కేసీఆర్‌ను గద్దె దింపుతాం 

Revanth Reddy fires on KCR - Sakshi

     మాయమాటలతో ప్రజలను వంచించారు 

     కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలిస్తాం 

     కామారెడ్డి రోడ్‌షోలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి  

సాక్షి, కామారెడ్డి: ‘తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది యువకులు ఆత్మబలిదానాలు చేస్తే చలించిపోయిన సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చింది. అయితే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌ అందరినీ వంచించాడు’అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘కేసీఆర్‌ను గద్దె దింపేతందుకు అందరూ సిద్ధం కండ్రి.. వంద రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తది’అని పేర్కొన్నారు. ఆదివారం భిక్కనూరు, కామారెడ్డిలోని నిజాంసాగర్‌ చౌరస్తాల లో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. గతంలో వై.ఎస్‌.ఆర్‌. నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం ద్వారా లక్షలాది మంది పేద విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. అయితే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆ పథకానికి తూట్లు పొడిచిందని ఆరోపించారు. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాం క్షను సోనియాగాంధీ నెరవేర్చారని రేవంత్‌ పేర్కొన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాలకు కేసీఆర్‌ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్‌ మాయమాటలు నమ్మిన నిరుద్యోగులను నయవంచన చేశారని పేర్కొన్నారు.   

ఉద్యోగాలు ఎక్కడ? 
‘ఇంటికో ఉద్యోగం లేదు, డబుల్‌ బెడ్‌రూం రాదు, మూడెకరాల భూమి ఇయ్యలేదు, కేజీ టు పీజీ ఉచిత విద్య ఎటుపోయిందో, రైతుల రుణమాఫీ అన్నడు ఇప్పటికీ పాసుబుక్కులు బ్యాంకులల్లనే ఉన్నయి’అంటూ సీఎం కేసీఆర్‌పై రేవంత్‌ దుమ్మెత్తిపోశారు. టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో వేలాది మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ పెళ్లిళ్లు వాయిదా వేసుకుని ముదిరిపోతున్నరని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఒక్క కేసీఆర్‌ ఉద్యోగం ఊడగొడితే లక్ష ఉద్యోగాలు వంద రోజుల్లో వస్తాయని అన్నారు. ఉద్యోగాలు అడిగితే గొర్రెలు, బర్రెలంటూ దగా చేస్తున్నాడన్నారు. ‘ఎల్లారెడ్డిలో తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డికి దళితుల భూములు సరిపోలేదట, ప్లాసిక్‌ పైపుల కం పెనీలు సరిపోలేదట. కామారెడ్డి తాజా మాజీ ఎమ్మె ల్యే గంపను బోర్లెయ్యాలి, ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగును తరిమెయ్యాలి’అని రేవం త్‌ ప్రజలను కోరారు. మైనారిటీలకు కాంగ్రెస్‌ ప్రభు త్వం 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని అయితే, 12 శాతం ఇస్తానని కేసీఆర్‌ వారిని మోసం చేశారని అన్నారు.  

ఆరడుగులాయన అలిగిండట.. 
‘కేసీఆర్‌ మేనల్లుడు.. ఆరడుగుల హరీశ్‌రావు అలిగిండంటున్నరు. ఈ అలుగుడు ముచ్చట గూడ ఒక డ్రామానే’అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. బావ, బామ్మర్దులు ఏదో కొట్లాడినట్టు నాటకాలు ఆడుతూ ప్రజల దృష్టిని మల్లిస్తరని, తెలంగాణను దోచుకోవడంలో అందరూ ఒక్కటేనని ధ్వజమెత్తారు. కామారెడ్డిలో షబ్బీర్‌అలీ గెలిస్తే రాష్ట్రంలో నంబర్‌ వన్‌ లేదా నంబర్‌ టూ ఉంటరని పేర్కొన్నారు.  

బాల్క సుమన్‌ కాదు.. బానిస సుమన్‌ 
పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌ను బానిస సుమన్‌.. అంటూ రేవంత్‌రెడ్డి ఘాటుగా విమర్శించారు. తనను ఉరికిచ్చి కొడతనని, నాలుక కోస్తనని తెగ మాట్లాడిన బాల్క సుమన్‌ను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఉరికిస్తరని అన్నారు. తమ కార్యకర్తలు బాల్క సుమన్‌ను చెట్టుకు కట్టేసి తొండలు సొరగొడతారని హెచ్చరించారు. రోడ్‌షోలో శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ, కాంగ్రెస్‌ నేతలు తాహెర్‌బిన్‌ హందాన్, నల్లమడుగు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top