యాత్రకు పోదాం చలో చలో..! | Telangana Congress Praja Chaitanya Yatra Live From Palakurthy | Sakshi
Sakshi News home page

యాత్రకు పోదాం చలో చలో..!

Apr 5 2018 4:11 AM | Updated on Mar 18 2019 8:51 PM

Telangana Congress Praja Chaitanya Yatra Live From Palakurthy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు జోరుమీదున్నారు. యాత్రలు చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్‌ బస్సుయాత్ర ఉత్సాహపూరితంగా కొనసాగుతుండటంతో ఆ పార్టీ నేతలు ఎవరికివారే పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, సీనియర్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి.కె.అరుణ, యువనేత ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తమ తమ పాదయాత్రల షెడ్యూల్‌ తయారు చేసుకుంటున్నారు. భట్టి ఒక అడుగు ముందుకేసి బస్సు యాత్ర కొనసాగుతున్న సమయంలోనే అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఈ నెల 14 నుంచి తన పాదయాత్రను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బస్సుయాత్ర మే 14 వరకు ఉంటుందని, ఆ తర్వాతే నేతలు పాదయాత్రలకు సిద్ధం కావాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతుండటం గమనార్హం.  

ముందు ముగ్గురు.. ఆ తర్వాత ఇద్దరు
వాస్తవానికి, కాంగ్రెస్‌ పార్టీ పక్షాన బస్సుయాత్ర చేయాలని నిర్ణయించినప్పుడే కొందరు నేతల పాదయాత్రలు కూడా ఉంటాయని టీపీసీసీ ప్రకటించింది. భట్టి, రేవంత్, పొన్నం ప్రభాకర్‌లకు ఏఐసీసీ అనుమతినిచ్చిందని, అప్పుడే ఉత్తమ్‌ చెప్పారు. పాదయాత్ర చేయాలనుకుంటున్న నేతలు ఏఐసీసీకి ప్రతిపాదనలు పంపవచ్చని ఉత్తమ్‌ సూచించారు. దీంతో తాము అనుకుంటున్న రూట్లతో కూడిన ప్రతిపాదనలను అందరు నేతలు ఏఐసీసీ అనుమతికి పంపినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి అనుమతి రాగానే పా దయాత్రలు ప్రారంభమవుతాయని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.  

జూన్‌1న ముగింపు సభ
ఈ యాత్రలన్నీ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 1న భారీ బహిరంగ సభకు టీపీసీసీ ప్లాన్‌ చేసింది. హైదరాబాద్‌ లేదా వరంగల్‌లో నిర్వహించే ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రానున్నారు. ఈ యాత్ర ద్వారా పూర్తిస్థాయిలో ఎన్నికల శంఖారావం పూరించాలనేది కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది. డిసెంబర్‌లో లేదా ఏప్రిల్‌లో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బహిరంగసభ తర్వాత పూర్తిస్థాయిలో ఎన్నికల గోదాలోకి దిగాలని, అప్పటి నుంచే అభ్యర్థుల ఎంపి క కసరత్తు, పొత్తుల ప్రతిపాదనలు, చర్చలు, సీట్ల పంపకాల ప్రక్రియ ప్రారంభిస్తామని టీపీసీసీ వర్గాలంటున్నాయి.   

నారూటు నాఇష్టం
నేతల పాదయాత్రలు కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తామని భట్టి, అరుణ, కోమటిరెడ్డి అంటున్నారు. భట్టి తన మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం ఎడవెల్లి నుంచి ఇప్పటికే యాత్ర షెడ్యూల్‌ తయారు చేసుకున్నారు. 14న ‘తెలంగాణ కాంగ్రెస్‌ ఆత్మగౌరవ పాదయాత్ర’పేరుతో ముదిగొండ నుంచి సత్తుపల్లి, కొత్తగూడెం, పినపాక నియోజకవర్గాలను దాటి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా వెళ్లి అక్కడి నుంచి వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి మీదుగా హైదరాబాద్‌ వరకు పాదయాత్ర చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ మేరకు తన నియోజకర్గంలోని స్థానిక పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు కూడా ప్రారంభించినట్టు సమాచారం. భట్టి యాత్రకు పూర్తిస్థాయిలో అనుమతి వస్తే అరుణ, కోమటిరెడ్డి తమ తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌ వరకు యాత్ర చేసే అవకాశాలున్నాయి. రేవంత్‌రెడ్డి ఆలంపూర్‌ జోగులాంబ దేవాలయం నుంచి ఇంద్రవెల్లి అమరుల స్థూపం వరకు పాదయాత్ర చేస్తానని చెపుతున్నారు. పొన్నం ప్రభాకర్‌ కూడా రాజీవ్‌ జాతీయ రహదారిపై కరీంనగర్‌ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement