రాహుల్‌ పర్యటనకు టీపీసీసీ ఏర్పాట్లు

Rahul Gandhi Finalized The Hyderabad Tour - Sakshi

జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో బస్సుయాత్ర

మహిళా సంఘాలు, ఓయూలో విద్యార్థులతో భేటీ

పత్రికా ప్రముఖులతో సమావేశాలు

కసరత్తు చేస్తున్న ఉత్తమ్‌.. సోమవారం నాటికి తుది షెడ్యూల్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన కోసం తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(టీపీసీసీ) భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 13,14 తేదీల్లో తెలంగాణలో పర్యటించేందుకు రాహుల్‌ అంగీకరించడంతో ఆ రెండు రోజుల్లో వివిధ చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించాలని యోచిస్తోంది.

రాహుల్‌ గాంధీ ఎక్కడెక్కడ పర్యటించాలన్న దానిపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు. కాగా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే రాహుల్‌ పర్యటనను పరిమితం చేయాలని నిర్ణయించిన టీపీసీసీ ఆ దిశగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.  

మహిళా సంఘాలతో సమావేశం
టీపీసీసీ వర్గాలు అనధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం 13న మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయంలో రాహుల్‌ దిగనున్నారు. అక్కడనుంచి కార్యకర్తలు మోటార్‌సైకిళ్ల ర్యాలీతో ఆయనకు స్వాగతం పలకనున్నారు. ఆ తర్వాత రాజేంద్రనగర్‌లో మహిళా సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారు. అనంతరం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నిర్వ హించే బస్సుయాత్రలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత నాంపల్లి నియోజకవర్గంలో సభ నిర్వహిస్తారు. అనంతరం ముస్లిం ప్రముఖులు, మేధావులతో సమావేశమవుతారు. హోటల్‌ హరితప్లాజాలో ఆ రాత్రి బస చేస్తారు.  

పెద్దమ్మగుడిలో పూజలు..ప్యారడైజ్‌లో లంచ్‌  
ఇక, 14వ తేదీ ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మగుడికి వెళ్లి రాహుల్‌ పూజలు చేస్తారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్, ఖైరతాబాద్‌ నియోజకవర్గాల సమావేశాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత వ్యాపార ప్రముఖులు, పత్రికా సంపాదకులతో వేర్వేరుగా సమావేశమవుతారు. అక్కడి నుంచి ప్యారడైజ్‌ హోటల్‌లో లంచ్‌ చేస్తారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో సమావేశమవుతారు.

సికిం ద్రాబాద్, సనత్‌నగర్, గోషామహల్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆ తర్వాత కులీకుతుబ్‌షా స్టేడియంలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మదీనా హోటల్‌లో రాత్రి విందు అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. అయితే, ఈ షెడ్యూల్‌లో కొన్ని మార్పు చేర్పులు ఉండే అవకాశముందని, సోమవారం నాటికి తుది షెడ్యూల్‌ ఖరారవుతుందని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్‌గాంధీ కార్యాలయం అంగీకారం తెలిపిన అనంతరం మంగళవారం షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top