ఛత్తీస్‌ చక్రవర్తి ఎవరు?

Triangular competition in the Chhattisgarh assembly elections  - Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ

నాలుగోసారి గెలుపు కోసం బీజేపీ తంటాలు

విజయం కోసం కాంగ్రెస్‌ తహతహ

కూటమి పార్టీలతో కలసి చక్రం తిప్పనున్న అజిత్‌ జోగి

పేరులో ఉన్నట్లే ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయాలు 36 రకాలు! సమస్యలూ అన్ని రకాలే..పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈసారి ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నప్పటికీ మరోసారి గద్దెనెక్కడానికి సర్వశక్తులూ ఒడ్డుతుండగా ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ దూకుడుకు ఈసారైనా కళ్లెం వేసి అధికారం అందుకోవాలని కాంగ్రెస్‌ కలలు కంటోంది. కాంగ్రెస్‌కు జెల్లకొట్టి, మాయావతితో జట్టుకట్టి, సీపీఐనూ తన గూటికి లాగేసిన అజిత్‌ జోగి కనీసం కింగ్‌మేకర్‌నైనా కాలేనా అనే ఆశల్లో విహరిస్తున్నారు. అయితే ప్రజలేమో కరువు, పేదరికం, నిరుద్యోగం, నక్సలిజం వంటి సమస్యలతో నలిగిపోతూ తమను ఆదుకునే దిక్కెవరా అని ఎదురుచూస్తున్నారు. ఇంకో నెల రోజుల్లో ఎన్నికలు జరిగే ఛత్తీస్‌గఢ్‌లో గెలుపెవరిది? ఏ పార్టీ సత్తా ఎంత?

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ముఖాముఖి పోరు నడిచింది. మూడుసార్లు బీజేపీ అధికారాన్ని దక్కించుకున్నప్పటికీ ఇరు పార్టీలకీ మధ్య ఓట్ల తేడా కేవలం ఒకే ఒక్క శాతం. ఆ ఒక్క శాతం ఓట్లే ఎన్నో సీట్లను ప్రభావితం చేస్తూ వచ్చాయి. రాష్ట్రంలో రమణ్‌సింగ్‌ సర్కార్‌ తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కిందిస్థాయిలో అవినీతి, అన్నదాతల ఆక్రోశం, నిరుద్యోగం, ప్రభుత్వంపై గిరిజనుల్లో అసహనం ఇవన్నీ కాంగ్రెస్‌కు కలసి వస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. నాయకత్వ లేమి, నిధుల కొరత కాంగ్రెస్‌ను వెంటాడుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు, బస్తర్‌ వంటి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీకున్న అధికార వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్‌ వ్యూహాలకు పదును పెడుతోంది. కాంగ్రెస్‌కు అజిత్‌ జోగి గుడ్‌బై చెప్పాక ఆ పార్టీకి జనాకర్షక నాయకులే కరువయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ భూపేష్‌ భాగల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత టీఎస్‌ సింగ్‌ దేవోలకు ప్రజల్లో అంతగా చరిష్మా లేదు. పైగా భూపేష్‌ భాగల్‌ సెక్స్‌ సీడీ వివాదంలో ఇరుక్కొని గత నెల్లోనే జైలుకెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. కాంగ్రెస్‌లోని మరో ముఖ్య నేత, ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రామ్‌దయాళ్‌ ఉయికే బీజేపీ గూటికి చేరుకున్నారు. ఎన్నికల వేళ ఈ పరిణామాలతో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మరోవైపు అజిత్‌ జోగి పార్టీని వీడటం కూడా తమకు అనుకూలిస్తుందనే భావనలో కాంగ్రెస్‌ ఉంది. ఎందుకంటే 2013 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోవడానికి అజిత్‌ జోగి తెరవెనుక కుట్రలు జరిపారన్న ఆరోపణలూ బలంగా వినిపించాయి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనకెవరైనా పోటీ అని భావిస్తే వారికి టికెట్లు దక్కకుండా చేయడం, టికెట్‌ దక్కించుకున్న వారి ఓటమికి కుట్రలు పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈసారి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించకుండా రాహుల్‌ గాంధీయే ముందుండి ప్రచారాన్ని నడిపిస్తున్నారు. ‘‘రాష్ట్రం ఏర్పడిన ఇన్నేళ్లలో కాంగ్రెస్‌ తనకు అనుకూల ఎజెండాను ఏర్పాటు చేసుకోగలిగింది. బీజేపీని ఆత్మరక్షణలో పడేసే వ్యూహాలతో కాంగ్రెస్‌ ముందుకు వెళ్లడం మొదటిసారి చూస్తున్నాం’’అని రాయ పూర్‌కు చెందిన రాజకీయ విశ్లేషకుడు పరివేష్‌ మిశ్రా అభిప్రాయపడ్డారు. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు గోండ్వానా గణ తంత్ర పార్టీ (జీజీపీ)తో పొత్తు పెట్టుకోవడానికి కూడా కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.

