మరో పోరాటానికి ఈ గడ్డ వేదిక : సోనియా గాంధీ

Soniya Gandhi Speech In Medchal Meeting - Sakshi

టీఆర్‌ఎస్‌ను గద్దె దించాలి

నాలుగున్నరేళ్లలో ప్రజల బతుకులు మారలే

నాడు ఓవైపు తెలంగాణ..మరోవైపు ఆంధ్రా

ఏపీ ప్రత్యేక హోదాకి కట్టుబడి ఉన్నాం

కాంగ్రెస్‌ మేడ్చల్‌ బహిరంగ సభలో సోనియా గాంధీ

సాక్షి, మేడ్చల్‌ :  ఆరు దశాబ్దాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ సర్వనాశనం చేసిందని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలు కోరుకున్న హక్కుల మేరకు రాష్ట్రంలో పాలనలేదని ఆమె మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్‌లో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ గడ్డమీద అడుగుపెడితే తన సొంత తల్లి దగ్గరికి వెళ్లినట్లు ఉందని, ప్రజల కోరిక మేరకు ఎంతో కష్టమైన తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందని ఆమె వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరుగుతుందని తెలిసినా తప్పని పరిస్థితుల్లో ప్రజల పోరాటాన్ని గుర్తించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు.

రాష్ట్రం ఏర్పడినా బతుకులు మారలే..
సభలో సోనియా మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతున్న సమయంలో జరిగిన పరిణామాలు ఇంకా నాకళ్లు ముందున్నాయి. ఒకవైపు తెలంగాణ ప్రజల పోరాటం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీల సహకారం మేరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశాం. అదే సమయంలో ఏపీ ప్రజలు నష్టపోవద్దని ప్రత్యేక హోదాను విభజన బిల్లులో పొందుపరిచాం. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాగానే ఏపీ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలుచేసి తీరుతాం. తెలంగాణ రాష్ట్రం కోసం ఇక్కడి ప్రజలు ఏవిధంగా అయితే పోరాటం చేశారో..ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు మరోసారి అలాంటి పోరాటానికి తెలంగాణ గడ్డ వేదిక కావాలి. నాలుగున్నర ఏళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలు బతుకులు ఏమీ బాగుపడలేదు. నీళ్లు, నిధులు,నియామకాలు అనే నినాదంతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. కానీ నేడు టీఆర్‌ఎస్ పాలనలో వాటికోసమే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఉద్యోగాలు లేవని నిరుద్యోగులు, నీళ్లు, గిట్టుబాటు ధర లేదని రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు’’ అని అన్నారు.

మన భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు..
సోనియా గాంధీ ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడితే అన్ని వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన ఉంటుంది. రైతులకు మేలు చేసేందుకు వీలుగా నాడు యూపీయే ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్టానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తూట్లు పొడిచింది. మహాత్మా గాంధీ ఆశయాల మేరకు తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడంలేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన తరుణం ఆసన్నమైంది. ఇప్పడు జరగబోయే ఎన్నికలు ప్రజలు భవిష్యత్తున్ని నిర్ణయించేవి. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను, మహాకూటమిని గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని వ్యాఖ్యానించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top