పోలీసులకు కాంగ్రెసోళ్ల కార్లు మాత్రమే కనిపిస్తాయా?

Uttam Kumar Reddy KTR Critics Each Other On Twitter - Sakshi

కేటీఆర్‌, ఉత్తమ్‌ల మధ్య ట్విటర్‌ వార్‌

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియా వేదికగా టీపీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ పోలీసులు కాంగ్రెస్‌ నాయకులపై వాహనాలపై దాడులు చేస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. కేటీఆర్‌ బంధువులు డీఐజీ ప్రభాకర్‌ రావు, పోలీస్‌ టాస్క్‌ఫోర్సు ఉన్నతాధికారి రాధాకృష్ణరావు, మరికొందరు అధికారులు కాంగ్రెస్‌ నాయకులే టార్గెట్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు. తనిఖీ చేయడానికి పోలీసులకు కాంగ్రెస్‌ నాయకుల కార్లు మాత్రమే కనబడతాయా అని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతికారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సొంత విషయాల్లో అక్రమంగా చొరబడి పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉత్తమ్‌ వాపోయారు. సుహృద్భావ వాతావరణంలో ఎన్నికలు జరగాలనే నిబంధనలకు కొందరు పోలీసులు విఘాతం కలిగిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామని ఉత్తమ్‌ అన్నారు.

పోలీసులను అలా అనొద్దు..
ఉత్తమ్‌ ట్వీట్‌పై స్పందించిన కేటీఆర్‌.. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. పోలీసులకు కులం రంగు అంట్టగట్టొద్దని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు మంచి పేరుందనీ, నీచమైన మాటలతో వారికి చెడ్డపేరు ఆపాదించొద్దని హితవు పలికారు. 2014 ఎన్నికల సందర్భంలో రూ.3 కోట్లతో ఎవరి కారు పట్టుబడిందోనని ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న పోలీసులందరికీ డీజీపీ మహెందర్‌రెడ్డి బాస్‌ అని.. ఆ విషయం ఉత్తమ్‌ గుర్తు పెట్టుకుంటే మంచిదని అన్నారు. కష్టపడి పని చేస్తున్న మన రాష్ట్ర పోలీసుల పట్ల రాజకీయాలు చేయొద్దని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top