ఓటమి భయంతోనే ముందస్తు జపం

Tammineni Veerabhadram Slams On KCR Nizamabad - Sakshi

సాక్షి, కామారెడ్డి/నిజామాబాద్‌: ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, దీంతో ప్రజలు తనను ఓడిస్తారన్న భయంతోనే ముందస్తు జపం చేస్తున్నారని బీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ‘బహుజనులకు రాజ్యాధికారం–రాజకీయ పార్టీల వైఖరి’ అంశంపై శుక్రవారం జుక్కల్‌ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దళితుడిని సీఎం చేస్తానని సీఎం కేసీఆర్‌ మోసం చేశాడని, దళితులకు మూడెకరాల భూమి, డబుల్‌ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగమని చెప్పిన హామీలేమి నెరవేరలేదన్నారు. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకునే.. ముందస్తు ఎన్నికలు అంటున్నాడని విమర్శించారు.

రాజ్యాధికారం సాధించకపోవడం వల్లే దశాబ్దాలుగా బడుగు బలహీనవర్గాలు అణచివేతకు గురయ్యాయని, రాజ్యాధికారం ద్వారానే సామాజిక న్యాయం దక్కుతుందని తమ్మినేని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్గాలకు ఎలాంటి న్యాయం జరుగలేదన్నారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామన్న ప్రభుత్వం ఆ మాటను మర్చిపోయి కార్పొరేట్‌ విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. భూమిని దున్నుకుని బతుకుతున్న రైతులకు ఎకరానికి రూ.4 వేల సాయం అందించడం లేదని, అదే వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు రూ.లక్షల కొద్దీ దార పోసిందన్నారు. బీఎల్‌ఎఫ్‌ అధికారంలోకి రాగానే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని, కార్పొరేట్‌ విద్యను రద్దు చేసి, పూర్తిగా ఉచిత విద్య అందిస్తామన్నారు. బీఎల్‌ఎఫ్‌ ప్రభంజనం సృష్టిస్తోందని, మెజారిటీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు.

కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: గద్దర్‌ 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరల భూ పంపిణీ, పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్‌కు ఓటు అనే ఆ యుధంతో బుద్ధి చెప్పాలని ప్రజాగాయకుడు గద్దర్‌ పిలుపునిచ్చారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇస్తానని చెప్పి, రంజాన్‌కు మురిగిపోయిన బి ర్యానీ తినిపిస్తున్నాడని విమర్శించారు. రూ. వెయ్యి పింఛన్‌ ఇస్తానని భార్యాభర్తల మధ్య ఖ య్యం పెట్టిండన్నారు. దళితులకు భూమి లేదు. యువకులకు ఉద్యోగాలు లేవని విమర్శించారు. మహిళల మీద హింస పెరిగి పోయిందని, మంత్రివర్గంలో వారికి స్థానం లేకపోవడం సిగ్గుచేటన్నా రు. 52 శాతం ఉన్న బీసీలు, 12 శాతం ముస్లింలు, 15 శాతం దళితులు, అగ్రవర్ణాల్లోని 6 శాతం పేదలంతా ఏకమై టీఆర్‌ఎస్‌ సర్కారును కూల్చాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు భూమికి పచ్చా ని రంగేసినట్లు, సిరిమల్లె చెట్టుకింద లచ్చుమ మ్మో, దొర నీ టైం అయింది, సాల్‌ దొర నీ పాలన తదితర పాటలతో గద్దర్‌ అలరించారు.

పలు తీర్మానాలు.. 
జుక్కల్‌ సభలో పలు తీర్మానాలు చేశారు. నియోజకవర్గంలోని 4 వేల మంది రైతులకు సంబంధించి 16 వేల ఎకరాల భూములకు పట్టాలు, పాసుబుక్కులతో పాటు పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ తీర్మానించారు. బిజ్జల్‌వాడి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే చేపట్టాలని సభలో తీర్మానించారు. మద్నూర్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, లెండి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కౌలాస్‌ కాలువల మరమ్మతులు చేయాలని సభలో తీర్మానించారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు సాయిలు, బీఎల్‌ఎఫ్, సీపీఎం వెంకట్‌రాములు, చంద్రశేఖర్, జడ్గె రవీందర్, సురేష్‌గొండ, విఠల్, బాల్‌రాజ్, మనోజ్, రాములు, భరత్‌ వాగ్మారే, శ్రీనివాస్, బాలు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top