భూమాతకు తూట్లు.. పచ్చనేతలకు కోట్లు

TDP Government Has Looted Thousands of Crores of Rupees to its Party Leaders Under The 'Neeru - Chettu' Scheme - Sakshi

సాక్షి, అమరావతి : ‘తివిరి ఇసుకన తైలంబు తీయవచ్చు..’ననిఓ కవి నాడు ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ నేడది నిజం అని నిరూపిస్తున్నారు పచ్చ పాలకులు.. ఇసుక, నీరు, మట్టి, చెట్లు..ఏదైతేనేం దోచుకోవడానికని యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు.. నింగి సాక్షిగా భూమాతకు తూట్లు పొడుస్తూ జేబులు నింపుకుంటున్నారు.. జనమేమనుకుంటారన్న కనీస స్పృహ లేకుండా ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు.. ‘నీరు – చెట్టు’ అంటూ ఆ రెండూ లేకుండా చేయడమే ఎజెండాగా పెట్టుకున్నారు.. 

పోలవరం ప్రాజెక్టులో 11.69 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాలి. గత ఐదేళ్లలో కనీసం మట్టి పనులు కూడా సర్కార్‌ పూర్తి చేయలేకపోయింది. కానీ నీరు–చెట్టు పథకం కింద 91.91 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పూడిక తీత పనులు పూర్తి చేసింది. అంటే.. పోలవరం ప్రాజెక్టులో మట్టి పనుల పరిమాణం కంటే 687 శాతం అధికంగామట్టి పనులు చేసినట్లు స్పష్టమవుతోంది.

ఇంతకూ ఆ మట్టి ఏమైందనేగా మీ అనుమానం..? ప్రజాధనంతో పూడిక తీసిన మట్టిని క్యూబిక్ మీటర్‌కు సగటున కనిష్టంగా రూ.500 చొప్పునటీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు అమ్మేసి దోచుకున్నారు. ఒక్క పూడిక తీసిన మట్టిని అమ్ముకోవడం ద్వారానే రూ.45,955 కోట్లకుపైగా కొల్లగొట్టారు. దోపిడీ అక్కడితో ఆగిపోలేదు.. చెరువుల కట్టలు, తూములకు మరమ్మతులు చేయకుండా చేసినట్లు.. గతంలో చేసిన పనులను తాజాగా చేసినట్లు.. పాత చెక్‌ డ్యామ్‌లకు పైపైన సిమెంటు పూత పూసి.. కొత్తగా నిర్మించినట్లుచూపి రూ.16,291.35 కోట్లు దోచుకున్నారు. పూడిక తీసిన మట్టి ద్వారా రూ.45,955కోట్లు, పనుల్లో రూ.16,291.35కోట్లు వెరసి రూ.62,246.35కోట్ల మేర దోపిడీ చేశారు.ఈ ఘరానా దోపిడీకి నీరు–చెట్టు పథకం కేంద్రమైంది. తిమిరి ఇసుమున తైలంబు పిండవచ్చునో లేదో గానీ పూడిక తీసిన మట్టి ద్వారా రూ.62,246.35 కోట్లు దోచుకున్న తీరు ఇదీ..

రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం నీరు–చెట్టు పథకం కింద  వేలాది కోట్ల ప్రజాధనాన్ని తన పార్టీ నాయకులకు దోచిపెట్టింది. రాష్ట్రంలో చిన్న నీటి వనరుల పరిరక్షణ, భూగర్భజలాల సంరక్షణకు 2015–16లో నీరు–చెట్టు పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. జలవనరుల, అటవీశాఖల నిధులకు ఉపాధి హామీ పథకం నిధులను జత చేసి.. చెరువుల్లో పూడిక తీత, చెరువు కట్టల మరమ్మతు, తూముల మార్పిడి, చెరువులకు నీటిని సరఫరా చేసే సప్లయ్‌ ఛానల్స్‌(వాగులు, వంకలు)లో పూడిక తీత, చెక్‌ డ్యామ్‌ల పునరుద్ధరణ, కొత్త చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం, కాంటూరు కందకాల తవ్వకం, పంట కుంటల తవ్వకం పనులను నీరు–చెట్టు కింద చేపట్టారు.

ఈ పథకం కింద చేపట్టే పనుల్లో రూ.పది లక్షల అంచనా వ్యయంలోపు ఉండే పనులను నామినేషన్‌ పద్ధతిలో అప్పగించే వెసులు బాటు కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. ఈ పథకం కింద పనులు మంజూరు చేసే అధికారాన్ని జిల్లాల కలెక్టర్లకే అప్పగించింది. రాష్ట్రంలో 41,478 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ చెరువుల్లో పూడికతీసే పనులను ఎక్కడికక్కడ టీడీపీ ఎమ్మెల్యేలు సూచించిన ఆ పార్టీ నేతలకే నామినేషన్‌ పద్ధతిలో అప్పగించారు. నిబంధనల మేరకు పూడికతీసిన మట్టిని రైతుల పొలాలకు తరలించాలి. కానీ ఆ మట్టిని టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జ్‌లు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు.
 
