రాహుల్‌ గాంధీ సంచలన ప్రకటన

Rahul Gandhi Statement on PM Post - Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రధానమంత్రి పదవి చేపట్టే విషయంలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలిసారిగా పెదవి విప్పారు. 2019లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే తానే ప్రధాని అవుతానని ఆయన చెప్పారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019లో కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధాని పదవిని చేపడతారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘అవును’ అని రాహుల్‌ సమాధానం ఇచ్చారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని రాహుల్‌ గాంధీ అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని(యడ్యూరప్ప) ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారని బీజేపీని మరోసారి ప్రశ్నించారు. 35 వేల కోట్ల రూపాయలు దోచుకున్న గాలి జనార్దన్‌రెడ్డి వర్గానికి 8 సీట్లు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో యువతకు ప్రధాని మోదీ సమాధానం
చె​ప్పాలన్నారు.

కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం
ప్రధాని పదవిపై రాహుల్‌ మనసులో మాట బయటపెట్టడంతో కాంగ్రెస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానమంత్రి పదవిని చేపట్టే విషయంలో యువనేత స్పష్టత ఇవ్వడంతో హస్తం పార్టీ నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటివరకు రాహుల్‌ ఈ విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. అటు బీజేపీ కూడా కాంగ్రెస్‌పై ఎదురుదాడికి పలు సందర్భాల్లో ఈ అంశాన్ని అస్త్రంగా మలుచుకుంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి దీటైన సమాధానం చెప్పేందుకు కాంగ్రెస్‌ నాయకులు తటపటాయించేవారు. రాహుల్‌  తాజా ప్రకటనతో కాంగ్రెస్‌ శ్రేణులకు కొత్త శక్తి వచ్చినట్టైంది. మరోవైపు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ ప్రకటన ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top