చతికిలపడ్డ టీడీపీ

TDP Loss Kakinada Municipal corporation Standing Committee Election - Sakshi

ద్వారంపూడి మద్దతుతో కాకినాడ కార్పొరేషన్‌లో నలుగురి గెలుపు

ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న టీడీపీ

స్టాండింగ్‌ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం

కాకినాడ: నిన్న మొన్నటి వరకు కాకినాడ నగరపాలక సంస్థను శాసించిన టీడీపీ ఇప్పుడు ఒక్కసారిగా చతికిలపడిపోయింది. టీడీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్యపోరు నేపథ్యంలో గురువారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ప్రక్రియలో ఆ పార్టీ ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఐదుగురు సభ్యులకుగాను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రతిపాదించిన నలుగురు, టీడీపీ నుంచి ఒకరికి స్టాండింగ్‌ కమిటీలో స్థానం దక్కించుకోనున్నారు. ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన గురువారం పూర్తికాగా, వీరి ఎన్నికైనట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నారు. నగరపాలక సంస్థ ఎన్నికలు జరిగాక గడచిన రెండేళ్లలో ఐదుగురు సభ్యులకుగాను మొత్తం ఐదుగురూ టీడీపీ నుంచే ప్రాతినిధ్యం వహించేవారు. అయితే టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మేయర్‌ సుంకర పావని వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరులో ఆ పార్టీకి చెందిన మెజార్టీ కార్పొరేటర్లు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం స్టాండింగ్‌ కమిటీ ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మద్దతుతో నలుగురు సభ్యులు ఎన్నికయ్యే దిశగా మార్గం సుగమమైంది. టీడీపీ నుంచి ఒకే ఒక్కరికి అవకాశం దక్కింది. దీంతో నగరపాలక సంస్థలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతమైంది.

త్వరలో ‘దేశం’ కార్పొరేటర్ల రాజీనామా
పలువురు టీడీపీ కార్పొటర్లు త్వరలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నారని సమాచారం. పార్టీలో అక్కడి నేతల వైఖరితో విసుగు చెంది త్వరలోనే రాజీనామా బాట పట్టాలని యోచిస్తున్నట్టు చెబుతున్నారు. కొత్తగా స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఇద్దరితోపాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా ఆ పార్టీని వీడనున్నారని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

స్టాండింగ్‌ కమిటీ సభ్యులు వీరే
కాకినాడ నగరపాలక సంస్థ స్టాండింగ్‌ కమిటీ సభ్యులుగా ఐదుగురు ఎన్నిక ఏకగ్రీవం కానున్నారు. గురువారం నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన పూర్తయిన పూర్తయిన తరువాత ఐదు పదవులకు ఐదుగురే నామినేషన్లు వేసినట్టు తేలింది. దీంతో వీరి ఎన్నిక లాంఛనం కానుంది. శుక్రవారం వీరిని అధికారికంగా ప్రకటిస్తారు. ఎన్నికైన సభ్యుల్లో రాగిరెడ్డి చంద్రకళాదీప్తి (30వ డివిజన్‌), ఎంజీకే కిశోర్‌ (22వ డివిజన్‌), సంగాని నందం (26 డివిజ¯Œన్‌), గద్దేపల్లి దానమ్మ (11వ డివిజన్‌) సుంకర శివప్రసన్న(40వ డివిజన్‌) ఎన్నిక కానున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top