అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ సరైనదే

Peddireddy Ramachandra Reddy comments on ysrcp assembly session issue - Sakshi

నవంబర్‌ 11 నుంచి నియోజకవర్గాల పర్యటన: పెద్దిరెడ్డి 

పుంగనూరు టౌన్‌: శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తూ వైఎస్సార్‌సీపీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పుంగనూరులో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండా శాసనసభ నిర్వహించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని, అది టీడీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు హాజరైతే నాలుగు రోజులు సమావేశాలు జరుపుతామని ప్రకటించి, హాజరుకానందుకు ఎక్కువ రోజులు జరపాలన్న ఆలోచన సీఎం, స్పీకర్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. అనైతికంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు 21 మందిని కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి, సభలో వైఎస్సార్‌సీపీ సభ్యులడిగే ప్రశ్నలకు వారిచే సమాధానాలు ఇప్పించడం హాస్యాస్పదంగా ఉంటుందన్నారు.

పదవీకాంక్ష తప్ప ప్రజాస్వామ్య విలువలు తెలియని చంద్రబాబు సీఎంగా ఉన్న సభకు హాజరుకావడం కంటే బహిష్కరించడమే సరైనదని పలువురు తమను అభినందిస్తున్నారన్నారు. గతంలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలకతీతంగా ప్రతి శాసనసభ్యుడికీ రూ.కోటి మంజూరు చేసిన ఘనత ఆయనకే చెల్లిందన్నారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పం పాదయాత్రకు సంఘీభావంగా నవంబర్‌ 11 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, లేనిచోట ఇన్‌చార్జ్‌లు ప్రతి గ్రామంలోనూ పర్యటించి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్‌.రెడ్డెప్ప, కొండవీటి నాగభూషణం, సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top