ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: ప్రధాని మోదీ

PM Modi Breaks Silence on Encephalitis Outbreak - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: 2024 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా అవతరించడమే కేంద్రం లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ఇది ఒక్కరి శ్రమతో నిజమయ్యే కల కాదని, నిర్మాణాత్మక సలహాలు సూచనలు అందించాలని రాజకీయపక్షాలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయాన్ని ఓ బాధ్యతగా స్వీకరించినట్టు మోదీ తెలిపారు. సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌ మంత్రానికి దేశప్రజలు సబ్‌ కా విశ్వాస్‌ను చేర్చారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని హామీఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలూ కీలకమేనన్న మోదీ.. విపక్షాలు వ్యతిరేకించాలే కాని అడ్డుకోకూడదని వ్యాఖ్యానించారు.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే అంశంలో కేంద్రం పట్టుదలతో కనిపిస్తోంది. ఒక దేశం ఒకే ఎన్నిక కోసం మరోసారి ప్రధాని మోదీ తన గళం వినిపించారు. దీనిపై కూలంకషంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభలో సమాధానమిచ్చిన మోదీ.. ఎన్నికల్లో సంస్కరణలు కొనసాగాల్సిందేనని స్పష్టంచేశారు. జమిలిఎన్నికల కారణంగా ప్రాంతీయపార్టీలు నష్టపోతాయన్న వాదనను ప్రధాని తప్పుపట్టారు.

ఈవీఎంలపై విపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని రాజ్యసభలో ప్రస్తావించారు ప్రధాని మోదీ. పార్టీని గెలిపించుకునే సత్తా, సామర్థం లేక ఓటింగ్‌ యంత్రాలపై నెపం మోపుతున్నారని చురకలు అంటించారు. ఇద్దరు సభ్యులతో లోక్‌సభకు వచ్చినప్పుడు కూడా బీజేపీ ఇలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. ఈవీఎంలతో దేశంలో ఇప్పటివరకు 4 సాధారణ, పలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని మోదీ గుర్తుచేశారు. ఇంకా చాలా ఎన్నికలున్నాయని, దమ్ముంటే ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంకావాలని విపక్షాలకు సవాల్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన కాంగ్రెస్‌ని ప్రధాని మోదీ కడిగిపారేశారు. ఎన్నికల్లో పరాజయాన్నిఆ పార్టీ అంగీకరించలేకపోతోందని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచినా దేశం ఓడిపోయిందన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశం ఓడిపోతే వయనాడ్‌, రాయ్‌బరేలీల్లో ఎవరు గెలిచారని నిగ్గదీశారు. అహంకారానికి కూడా ఓ హద్దుంటుందని కాంగ్రెస్‌పై ఫైర్ అయ్యారు మోదీ. జార్ఖండ్‌లో మైనార్టీ యువకుడిపై మూకదాడి ఘటనను ప్రధాని మోదీ ఖండించారు. ఈ సంఘటన తనను ఎంతో బాధించిందన్నారు. అయితే జార్ఖండ్‌ మూకదాడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్న విపక్షాల విమర్శలను ఆయన తప్పుబట్టారు. ఒక ఘటన కోసం యావత్‌ రాష్ట్రాన్ని నిందించడం సరికాదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితులపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. 226 జిల్లాలు నీటి సంక్షోభం ఎదుర్కొంటున్నాయని... దీనిని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నీటి కొరత భవిష్యత్ తరాలకు ఇబ్బందకరంగా మారకుండా చూసేందుకు ఎంపీలంతా కేంద్రానికి సహకారం అందించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తిచేశారు.

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి కారణంగా పెద్ద ఎత్తున చిన్నారులు మృతిచెందిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి మౌనాన్ని వీడారు. బిహార్‌లో జరిగిన ఈ ఘటనను తనను ఎంతగానో బాధించిందని, ఆందోళనకు గురిచేసిందని పేర్కొన్నారు. అయితే, ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు బిహార్‌కు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. పేదలకు వైద్యచికిత్స అందించేందుకు ఉద్దేశించి ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని మరింత బలోపేతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, నిరుపేదలకు ఉత్తమమైన, మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నదని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top