వీఐపీల వార్‌

Politicians Participate in Lok Sabha Elections Tamil nadu - Sakshi

కొన్ని  స్థానాల్లో రసవత్తరంగా సమరం

కనితో తమిళిసై ఢీ అన్బు మళ్లీ నెగ్గేనా

పన్నీరు వ్యూహాన్ని ఈవీకేఎస్‌ చీల్చేనా

డీకే మాజీలు ఈ సారైనా గట్టెక్కేనా

తంబికి గండం తప్పదా

సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో కొన్నింట్లో వీఐపీలు రేసులో ఉన్నారు. ఈ స్థానాల్లో పోరు అన్నది రసవత్తరం కానుంది. గెలుపు కోసం వీఐపీలు తీవ్రంగా కుస్తీలు పట్టాల్సిన పరిస్థితి. ప్రత్యర్థులు సైతం బలవంతులుగానే ఉండడతో డీఎంకే–కాంగ్రెస్, అన్నాడీఎంకే–బీజేపీ కూటమిలోని వీఐపీలు గెలుపు లక్ష్యంగా ఇంటింటా ఓట్ల వేటలో ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే– కాంగ్రెస్, అన్నాడీఎంకే – బీజేపీలు కూటములుగా, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే), మక్కల్‌ నీదిమయ్యం, నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీలు ఒంటరిగా పోటీలో ఉన్న విషయం తెలిసిందే. ఇక, రాష్ట్రంలో 39 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో కొన్ని స్థానాలు వీఐపీ హోదాను పొంది ఉన్నాయి. ఇందుకు కారణం, ఆ యా పార్టీలకు చెందిన వీఐపీ అభ్యర్థులు పోటీలో ఉండడమే. దీంతో ఆయా నియోజకవర్గాల్లో సమరం రసవత్తరంగా మారింది. గెలుపు కోసం వీఐపీలు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి.  ఆ మేరకు కన్యాకుమారిలో అన్నాడీఎంకే కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా కేంద్ర సహాయ మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ పోటీలో ఉన్నారు. ఇక్కడ ఆయన్ను నాంగునేరి ఎమ్మెల్యే వసంతకుమార్‌ ఢీ కొడుతున్నారు. గత ఎన్నికల్లో కూటమి అన్నది లేకుండా ముందుకు సాగినప్పుడే వసంతకుమార్‌ రెండో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం డీఎంకే బలం తోడుకావడంతో మంత్రికి ముచ్చెమటలు పట్టించేందుకు సిద్దమయ్యారు. ఈ సారి తన గెలుపు మీద వసంతకుమార్‌ ధీమాతో ఉండటంతో తన హవాను  చాటుకునేందుకు పొన్‌ రాధాకృష్ణన్‌ ఓట్ల వేటలో దూసుకెళ్లే పనిలో పడ్డారు.

ఇద్దరు మహిళల ఢీ : తూత్తుకుడి నియోజకవర్గం మీద అందరి దృష్టి మరలి ఉన్నది. ఇక్కడ ప్రపథమంగా ఓ అభ్యర్థి ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్నారు. ఆమె దివంగత డీఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి.  ఈమెను ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థిగా తమిళి సై సౌందరరాజన్‌ను బిజేపి అభ్యర్థిగా అన్నాడిఎంకే కూటమి రంగంలోకి దించింది. బిజేపి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న తమిళి సై కనిమొళి మీద గెలుపు లక్ష్యంగా తీవ్రంగానే ఓట్ల వేటలో ఉన్నారు. ఇక, గత కొన్నేళ్లుగా తూత్తుకుడి మీద కనిమొళి గురి పెట్టి కార్యక్రమాల్ని విస్తృతంచేసి ఉండటంతో అనుకూలించే అంశాలు ఎక్కువేనన్న ధీమాను డిఎంకేవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

తంబికి గండం తప్పేనా: అమ్మ జయలలిత చల్లటి దీవెనలతో కరూర్‌ నుంచి వరుస విజయలతో తంబిదురై పార్లమెంట్‌కు వెళ్తూ వచ్చారు. ఆమె ఆశీస్సులతో పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ కూడా అయ్యారు. ఇప్పుడు అమ్మ  ఈ లోకంలో లేరు. తన గెలుపు కోసం తానే శ్రమించుకోవాల్సిన పరిస్థితి.  ఇది వరకు తాను ఎక్కడకు వెళ్లినా వ్యతిరేకత బయలు దేరడంతో ఈ సారి మకాంను కృష్ణగిరికి మార్చాలని ప్రయత్నించారు. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ చెక్‌ పెట్టడంతో కరూర్‌లో మళ్లీ పోటీ చేయకతప్పలేదు. అన్నాడిఎంకే సమన్వయ కమిటీ సహకారం తనకు అంతంత మాత్రమే అయినా, తన వ్యక్తిగత బలం గెలిపిస్తుందన్న ధీమా ఈ వీఐపీలో ఉంది. అయితే, ఈసారి గతంలో ఓటమి చవి చూసిన అభ్యర్థినే డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌ పోటీకి దించింది. జ్యోతి మణి అభ్యర్థిగా పోటికి దిగడం తంబికి గండాల్ని సృష్టించే అవకాశాలు ఎక్కువేనంటున్నారు. గత పదేళ్లలో తంబి రూపంలో నియోజకవర్గానికి ఒరిగింది శూన్నమే అన్న నినాదంతో జ్యోతిమణి ఓట్ల వేటలో ఉన్నారు.

వారసులు గట్టెక్కేనా: 2014లో ప్రపథమంగా ధర్మపురి నుంచి పీఎంకే నేత రాందాసు వారసుడు , పార్టీ  యువజన నేత అన్భుమణి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగారు. మోదీ హవా, వ్యక్తిగత బలం కలిసి రావడంతో పార్లమెంట్‌ మెట్లు ఎక్కారు. మళ్లీ అదే నియోజకవర్గంలో పోటీలో ఉన్నా, డీఎంకే అభ్యర్థిగా సెంథిల్, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం అభ్యర్థిగా మాజీ మంత్రి పళనియప్పన్‌లో పోటీలో ఉండడం ఇరకాటంలో పడేసి ఉంది. ఈ సారి ఇక్కడ ముగ్గురు హేమాహేమీల మధ్య సమరం సాగుతుండడంతో గట్టి పోటీ తప్పడం లేదు. ఇక, డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం వారసుడు రవీంద్రనాథ్‌ ప్రపథమంగా తేని నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. తనయుడి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు కీలకం కావడంతో గెలుపు బాధ్యతల్ని పన్నీరు తన భుజాల మీద వేసుకుని ఉన్నారు. అయితే, పన్నీరు వ్యూహాలను చిన్నా భిన్నం చేసే దిశగా రాజకీయఅనుభవజ్ఞడు , కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇక్కడ పోటీకి దిగారు.

యువకుడు, సీనియర్‌ మధ్య సాగుతున్న ఈ సమరంలో అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళంగం తరపున నేను లోకల్‌ అంటూ తంగ తమిళ్‌ సెల్వన్‌ రేసులో ఉండడంతో గెలుపు కోసం ముగ్గురు శ్రమించాల్సిందే. ఇక, వేలూరులో డీఎంకే కోశాధికారి దురైమురుగన్‌ తనయుడు కదిర్‌ ఆనంద్‌ను అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా పుదియ నిధి కట్చి నేత ఏసీ షణ్ముగం పోటీలో  ఉండటం పోరు ఆసక్తికరంగా మారి ఉన్నది. ఇక, శివగంగైలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం వారసుడు కార్తీ చిదంబరం మరో మారు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. అయితే, ఈ సారి అవకాశాన్ని చేజార్చుకోకుడదన్న లక్ష్యంగా అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ అభ్యర్థిగా హెచ్‌ రాజా తీవ్రంగా శ్రమించే పనిలో పడ్డారు. ఇక, మంత్రి జయకుమార్‌ తనయుడు , సిట్టింగ్‌ ఎంపీ జయవర్ధ మరో మారు అదృష్ట్యాన్ని పరీక్షించుకునేందుకు దక్షిణ చెన్నైలో పోటీకి దిగారు. వ్యూహాత్మకంగా ఇక్కడ పార్టీ సీనియర్‌ తంగ పాండియన్‌ వారసురాలు తమిళచ్చి తంగ పాండియన్‌ మహిళా అభ్యర్థిగా డీఎంకే పోటీకి దించింది. దీంతో ఈ వారసుల మధ్య సమరం ఎలాంటి ఉత్కంఠ తో సాగనుందో వేచి చూడాల్సిందే. తనయుడి గెలుపు కోసం జయకుమార్‌ తీవ్రంగానే వ్యూహాల్ని రచించే పనిలో ఉన్నారు.

మాజీలు ఈ సారైనా నెగ్గేనా:   గత ఎన్నికల్లో దివంగత అమ్మ జయలలిత హవా ముందు డీఎంకేలో సీనియర్లుగా , కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్లు తలదించుకోక తప్పలేదు. ప్రస్తుతం ఈ మాజీలు మళ్లీ రేసులో దిగారు. ప్రస్తుతం సెంట్రల్‌ చెన్నై నుంచి కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్,  శ్రీ పెరంబదూరు నుంచి కేంద్ర మాజీ మంత్రి టీఆర్‌ బాలు, అరక్కోణం నుంచి మాజీ మంత్రి జగద్రక్షకన్, తంజావూరు నుంచి కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎస్‌ పళనిమాణిక్యం, నీలగిరి నుంచి ఎ రాజా పోటీలో ఉన్నారు. దయానిధి మారన్, జగద్రక్షకన్, టీఆర్‌ బాలు ఈ సారి పీఎంకే అభ్యర్థుల్ని ఢీ కొడుతుండటం గమనార్హం.  ఇక, చిదంబరంలో వీసీకే నేత తిరుమావళవన్, తెన్‌కాశీలో పుదియ తమిళగం నేత కృష్ణస్వామి, తిరుచ్చిలో కాంగ్రెస్‌ సీనియర్‌ తిరునావుక్కరసర్, పెరంబలూరులో ఐజేకే నేత టీఆర్‌ పారివేందర్‌  రేసులో ఉండడంతో ఆ నియోజకవర్గాలు కూడా వీఐపీ జాబితాలో చేరాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top