
మంగళవారం గాంధీభవన్‌లో నిరుద్యోగ చైతన్యయాత్ర ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్. చిత్రంలో కుంతియా, అనిల్‌కుమార్, భట్టి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తామని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యామ్నాయమని ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్.సి.కుంతియా వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌లో అన్ని సామాజిక వర్గాలను ఏకం చేసినట్టుగానే రాష్ట్రంలోనూ ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ వంటి వారందరినీ ఏకం చేస్తామని ప్రకటించారు. దీనికోసం పీసీసీ స్థాయిలో సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రజాస్వామిక శక్తులన్నీ కాంగ్రెస్‌లో చేరడమో, కాంగ్రెస్‌తో కలిసి పని చేయడమో తప్పదని పేర్కొన్నారు. వచ్చే వారం నుంచి టీఆర్‌ఎస్‌తో సహా మిగిలిన పార్టీల నేతల చేరికలు నిరంతరంగా ఉంటాయన్నారు. ఇక పొత్తులు, కూటమి, సర్దుబాట్లు వంటివన్నీ ఎన్నికల సమయంలో తేలుతాయని, వీటిపై టీపీసీసీ ప్రకటన చేస్తుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సారథిగా ప్రొఫెసర్ కోదండరాంపై గౌరవముందని, ఆయన రాజకీయ పార్టీపై ఇప్పుడేమీ చెప్పలేమని అన్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ప్రతిరూపంగా నిలిచిన కోదండరాంను కాంగ్రెస్ ఏజెంటు అంటూ మాట్లాడటం సరికాదన్నారు. కోదండరాంతో వైరం అవసరం లేదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, అయితే రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర ఎంతో కీలకమనేది అందరూ అంగీకరించాల్సిన వాస్తవమని వ్యాఖ్యానించారు.
జూన్ 2న హైదరాబాద్‌లో సభ
టీఆర్‌ఎస్ ఓడిపోతుందని స్వయంగా మంత్రి కేటీఆరే వ్యాఖ్యానించారన్నారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాదయాత్రలు ఉంటా యని తెలిపారు. మూడు లేదా నాలుగు బృం దాలు పాదయాత్రలుగా జూన్ 2న హైదరాబాద్‌కు చేరాలనే ప్రతిపాదన ఉందని, దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన వస్తుందని వెల్లడించారు. జూన్ 2న హైదరాబాద్‌లో 10 లక్షల మందితో జరిగే బహిరంగ సభకు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని వెల్లడించారు.
అంతకుముందు వరంగల్, మహబూబ్‌నగర్ లేదా మెదక్‌లోనూ రాహుల్ గాంధీ పాల్గొంటారని చెప్పారు. స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే చేరికలపై నిర్ణయాలు ఉంటాయని, నాగం జనార్దన్‌రెడ్డిని చేర్చుకోవద్దంటూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. ఎన్నికలకు చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.
కువైట్‌కు కాంగ్రెస్ బృందం
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 12న కాంగ్రెస్ బృందం కువైట్‌కు వెళ్తుందని కుంతియా వెల్లడించారు. గల్ఫ్ బాధితులకు కాంగ్రెస్ భరోసా కల్పిస్తుందని తెలిపారు. గల్ఫ్‌లో క్షమాభిక్ష (ఆమ్నెస్టీ) ద్వారా 30 వేల మంది భారతీయ కార్మికులు దేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్మికులకు ఉచితంగా టికెట్లను అందించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందిస్తామని హామీ ఇచ్చి, సీఎం అయిన తర్వాత కేసీఆర్ మోసం చేస్తున్నారని విమర్శించారు.
ఉద్యోగాలు భర్తీ చేయలేని దద్దమ్మ కేసీఆర్: ఉత్తమ్
ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేని దద్దమ్మ అని టీపీసీసీ అ«ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. నాలుగేళ్లయినా ఏడు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేకపోయిం దని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే నాటికే లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని.. పదవీ విరమణ చేసిన, కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి 2 లక్షలు ఖాళీగా ఉన్నాయన్నారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ నేతృత్వంలో నిరుద్యోగ చైతన్య యాత్రను మంగళవారం జెండా ఉత్తమ్ ప్రారంభించారు. అలంపూర్‌లో బుధవారం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర.. 119 నియోజకవర్గాల్లో 49రోజుల పాటు సాగుతుందన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను ఎలా మోసం చేస్తున్నదో, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎలా న్యాయం చేయనుందో వివరించడమే యాత్ర లక్ష్యమ న్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మంత్రి కేటీఆర్ సూటు, బూటు వేసుకుని విదేశాల్లో విలాసాలు చేసుకుంటున్నారని ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు.