రాప్తాడు చరిత్రలో..తొలి తిరుగుబాటు

Thopudurthi Villagers Fires On Paritala  Sunitha - Sakshi

ఈ ఏడాది ఫిబ్రవరి 3న తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు రోజులు ముందుగా గ్రామస్తులకు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. దాదాపు ఎన్నికలకు ఒక నెల ముందు సంక్షేమ ఫలాలు అందజేసే కార్యక్రమాలకు మంత్రి తెరలేపడంపై స్థానికులు భగ్గుమన్నారు. ఇంత కాలం తమ గ్రామంలోని ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించని ఆమెకు గ్రామంలో కాలు పెట్టే అర్హత లేదని, కాదూకూడదంటూ గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంక్‌ల్లో డీఫాల్టర్లుగా మారాల్సి వచ్చిందని దీనికంతకూ కారణం టీడీపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. పరువు దక్కించుకునేందుకు బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంక్‌లకు వడ్డీలు కట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చలేని అసమర్థ మంత్రి తమకు అక్కర లేదంటూ తేల్చి చెప్పారు. పసుపు – కుంకుమ పేరుతో వేసే భిక్షం తమకు అక్కర లేదని, చేయగలిగితే పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణాలు మాఫీ చేసి గ్రామంలోకి కాలు పెట్టాలని సవాల్‌ విసిరారు. దీనిపై మంత్రి కూడా అప్పట్లో స్పందించారు. గ్రామస్తుల్లో ఐక్యతను దెబ్బతీసేందుకు ఇది ప్రతిపక్షాల కుట్ర అని దుమ్మెత్తిపోశారు. తన పర్యటనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఘాటుగా స్పందించారు.

చివరకు ఫిబ్రవరి 3వ తేదీ రానేవచ్చింది. ఉదయం నుంచి గ్రామంలో వాహనాలు రాకుండా స్థానికులు కాపుకాసారు. మంత్రి ఆదేశాల మేరకు సాక్షాత్తూ ఎస్సీ జీవీజీ అశోక్‌కుమార్‌ నేరుగా రంగంలోకి దిగారు. భారీగా పోలీసు బలగాలను గ్రామంలో మొహరింపజేసి మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు కేవలం మహిళలే రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. చివరకు మంత్రి సునీత కాన్వాయ్‌ రానే వచ్చింది. సభావేదిక వద్దకు నేరుగా వెళ్లేందుకు మంత్రి ప్రయత్నించడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఇక తమ చేతికి చిక్కిన చీపర్లు, చెప్పులను మంత్రి కాన్వాయ్‌పై విసిరారు. ఇచ్చిన హామీలు నెరవ్చేకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్‌ అంటూ నినదించారు. మంత్రికి జరిగిన ఈ ఘోర పరాభవం నేటికీ నియోజకవర్గ ప్రజల మది నుంచి చెరిగిపోలేదు. హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఆమె ఇంత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు.    

గ్రామ స్వపరిపాలనకు స్వర్ణయుగం 
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ స్వపరిపాలన అనేది స్వర్ణయుగంలా సాగింది. గ్రామ పరిధిలో ఏ పని చేయాలన్నా.. స్థానిక ప్రజాప్రతినిధులదే తుదినిర్ణయంగా ఉండేది. దీని వల్ల గ్రామాల్లో చాలా వరకు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్వపరిపాలనను అపహాస్యం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేశారు. అక్రమాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. భూదందాలు, భూకబ్జాల పెచ్చరిల్లాయి. పొరబాటున మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ అరాచక పాలనను భరించలేం. గతంలోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చాలా దుర్మార్గమైన పాలన కొనసాగించారు. ఇంతటి దుర్మార్గమైన పాలన పోవాలంటే మళ్లీ వైఎస్సార్‌ పాలన రావాలి. ఇది కేవలం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది. – మారుతీప్రసాద్‌ , తాజామాజీ సర్పంచ్, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్‌ మండలం  

వైఎస్సార్‌ చేయూత’ 
చంద్రబాబు పాలనలో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత చదువుల అవకాశాన్ని కోల్పోయారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించక చాలా మంది మధ్యలోనే చదువులు మానేశారు. రుణమాఫీ కాక రైతులు నానా అవస్థలు పడ్డారు. బ్యాంక్‌ల్లో డ్వాక్రా మహిళలు డీఫాల్టరయ్యారు. హౌసింగ్‌ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పునాదుల దశలోనే పేదల సొంతింటి కల నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ ప్రజలు అన్ని విధాలుగా దగాపడ్డారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు వచ్చారు.

నవరత్న పథకాలను ప్రకటించి ప్రతి ఒక్కరికీ అభయమిచ్చారు. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 1 లక్ష వైఎస్సార్‌ కానుకగా ఇస్తానని పేర్కొనడం చాలా బాగుంది. అన్ని కులాల వారికీ ప్రత్యేక కార్పొరేషన్ల ు ఏర్పాటు చేసి జీవనోపాధుల పెంపునకు కృషి చేస్తాననడం చాలా బాగుంది. అందుకే జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు.  – రవి, కళ్యాణదుర్గం   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top