ప్రజల్ని మభ్యపెట్టేందుకు బాబు డ్రామాలు | Public letter of BJP leader Amit Shah to the people of the state | Sakshi
Sakshi News home page

ప్రజల్ని మభ్యపెట్టేందుకు బాబు డ్రామాలు

Feb 12 2019 5:11 AM | Updated on Feb 12 2019 5:11 AM

Public letter of BJP leader Amit Shah to the people of the state - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి రాజకీయ పతనం వేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఆయన మళ్లీ చిల్లర డ్రామాలకు తెరతీశారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. చంద్రబాబును విమర్శిస్తూ, రాష్ట్రానికి తామేమి చేశామో వివరిస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని చంద్రబాబు కోల్పోయారని, అందువల్లే వివిధ వర్గాలను ఆకర్షించేందుకు రకరకాల తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసే పలుమార్లు యూటర్న్‌లు తీసుకున్నారని చెప్పారు. ఆయన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేంద్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి ప్రధాని వచ్చినపుడు కనీసం మర్యాదపూర్వకంగానైనా ఆహ్వానించని చంద్రబాబు.. హద్దులు దాటి మోదీని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా, ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్‌ పక్షాన ఇప్పుడు చంద్రబాబు చేరడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు మళ్లీ పట్టం కట్టాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. 

హోదా సంజీవిని కాదన్నారు
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినపుడు చంద్రబాబు దానిని స్వాగతించారని, అదే సమయంలో ప్రత్యేక హోదా సంజీవిని కాదని, దానితో రాష్ట్రాలేవీ అభివృద్ధి చెందలేదని చెప్పారన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే వారిని అరెస్టు చేయించారని గుర్తుచేశారు. ఈ విషయంలో ఆయన పూర్తిగా యూటర్న్‌ తీసుకున్నారని చెప్పారు. ఏపీ ప్రజల అభివృద్ధిపై కాంగ్రెస్‌ పాలకులకు ఎప్పుడూ చిత్తశుద్ధిలేదని, ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టలేదని, అలాగే పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపలేదని చెప్పారు. అలా ఎందుకు చేశారో చంద్రబాబు, కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలన్నారు. ముంపు మండలాల విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంటే.. దాన్ని కూడా తన గొప్పగా చంద్రబాబు చెప్పుకున్నారని విమర్శించారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇరిగేషన్‌ కాంపోనెంట్‌ కింద 1.4.14 నుంచి ఇప్పటి వరకూ రూ. 6,764.70 కోట్లు విడుదల చేశామని వివరించారు. విభజన చట్టంలో ఉన్న వాటిని ప్రధాని మోదీ అమలు చేయడమే  కాకుండా ఏపీ సత్వర అభివృద్ధికి మరింత ముందడుగు వేశారన్నారు. చంద్రబాబులో కాంగ్రెస్‌ రక్తం ప్రవహిస్తోందని తమకు తెలుసునని, అయితే కాంగ్రెస్‌ను అధిగమించి అబద్ధాలు, అసత్యాలు చెప్పడంతో పాటు మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విద్వేష పూరిత ప్రచారం చేయటాన్ని మాత్రం తాము ఊహించలేదన్నారు. ఇప్పుడు తన చెప్పుచేతల్లోని మీడియాతో కేంద్రంపై దుష్ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్‌కు తొత్తుగా మారారని విమర్శించారు. 

వేగవంతంగా చట్టాన్ని అమలు చేస్తున్నాం
విభజన చట్టాన్ని పదేళ్లలో అమలు చేయాలని ఉన్నా.. ఎన్‌డీఏ ప్రభుత్వం ఆ చట్టంలోని అంశాలను వేగవంతంగా మంజూరు చేయడమే కాకుండా, వాటికి కావాల్సిన నిధులను కూడా ఇచ్చిందని అమిత్‌ షా చెప్పారు. స్వాతంత్యాన్రంతర భారత్‌లో ఇన్ని ప్రాజెక్టులు ఒక రాష్ట్రానికి ఇంత తక్కువ కాలంలో ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఇదే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి పట్ల తమ చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. కాకినాడ వద్ద లక్ష కోట్ల రూపాయలతో చేపట్టేపెట్రోకెమికల్‌ ప్రాజెక్టుకు ఎంవోయూ పూర్తయిందని, వైజాగ్‌–చెన్నై పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నామని, కృష్ణపట్నం, చెన్నై, బెంగళూరు గ్రోత్‌ కారిడార్‌ను మంజూరు చేశామని తెలిపారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, రూ. 50 వేల కోట్లతో చేపట్టిన రైల్వే మార్గాల అభివృద్ధి వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. అమరావతి రైలు మార్గానికి రూ. 2,679.59 కోట్లతో అనుమతి తెలిపామన్నారు.

