Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్‌ ఫైట్‌ | Lok Sabha Elections 2024: DMK Vs BJP Tough Fight In Tamil Nadu, More Details Inside - Sakshi
Sakshi News home page

Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్‌ ఫైట్‌

Published Fri, Apr 19 2024 4:09 AM

Lok sabha elections 2024: DMK vs BJP Tough Fight in Tamil Nadu - Sakshi

తమిళనాట డీఎంకే, బీజేపీ హోరాహోరీ

కోయంబత్తూర్లో అన్నామలైకి మొగ్గు

తమిళిసై తదితరులకూ చాన్స్‌

డీఎంకే నేత ఎ.రాజా ఎదురీత

నీలగిరీస్‌ బరిలో వీరప్పన్‌ కుమార్తె

లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు.

అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్‌ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా  తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్‌ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్‌ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది...

కోయంబత్తూర్‌
బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్‌ పేరిట 24 గంటలూ మొబైల్‌ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి.

ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్‌ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్‌ నెగ్గారు. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్‌కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్‌ పోటీలో ఉన్నారు.

తూత్తుకుడి
ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్‌ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్‌ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్‌ (మూపనార్‌) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్‌.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం.

అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్‌ బోన్‌ అండ్‌ జాయింట్‌ సెంటర్‌ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్‌ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్‌ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్‌  2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం!

చెన్నై సౌత్‌
ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్‌ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్‌గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం.

2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్‌ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్‌పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్‌ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది.

నీలగిరీస్‌
ఇది ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు  2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్‌.మురుగన్‌ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్‌ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా.

కృష్ణగిరి
ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్‌ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్‌ తమిళార్‌ కచ్చి (ఎన్‌టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌గా చేశారు.

ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్‌ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్‌ తరఫున ఎ.చెల్లకుమార్‌ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్‌ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ
ఉండేది. ఈ విడత కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎంపీని మార్చడం, వీరప్పన్‌ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది.

రామనాథపురం
ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్‌సెల్వం రాజకీయ భవిష్యత్‌ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్‌ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది.

దాంతో ఓపీఎస్‌ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్‌కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్‌ ఎంపీ కె.నవాన్‌ ఖని (ఐయూఎంఎల్‌) ఓపీఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు.

తేని
జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్‌ తేని లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్‌ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్‌ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్‌ ఎంపీ పి.రవీంద్రనాథ్‌ పన్నీర్‌సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్‌ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్‌ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement