ఆయన పాలనంతా డొల్లే

Punjab Minister Navjot Singh Sidhu Fires On TRS Govt - Sakshi

కేసీఆర్‌పై పంజాబ్‌ మంత్రి సిద్ధూ ఆరోపణలు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కేసీఆర్‌ పాలన వెదురు బొంగులా లోపలంతా డొల్లగా ఉందని కాంగ్రెస్‌ నేత, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పైకి చాలా గొప్పలు చెబుతున్నా.. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మాత్రం దారుణంగా మారిందన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలి కానీ.. ఇక్కడ ఒక కుటుంబం కోసం ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో 75 శాతం ప్రజలు అరకొర సంపాదనతో కాలం వెల్లదీస్తుంటే, కేసీఆర్‌ మాత్రం తన కోసం రూ.300 కోట్ల బంగ్లా కట్టుకుని బయటికి రాకుండా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్‌ రూ.17 వేల కోట్ల మిగులు రాష్ట్రాన్ని రూ.2 లక్షల 40 వేల కోట్ల అప్పులమయం చేశారని ఆరోపించారు. కేటీఆర్‌ ఆస్తుల్ని నాలుగు వందల రేట్లు పెంచుకున్నారని దుయ్యబట్టారు.  

కేసీఆర్‌ బాబా.. చార్‌ చోర్‌
ఆలీబాబా చాలీస్‌ చోర్‌లా తెలంగాణలో కేసీఆర్‌ బాబా చార్‌ చోర్‌గా పరిస్థితి ఉందని, కేసీ ఆర్‌ ఆలీబాబా అయితే.. నలుగురు దొంగలు కేటీఆర్, కవిత, హరీశ్, సంతోష్‌లని సిద్ధూ అభివర్ణించారు. ‘మహిళల సాధికారత అంటే కేసీఆర్‌ దృష్టిలో ఆయన కూతురు ఒక్కరే.. ఎన్ని ఉద్యోగాలిస్తామని ఎన్ని ఇచ్చారు.. మీ హామీ మేరకు ముస్లిం యువకులు రిజర్వేషన్‌ అడిగితే తప్పేంటి’అని సీఎం కేసీఆర్‌ను సిద్ధూ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని, దళిత సీఎం అని ఊసరవెల్లి కంటే వేగంగా రం గులు మార్చి గద్దె పైన కూర్చున్న ఘనుడు కేసీఆర్‌ అని దుయ్యబట్టారు. కేసీఆర్‌ ఓ జాదూగర్‌ అని.. ఒక్క ప్రాణహిత ప్రాజెక్టులోనే రూ.40 వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

దొందూ దొందే..
ప్రధాని  మోదీ.. కేసీఆర్‌.. దొందూ దొందే అని సిద్ధూ విమర్శించారు. మోదీ కూడా విదేశాల్లో దాచిన రూ.90 లక్షల కోట్ల నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ఇప్పటివరకు చేసింది ఏం లేదన్నారు. రూ.వేల కోట్ల అప్పులు చేసిన అదానీ, అంబానీలను కనీసం పట్టించుకోరని విమర్శించారు. రైతులకు మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top