నేటికీ కుందు నదీలో మట్టిదిబ్బలు ఎత్తివేయకపోవడంతోమంచినీరు పారే కాలువ మురికినీటిమయం అయిన దృశ్యం.  

మట్టిద్వారా భారీ ఎత్తున దోచుకునే క్రమంలో చెరువులను అడ్డగోలుగా తవ్వేశారు. ఆయకట్టుకు నీటిని విడుదల చేసే తూముల కంటే 10 నుంచి 12 మీటర్ల దిగువ మట్టానికి పూడిక తవ్వేశారు. దీనివల్ల వర్షాలకు అరకొరగా చెరువుల్లోకి చేరిన నీరు కూడా తూములకు అందకపోవడంతో ఆయకట్టుకు విడుదల చేయలేని దుస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో బ్రహ్మలింగయ్య చెరువే అందుకు నిదర్శనం. 2015–16 నుంచి ఇప్పటివరరకూ చెరువుల్లో 91.91 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పూడికను తీశారు. దీన్ని క్యూబిక్‌ మీటర్‌ సగటున కనిష్టంగా రూ.500కు విక్రయించడం ద్వారా రూ.45,955 కోట్లు దోచుకున్నారు.

కుడి, ఎడమల దోపిడీ
చెరువుల కట్టలు, తూముల మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు తీసుకున్నారు. 2013–14కు ముందు చేసిన పనులనే 2015–16, 2016–17, 2017–18, 2018–19లో చేసినట్లు చూపి సొమ్ము చేసుకున్నారు. 96,439 చెక్‌ డ్యామ్‌లను నిర్మించినట్లుగా, 8,46,673 పంట కుంటలు తవ్వినట్లుగా, 8,23,775 జలసంరక్షణ పనులు చేపట్టినట్లుగా.. ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ, క్షేత్ర స్థాయిలో చూస్తే ఆ మేరకు పనులు జరగలేదు. నీరు–చెట్టు కింద చేపట్టిన పనుల్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా తమ దర్యాప్తులో వెల్లడైందని.. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ.. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఇచ్చిన నివేదికలను ప్రభుత్వ పెద్దలు తుంగలోకి తొక్కడమే అందుకు తార్కాణం. పనులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లుల రూపంలో రూ.16,291.35 కోట్ల మేర టీడీపీ నేతలు మింగేశారు. 
వ్రతం చెడ్డా దక్కని ఫలితం
నీరు–చెట్టు పథకంలో చేపట్టిన పనుల వల్ల 86.41 టీఎంసీలు అదనంగా అందుబాటులోకి వచ్చాయని, 7.24 లక్షల ఎకరాలను స్థిరీకరించినట్లుగా సర్కార్‌ ప్రకటించింది. కానీ చిన్న నీటిపారుదల విభాగంలో ఆయకట్టు విస్తీర్ణం 13.24 లక్షల ఎకరాలకు తగ్గడం గమనార్హం. అంటే.. చెరువుల కింద ఉన్న ఆయకట్టులో 12.36 లక్షల ఎకరాల ఆయకట్టు మాయమైనట్లు  స్పష్టమవుతోంది. 91.91 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పూడిక తీసినా.. రూ.16,291.35కోట్లతో చెరువులను అభివృద్ధి చేసినా.. ఆయకట్టు పెరగకపోగా ఉన్న ఆయకట్టులోనే 50 శాతం తగ్గడం గమనార్హం.

పోనీ భూగర్భజలాలు ఏమైనా పెరిగాయా అంటే అదీ లేదు. 2014, మార్చి నాటికి రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 9.21 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం అది 12.19 మీటర్లకు తగ్గింది. అంటే.. భూగర్భజలాలు పెరగకపోగా భారీగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. నీరు–చెట్టు పథకం కింద సర్కార్‌ ఖర్చు చేసిన రూ.16,291.35 కోట్లు.. పూడిక తీసిన మట్టిని అమ్ముకోవడం ద్వారా టీడీపీ నేతలు కాజేసిన రూ.45,955 కోట్లను వెచ్చించి ఉంటే.. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని జలవనరుల శాఖ అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.  
     ఉమ్మడి రాష్ట్రంలో కరవు సహాయక చర్యల్లో భాగంగా..1999 నుంచి 2004 వరకూ కేంద్ర ప్రభుత్వం ‘పనికి ఆహారం’ పథకం కింద పంపిన కోట్లాది టన్నుల బియ్యాన్ని టీడీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు పేదలకు దక్కకుండా చేసి, దారి మళ్లించి వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న సంగతి తెలిసిందే!! 

- ఆలమూరు రామ్‌గోపాల్‌ రెడ్డి, సాక్షి, అమరావతి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top