అనంతపురం–అమరావతి ఎక్స్‌ప్రెస్‌వేకి రూ. 20 వేల కోట్లు ఇవ్వడానికి ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించిందని, రూ. 7,015 కోట్లతో బకింగ్‌హమ్‌ కాలువ పునరుద్ధరించడం మరో ప్రధాన ప్రాజెక్టు అని చెప్పారు. రూ. లక్ష కోట్ల విలువైన రోడ్లు, భూ ఉపరితల జలరవాణా మార్గాలకు అనుమతి ఇచ్చామన్నారు. రాజధానిలో మౌలిక వసతులు తదితరాలకు రూ. 2500 కోట్లు ఇచ్చామన్నారు. ఏరాష్ట్రానికి ఇవ్వనన్ని ఎక్కువగా 11.29 లక్షల ఇళ్లను ఏపీకి మంజూరు చేశామన్నారు. అలాగే ఎన్నో పథకాల్లో ఏపీకి ప్రాధాన్యమిచ్చామన్నారు. వెనుకబడ్డ జిల్లాల్లో పరిశ్రమలు స్థాపించేవారికి రాయితీలు ఇస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల యోజనతో ఏపీలో నిరంతర విద్యుత్‌ సాధ్యమైందన్నారు. రూ. 24,000 కోట్లతో సౌరవిద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు 2.2 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు సరఫరా చేశామన్నారు. ఇక విశాఖ, విజయవాడ మెట్రో రైల్‌ ప్రాజెక్టు రివైజ్‌డ్‌ ప్రతిపాదనల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. దుగరాజపట్నం పోర్టుకు ప్రత్యామ్నాయంగా మరో ప్రాంతాన్ని సూచించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకూ ప్రతిపాదనలు పంపలేదన్నారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు నిధులు కేటాయించకుండా రాజకీయ ఉద్దేశాలతో శంకుస్థాపన చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. రైల్వే జోన్‌ ఏర్పాటుపై రైల్వే కమిటీ పరిశీలన పూర్తయిందని, అంతర్రాష్ట్ర ఇబ్బందులు, నిర్వహణలో ఉన్న చిక్కుల విషయంలో పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. 

అంత్య దశలో బాబు మోసపూరిత రాజకీయాలు
ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అడ్డంకిగా నిలిచాయని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ప్రత్యేక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నామని అమిత్‌ షా పునరుద్ఘాటించారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఎస్‌పీవీని ఏర్పాటు చేయడానికి అధికారుల మధ్య అంగీకారం కుదిరిందని, అయితే ఇప్పటి వరకూ దానిపై రాష్టప్రభుత్వ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈఏపీ కింద ప్రత్యేక సాయం అందించడానికి కేంద్రం ముందుకొచ్చినా.. ప్రతిపాదనలు సమర్పించడంలో చంద్రబాబు సర్కార్‌ విఫలమైందని విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం సూచనలను అనుసరించి ఇప్పటి వరకూ రాష్ట్రానికి రూ. 1,37,977.25 కోట్లు విడుదల చేశామన్నారు. వివిధ మంత్రిత్వ శాఖల నుంచి ఇప్పటి వరకూ రూ. 3 లక్షల కోట్లు కేటాయించామన్నారు. వీటిని చూస్తే ఏపీకి కేంద్రం ఎంత ప్రాముఖ్యతనిస్తోందో అర్థమవుతుందన్నారు. ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు వమ్ము చేశారని, ఆయన మోసపూరిత రాజకీయాలు క్లైమాక్స్‌కు వచ్చాయని అమిత్‌ షా చెప్పారు. ప్రజలపై తమకు అపార నమ్మకం ఉందని, ప్రజలు, ప్రభుత్వం కలసి ఏపీ, ఇండియా అభివృద్ధికి పాటుపడదామని పిలుపునిచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement