
ఆమెను భారత ప్రధానిగా చూడటమే నా ఆకాంక్ష.
లక్నో : బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించి ప్రజాపక్షాన నిలిచిన కాన్షీరాం తనకు ఆదర్శమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతితో శుక్రవారం పవన్ లక్నోలో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాయవతిని భారత ప్రధానిగా చూడటమే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ఇక బెహన్ జీ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.
కాగా రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను జనసేన బుధవారం అర్ధరాత్రి విడుదల చేసిన సంగతి తెలిసిందే. 32 శాసనసభ, నాలుగు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను పవన్ ఖరారు చేశారు. పార్లమెంట్ అభ్యర్థులుగా అమలాపురం స్థానం నుంచి డి.ఎం.ఆర్ శేఖర్, రాజమండ్రి నుంచి ఆకుల సత్యనారాయణ, విశాఖ నుంచి గేదెల శ్రీనుబాబు, అనకాపల్లి నుంచి చింతల పార్థసారథి ఎన్నికల బరిలో దిగనున్నారు. ఇక 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే.