రాజకీయ కక్షతోనే నాపై క్రిమినల్‌ కేసు

political case is the criminal case against me - Sakshi

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌:  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనను కావాలని క్రిమినల్‌ కేసులో ఇరికిస్తోందని, చిక్కడపల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదు చేసిన కేసును కొట్టివేయా లని కోరుతూ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం హైకోర్టును ఆశ్రయించారు. తనపై పోలీసులు పెట్టిన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇవ్వాలని, కింది కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మిన హాయింపు ఇవ్వాలని హైకోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెనుక కుట్ర ఉందని, రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై కేసు పెట్టారని పిటిషన్‌లో ఆరోపించారు. కేసీఆర్‌ కుమార్తె, ఎంపీ కవిత టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందు మహాముత్తారం గ్రామంలో కుమ్రం భీం విగ్రహ ఏర్పాటు విషయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న ఆరోపణలపై అరెస్టు అయ్యారని, అందుకు ప్రతీకారంగా ఈ కేసు పెట్టారని పేర్కొన్నారు.

‘సుదర్శన్‌గౌడ్‌ భార్య ఓడేడు గ్రామ సర్పంచ్‌గా ఉన్నప్పుడు గ్రామ అవసరాలకు 9 ఎకరాల భూమి కొనుగోలు చేయాలని నిర్ణయించి లక్ష్మారెడ్డి అనే భూస్వామిని సంప్రదించారు. గ్రామస్తులు ధనాన్ని సమకూర్చడంలో జాప్యం జరగడంతో సుదర్శన్‌ తన పేరిట కొనుగోలు చేసుకున్నారు. భూమిని సుదర్శన్‌గౌడ్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో కిషన్‌రెడ్డి విభేదించారు. కిషన్‌రెడ్డి పెట్టిన కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు’ అని పేర్కొన్నారు. సుదర్శన్‌ ఫోన్‌ను భార్గవ్‌ అనే వ్యక్తి ద్వారా కిషన్‌రెడ్డి తెప్పించుకుని అందులోని సంభాషణల్ని విడిగా నమోదు చేసుకుని కేసు పెట్టారని, రాజకీయంగా ఎదుర్కొలేక  కేసులో ఇరికించారని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top