రమణ్‌సింగ్‌కూ అవినీతి మకిలి...
ఇన్నాళ్లూ క్లీన్‌ ఇమేజి సొంతం చేసుకున్న రమణ్‌ సింగ్‌కు గత మూడేళ్ల లోనే కొద్ది కొద్దిగా అవినీతి మకిలి అంటుకుంటోంది. అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో రమణ్‌ సింగ్‌ తన కుమారుడు అభిషేక్‌ కంపెనీకి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబం ధించి రూ. లక్షా 50 వేల కోట్ల కుంభ కోణంలోనూ రమణ్‌సింగ్‌ పేరు విని పించింది. కల్తీ బియ్యం పంపిణీలో ఉదాశీనంగా వ్యవహరించడం కోసం మిల్లర్లు భారీగా సర్కార్‌కు ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఈ ఆరోపణలనే ప్రధాన అస్త్రాలుగా చేసుకొని కాంగ్రెస్‌ ప్రచారం నిర్వహిస్తోంది.

మోదీ ఇమేజ్‌పైనే ఆశలు..
బీజేపీ ప్రధానంగా మోదీ ఇమేజ్‌ మీదే గంపెడు ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర జనాభాలో సగం వరకు ఉన్న గిరిజనులు, దళితులు (స్థానికంగా సత్నామీలని పిలుస్తారు) ఎన్నికల్లో అత్యంత కీలకం. ఇన్నాళ్లూ గిరిజ నులు కాంగ్రెస్‌ పార్టీకే మద్దతు పలుకుతూ వచ్చారు. కానీ ఈమధ్య గిరిజనుల్ని దగ్గర చేసుకోవడానికి ఆరెస్సెస్‌ విస్తృత కార్యక్రమాలు నిర్వహించింది. ముఖ్యంగా బస్తర్‌ ఇతర గిరిజన ప్రాబల్య జిల్లాల్లోని సంక్షేమ సంస్థలతో కలసి పనిచేస్తోంది. దీని వల్ల గిరిజనుల ఓటు బ్యాంకు తమవైపు మళ్లుతుందనే భావనలో బీజేపీ ఉంది. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన కులాలైన కుర్మిలు, తెలిస్, యాద వులు బీజేపీ వెంటే ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లోని వ్యాపారులు బీజేపీ వైపే ఇంకా మొగ్గు చూపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత కీలకంగా ఉండే రైతులు మాత్రం బీజేపీపట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారు.

అజిత్‌ జోగి ప్రభావం ఎంత?
కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా మూడేళ్లపాటు పనిచేసిన అజిత్‌ జోగి ప్రజల్లో చరిష్మా ఉన్న నాయకుడు. రమణ్‌సింగ్‌ సర్కార్‌ను ఎదుర్కో వడంలో కాంగ్రెస్‌ విఫలమవుతోందని ఆరోపిస్తూ ఆయన రెండేళ్ల క్రితమే పార్టీ నుంచి బయటకొచ్చి జనతా కాంగ్రెస్‌ పేరుతో కొత్త పార్టీ స్థాపించారు. సత్నామి ఎస్సీ జనాభాలో జోగికి మంచి పట్టు ఉంది. రాష్ట్రంలో 90 నియోజక వర్గాల్లోని రాజకీయ పరిస్థి తులు ఆయనకు కొట్టిన పిండి. ఎస్సీ, ఎస్టీలు, ఉప కులాలు, వెనుకబడిన కులాలు ఎక్కువగా ఉన్న ఈ నియోజక వర్గాల్లో స్థితిగతుల్ని అర్థం చేసుకొని రాజకీయ వ్యూహాలను రచించడంలో ఆయన్ను మించిన వారు లేరన్న పేరుంది. అజిత్‌ జోగి వెంటే ఆయన కుమారుడు అమిత్‌ తిరుగుతూ యువ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉన్నారు. ఇప్పటికే నిరుద్యోగ సమస్యతో రగిలిపోతున్న యువతరానికి జోగి ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అజిత్‌ జోగి ఎన్నికల సభలకూ జనం బాగా వస్తుండటంతో ఆయన కింగ్‌ మేకర్‌గా అవతరిస్తారేమోనన్న అంచనాలు నెలకొన్నాయి. దళిత ఓటర్లలో పట్టున్న బీఎస్పీ చీఫ్‌ మాయావతి... అజిత్‌ జోగి పార్టీ జనతా కాంగ్రెస్‌తో జతకట్టడం, సీపీఐ కూడా ఆయన చెంతకే చేరడంతో ఆ కూటమి బలం పెంచుకుందనే విశ్లేషణలు వినిపిస్తు న్నాయి. జోగి ప్రధానంగా కాంగ్రెస్‌ ఓటు బ్యాంకునే చీల్చే అవకాశాలున్నాయి. ఎస్సీ ఓటర్లు జోగివైపు తిరిగితే బీజేపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. అయితే అజిత్‌ జోగి పార్టీ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలోనే ప్రభావం చూపగలదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు...
దేశంలో పేదరికం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్‌ ఒకటి. ప్రపంచ బ్యాంకు మానవాభివృద్ధి సూచిలో అట్టడుగు స్థానం ఈ రాష్ట్రానిదే. రంగరాజన్‌ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో దాదాపు సగం మంది అంటే 47.9% మంది ప్రజలు పేదరికంలోనే మగ్గిపోతున్నారు. 69% మంది కూలీలుగానే బతుకులీడుస్తున్నారు. మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ విడిపోవడానికి పేదరికమే కారణమైంది. ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అదే ప్రధాన అంశంగా మారింది.

రాష్ట్రంలోని మరో ప్రధాన సమస్య నక్సలిజం. తుపాకుల మోతలు, రక్తపుటేరులు, ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్‌ తరచూ నలిగిపోతూ ఉంటుంది. భద్రతా సిబ్బందిపై నక్సల్స్‌ దాడులు సర్వసాధారణం. దండకారణ్యంలో నక్సల్స్‌ ఎప్పటికప్పుడు ఏకే–47 తుపాకులు, రాకెట్‌ లాంచర్లతో దాడులు జరుపుతూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటూ ఉంటారు. అంతేకాదు అభివృద్ధి కార్యకలాపాలకు నక్సల్స్‌ తరచూ అడ్డుతగులుతారనే విమర్శలూ ఉన్నాయి. కొత్తగా రోడ్లు నిర్మిస్తుంటే నక్సల్స్‌ వాటిని ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. సగటున 20 ప్రాంతాల్లో నక్సల్స్‌ పేలుళ్లు జరిపితే వాటిలో 10 ప్రాంతాలు కొత్తగా రోడ్లు వేసే చోట జరుగుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

రాష్ట్రంలో యువత నిరుద్యోగ సమస్యతో సతమతమవుతోంది. ఎంప్లాయిమెంట్‌ ఎక్సే్చంజ్‌లలో 25 లక్షల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్తగా లక్ష 18 వేల మంది యువ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో వారే కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడు తోంది. 21 జిల్లాలు, 93 తహశీళ్లు గతేడాది కరువుబారిన పడ్డాయి. 11 లక్షల మంది రైతులపై దీని ప్రభావం పడింది. గిట్టుబాటు ధర లేక చాలా మంది పొట్టచేత పట్టుకొని పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారు. గత మూడేళ్లలో 1,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top