ప్రజల్లో తిరుగలేకపోతున్నా: సంపత్‌ ఆవేదన

Telangana Congress CLP Meeting at Jana Reddy House - Sakshi

జానారెడ్డి ‍నివాసంలో సీఎల్పీ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి నివాసంలో శనివారం సీఎల్పీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్, జీవన్‌రెడ్డి, పద్మావతి, వంశీచంద్‌రెడ్డి, ఆకుల లలిత తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఎమ్యెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాలో ఉన్నందున ఈ సమావేశానికి హాజరుకాలేదు. 

సంపత్ అసహనం
ఈరోజు జరిగిన సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుపై కోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా శాసనసభాపక్షం సరిగా స్పందించలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోయారని సంపత్‌ ఆవేదన చెందారని సమాచారం. సీఎల్పీ తీరు వల్ల ప్రజల్లో తిరుగలేక పోతున్నట్లు సహచర సభ్యుల వద్ద ఆయన వాపోయారని చెబుతున్నారు. కనీసం గన్‌మెన్‌ల పునరుద్ధరణపై డీజీపీని కూడా కలవలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీలను కలిసి కోర్టు తీర్పు కాపీని త్వరలో అందజేయాలని సీఎల్పీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు సీఎల్పీ సమావేశం ఇంతవరకూ ఇళ్లలో జరగలేదంటూ కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్ దాటరని విమర్శించే తాము ఇంట్లో సీఎల్పీ సమావేశాలు జరపడమేంటని కొందరు నేతలు ప్రశ్నించారట. ఇదే అంశాన్ని పలువురు జానారెడ్డితో నేరుగా చెప్పినట్టు తెలుస్తోంది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top