అందుకే ఆప్ తరపున ప్రచారం చేస్తున్నా : ప్రకాశ్ రాజ్

సాక్షి, న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తానని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. అయితే తాను ఆప్‌లో చేరలేదని, ఆ పార్టీ సిద్ధాంతాలు తనకు బాగా నచ్చడంతోనే ప్రచారం చేయడానికి వచ్చానని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షుడుగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి. ఆరోగ్యం, విద్య విషయంతో పార్టీ ఆలోచనలు బాగున్నాయి. అందుకే పార్టీ తరపున ప్రచారం చేయాలనుకుంటున్నాను.
ప్రస్తుత ప్రభుత్వం ప్రజాస్వామ్య దేశానికి తూట్లు పొడుస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు అంతా ఏకతాటికి పైకి రావాల్సిన అవసరం ఉంది. సిద్దాంతాల పరంగా కొన్ని పార్టీలు దూరంగా ఉన్నా.. దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం అంతా ఏకం కావాలి. ఆప్ ఆ దిశగా వెళ్తోంది కాబట్టే నేను మద్దతు ఇస్తున్నాను’ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన న్యూ ఢిలీ, తూర్పు ఢిల్లీ నియోజకవర్గాలతో ఆప్ అభ్యర్థులు నిర్వహించే సభలో పాల్గొననున్నారు. కాగా ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి