సహనశీలతే భారతీయత

Pranab Mukherjee at RSS event - Sakshi

ద్వేషం, అసహనం, హింసలను విడనాడాలి

భిన్నత్వంలో ఏకత్వమే మన బలం

శాంతి, సామరస్యం, సంతోషం ముఖ్యం

భారతీయలు ఆశలు, ఆకాంక్షల ప్రతిరూపమే మన రాజ్యాంగం

ఆరెస్సెస్‌ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉద్ఘాటన

ప్రణబ్‌ స్పందించారు. ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని మన్నించినప్పటి నుంచి వస్తున్న వరుస విమర్శలకు నాగపూర్‌లో జూన్‌ 7వ తేదీననే జవాబిస్తానన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌.. చెప్పినట్లే ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయం వేదికగా గురువారం ఆ విమర్శలకు జవాబిచ్చారు. అనుమానాలు తీర్చారు. సహనశీలతే భారతీయ ఆత్మ అని స్పష్టం చేశారు. జాతీయవాదం ఏ మతానికో, జాతికో సొంతం కాదని తేల్చి చెప్పారు.

హిందూ, ముస్లిం, సిఖ్, ఇతర అన్ని వర్గాల సిద్ధాంతాల సమ్మేళనమే జాతీయవాదమని నిర్వచించారు. ద్వేషం సమాజ సామరస్యతను నాశనం చేస్తుందని, అభిప్రాయ బేధాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని హితవు పలికారు. అసహనం, వితండవాదం, మతం ఆధారంగా భారత్‌ను నిర్వచించాలనుకునే ఏ ప్రయత్నమైనా చివరకు దేశ అస్తిత్వాన్నే పలుచన చేస్తుందని హెచ్చరించారు. కోపం, హింస, ఘర్షణల నుంచి శాంతి, సంతోషం, సామరస్యం దిశగా మనమంతా ముందుకెళ్లాలన్నారు.  

నాగపూర్‌: ద్వేషం, అసహనం దేశ అస్తిత్వాన్ని బలహీనపరుస్తాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. నాగపూర్‌లోని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ప్రధాన కార్యాలయంలో గురువారం స్వయం సేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంసేవకులు జరిపిన ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్, ఆ తరువాత ప్రణబ్‌ స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరెస్సెస్‌ ఆహ్వానాన్ని ప్రణబ్‌ మన్నించడం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. దేశం దృష్టి అంతా ఈ కార్యక్రమం పైనే ఉంది. కార్యక్రమంలో ప్రణబ్‌ మాట్లాడుతూ.. దేశం, జాతీయవాదం, దేశభక్తిపై తన ఆలోచనలను పంచుకునేందుకే ఇక్కడికి వచ్చానన్నారు. శతాబ్దాల భారత చరిత్ర, ముస్లిం దురాక్రమణలు, వివిధ సామ్రాజ్యాల ఏర్పాటు, బ్రిటిష్‌ పాలన..తదితర భారత చరిత్రలోని పలు ముఖ్యమైన ఘట్టాలను,  ఆయన తన ప్రసంగంలో గుర్తుచేశారు.

ప్రణబ్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
► ముందుగా మనం దేశం, జాతీయవాదం, దేశభక్తి అనే మూడు పదాల డిక్షనరీ అర్థాలను తెలుసుకుందాం.

► దేశమంటే.. ఒకే సంస్కృతి, ఒకే భాష, చరిత్ర, అలవాట్లను కలిగి ఉన్న ప్రజల సమూహం. జాతీయవాదం అంటే.. ఒక దేశానికి ఉండే గుర్తింపు, ఆ దేశ ప్రయోజనాలకు ఉండే మద్దతు. దేశభక్తి అంటే ఒకరికి తమ దేశంపై ఉండే ఆత్మసమర్పణ, నిబద్ధత.

► భారత్‌ ఓ బహిరంగ సమాజం.. పట్టు, సుగంధ ద్రవ్యాల ద్వారా ప్రపంచంతో అనుసంధానమైంది. వీటి వాణిజ్య మార్గాల ద్వారా మన సంస్కృతి, విశ్వాసం వంటివి వ్యాపారులు, మేధావుల ద్వారా కొండలు, లోయలు, సముద్రాలు దాటి ప్రపంచమంతా వ్యాపించాయి. హిందుత్వంతో సహా బౌద్ధం మధ్య ఆసియా, చైనాలకు పాకింది. మెగస్తనీస్, హుయనుత్సాంగ్‌ వంటి వారు భారత సమర్థవంతమైన పాలనా విధానం, గొప్ప మౌలికవసతులతో కూడిన వ్యవస్థలను తమ పుస్తకాల్లో పేర్కొన్నారు. తక్షశిల, నలంద, విక్రమశిల, వలభి, సోమపుర, ఓదంతపురి వంటి విశ్వవిద్యాలయాలు మన పురాతన విద్యా విధానాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. చాణిక్యుడి అర్థశాస్త్రం నాటి పరిపాలన తీరుకు నిదర్శనం.  

► ఆ తర్వాత దేశమంతా విస్తరించిన 16 మహాజనపదాలు, చంద్రగుప్త మౌర్యుడు గ్రీకులకు ఓడించి బలమైన భారత సామ్రాజ్యాన్ని నిర్మించడం, తర్వాత అశోకుడు ఆదర్శవంతమైన పాలనను అందించడం.. గుప్తులతోపాటు ఎందరో రాజులు ముస్లిం దురాక్రమణ దారులను అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. 300 ఏళ్లపాటు ముస్లిం పాలకులు దేశాన్ని పాలించడం ఇవన్నీ దేశ చరిత్రలో మైలురాళ్లు. వ్యాపారం కోసం వ
చ్చిన బ్రిటిషర్లు 190 ఏళ్లు దేశాన్ని తమ బానిసత్వంలో ఉంచుకోవడం మధ్యలో ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ఇవన్నీ మనం మరిచిపోలేం. 2500 ఏళ్ల పాటు దేశంలో ఎన్నో రకాలుగా మారిన రాజకీయ పరిస్థితుల్లోనూ 5వేల ఏళ్లకు పైగా మన నాగరిత ఇంకా కొనసాగుతుండటమే భారత్‌ గొప్పదనానికి నిదర్శనం.

► దేశాన్ని ఒక్కటిగా ఉంచడం, జాతీయత భావాన్ని పెంపొందించడంలో జవహార్‌లాల్‌ నెహ్రూ, రవీంద్రనాథ్‌ ఠాగూర్, బాల గంగాధర్‌ తిలక్‌ తదితరులను సేవలు మరిచిపోలేనివి. 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చేసిన కృషి వల్లే మనమంతా ఒకే ఒకదేశంగా మారాం.

► భారతదేశం గొప్పదనం ఇక్కడి బహుళత్వం, సహనంలోనే ఉంది. శతాబ్దాలుగా మన ప్రజల సహజీవనం నుంచే ఈ బహుళత్వం పుట్టింది. లౌకికవాదం, సమగ్రత మన విశ్వాసాలు.

► మనం 130 కోట్ల మంది భారతీయలం.. 122 భాషల్లో, 1600 యాసల్లో మాట్లాడుకుంటాం. ఏడు ప్రధాన మత విశ్వాసాలను పాటిస్తాం. అయినా, ఒకే వ్యవస్థలో, జీవిస్తాం. ఒకే జాతీయజెండాను గౌరవిస్తాం. భారతీయత అనే ఒకే అస్తిత్వాన్ని కాపాడుకుంటాం. ఇదే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం.

► వివిధ అంశాలపై మనం వాదించుకోవచ్చు కానీ భిన్నాభిప్రాయాలుండకూడదని చెప్పకూడదు. పరస్పర విరుద్ధ ఆలోచనలున్నప్పటికీ చర్చల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలి.

► శాంతిపూర్వకమైన అస్తిత్వం, కరుణ, జీవితంపై గౌరవం, సామరస్యం వంటివి భారత నాగరికతలోని సహజ సూత్రాలు.  

► చిన్నారులు, మహిళలపై అత్యాచారం జరిగిన ప్రతిసారీ.. భారతమాత ఆత్మ క్షోభిస్తుంది. మన సామరస్యపూర్వక సహజీవనాన్ని  అనవసర కోపతాపాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. అహింసాయుత సమాజం మాత్రమే ప్రజలంతా ప్రజాస్వామ్య విధానంలో భాగస్వాములయ్యేలా చేస్తుంది. ప్రత్యేకంగా వెనుకబడిన, అణగారిన వర్గాలకు మార్గం చూపిస్తుంది. కోపం, హింస, ఘర్షణ నుంచి శాంతి, సామరస్యం, సంతోషం మార్గంలో మనమంతా పయనించాలి.

► దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఇటీవలి అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. సంతోషం. కానీ సంతోషకర సూచీలో మాత్రం మనం ఇంకా వెనకబడే ఉన్నాం.

► ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడే రాజు సంతోషంగా ఉంటాడు. ప్రజల సంక్షేమమే రాజు సంక్షేమం. తనకు ఇంపుగా ఉన్నదానికంటే ప్రజలకు మేలు చేసే పనిని చేయడమే రాజు ముఖ్యమైన ధర్మం. ప్రజల విషయంలో రాజు ఎలా ఉండాలనేదాన్ని కౌటిల్యుడు బాగా వివరించారు.

► శతాబ్దాలుగా ఉన్న ఐకమత్యం, ఆత్మీయీకరణ, అందరూ కలిసి జీవిచడమే మన దేశ గుర్తింపు.

► ‘ఒకే భాష, ఒకే మతం, ఒకే శత్రువు అనేది మన జాతీయవాదం కాదు. (ఆరెస్సెస్‌ ‘ఒకే దేశం– ఒకే సంస్కృతి’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ)

► ప్రతిరోజూ మనచుట్టూ హింస పెచ్చుమీరటాన్ని గమనిస్తున్నాం. హింస, భయం, అవిశ్వాసం ఇవన్నీ మన గుండెల్లో పాతుకుపోతున్నాయి. అందుకే ప్రజలను భయం, శారీరక, మానసిక హింస నుంచి స్వతంత్రులను చేయాలి.

► దేశంలో సామాజిక, ఆర్థిక మార్పు తీసుకువచ్చేందుకు లకి‡్ష్యంచిన హక్కుల పత్రం వంటిది భారత రాజ్యాంగం. ఇది 130 కోట్ల మంది భారతీయులు ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం.  

► మహాత్మాగాంధీ, నెహ్రూలు పేర్కొన్నట్లు మన జాతీయతావాదం ఒక్కరికే పరిమితం కాదు, దూకుడు, విధ్వంసకరమైనది కాదు. అందరినీ కలుపుకుని పోవడమే జాతీయతావాదం.

► ప్రజలు వారి దైనందిన జీవితంలో చేయాల్సిన పనులకు సరైన మార్గదర్శకం చేయాలి. ఇదే సంతోషకరమైన జీవితాన్ని ఇస్తుంది. దీంతో సహజంగానే జాతీయతావాదం పెరుగుతుంది.  

‘సంఘ్‌’ భారతీయులందరిదీ
స్వయంసేవకుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో మోహన్‌ భాగవత్‌
నాగపూర్‌: రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌) సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేయాలని కోరుకుంటోందని, తమకు బయటివారంటూ ఎవరూ లేరని ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. తమ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరవడంపై చర్చించడం అర్థరహితమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తరువాత కూడా ప్రణబ్‌ ప్రణబ్‌గానే ఉంటారని, సంఘ్‌ సంఘ్‌గానే ఉంటుందని అన్నారు. ఏటా తమ కార్యక్రమానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, ఆ పరంపరలోనే ఈసారి ప్రణబ్‌ వచ్చారని అన్నారు. భిన్నాభిప్రాయాలున్నా మనమంతా భరతమాత పిల్లలమే అన్నారు.


                                   నాగపూర్‌లో హెడ్గేవార్‌ నివాసంలో ప్రణబ్, భాగవత్‌

అందరినీ కలుపుకుపోతున్నాం..
‘ఆరెస్సెస్‌ ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదు. మాకు బయటివారంటూ ఎవరూ లేరు. ఆరెస్సెస్‌ భారతీయులందరిదీ. భారత మాత ప్రతి ఒక్కరికీ తల్లి వంటిది. హిందువులు దేశానికి వారసులు. అందరినీ కలుపుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావడం, దేశం పేరు ప్రతిష్టలను మరింత పెంచే కార్యకర్తలను తయారుచేయడమే ఆరెస్సెస్‌ లక్ష్యం. కుల,మత, ప్రాంత, వర్గ భేదాల్లేకుండా దేశమంతా ఒక్కటేననే భావనను నెలకొల్పుతున్నాం. అందరినీ కలుపుకుని వెళ్లడం ద్వారా క్రమశిక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచాం. ప్రజాస్వామ్య ఆలోచనే ఆరెస్సెస్‌ అస్తిత్వం. దేశం కోసం పనిచేయడాన్నే మేం విశ్వసిస్తాం. ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు డాక్టర్‌ హెడ్గేవార్‌ కాంగ్రెస్‌ కార్యకర్తగా ఉన్నప్పుడే స్వాతంత్య్ర సమరంలో జైలుకెళ్లారు. చాలా మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు మాతో కలిసి పనిచేశారు. జాతి నిర్మాణంలో సమాజమంతా భాగస్వామ్యమైనప్పుడే ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుంది’ అని భాగవత్‌ అన్నారు.  

భారతమాత గొప్ప పుత్రుడు హెడ్గేవార్‌
నాగపూర్‌: ఆరెస్సెస్‌ వ్యవస్థాపకుడు కేశవ్‌ బలిరాం హెడ్గేవార్‌.. భారతమాత ముద్దుబిడ్డ అని ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. హెడ్గేవార్‌ పుట్టిన ఇంటిని సందర్శించిన అనంతరం అక్కడి సందర్శకుల పుస్తకంలో ‘భారతమాత గొప్ప పుత్రుడికి ఘనమైన నివాళులర్పించేందుకు నేను ఇక్కడికొచ్చాను’ అని ప్రణబ్‌ రాశారు. ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ నాగపూర్‌ నగరంలోని ఇరుకు వీధులగుండా హెడ్గేవార్‌ నివాసానికి ప్రణబ్‌ను దగ్గరుండి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లగానే ప్రణబ్‌ తన పాదరక్షలు తీసి లోపలకు వెళ్లారు. ఈ సందర్భంగా హెడ్గేవార్‌కు సంబంధించిన వివరాలను ప్రణబ్‌కు మోహన్‌ భాగవత్‌ వివరించారు. నాగపూర్‌లోని సంఘ శిక్షావర్గ తృతీయ కార్యక్రమానికి స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యులను కూడా ప్రత్యేక అతిథులుగా ఆరెస్సెస్‌ ఆహ్వానించింది.   

ప్రణబ్‌ సూచనల్ని ఆచరిస్తారా: కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: ప్రణబ్‌ ప్రసంగం భారతీయ నాగరిక విలువలతో పాటు బహుళత్వం, లౌకికవాదం, అందర్ని కలుపుకుపోవడాన్ని ఆరెస్సెస్, బీజేపీలకు చూపిందని కాంగ్రెస్‌ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ విషయమై కాంగ్రెస్‌ నేత సూర్జేవాలా స్పందిస్తూ.. ‘ప్రణబ్‌ చేసిన విలువైన సూచనల్ని అంగీకరించి ఆరెస్సెస్, బీజేపీలు తమ ఆలోననావిధానం, స్వభావం, ధోరణిని ఈరోజు మార్చుకుంటాయని ఆశిస్తున్నాం. తమ తప్పుల్ని అంగీకరించేందుకు ఆరెస్సెస్‌ సిద్ధమా? హింసాత్మక, అణచివేత లక్షణాలను విడిచిపెడుతుందా? మహిళలు, పేదలపట్ల అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని ఆరెస్సెస్‌ వదిలివేస్తుందా?’ అని సూర్జేవాలా ప్రశ్నించారు.

                                               నాగపూర్‌లో హెడ్గేవార్‌
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top