే హక్కు ఉందా అన్నారు. మళ్లీ సీఎంగా కేసీఆర్‌ను ఎన్నుకుంటే మహిళలకు రక్షణ లేకుండా పోతుందని తెలిపారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top