
మనోహర్ పారికర్ (ఫైల్ ఫోటో)
పనాజి: మూడు నెలల విరామం తరువాత విధి నిర్వహణకు హాజరైన గోవా సీఎం మనోహర్ పారికర్‌కు సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి అమెరికాలో చికిత్స తీసుకున్నారు. కోలుకోవటంతో ఇటీవల రాష్ట్రానికి తిరిగి వచ్చిన విషయం విదితమే. అయితే పారికర్ స్థానంలో రాష్ట్ర పరిపాలన.. వ్యవహారాలను పర్యవేక్షించిన ముగ్గురు మంత్రుల కమిటీ అన్ని రకాలుగా విఫలమైనట్లు తెలుస్తోంది.
ప్రధానంగా రాష్ట్రంలో మైనింగ్ పరిశ్రమపై పెద్ద ఎత్తున్న ప్రభావం పడింది. 88 మైనింగ్ లీజులపై సుప్రీంకోర్టు స్టే విధించటంతో మైనింగ్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతోపాటు పలు సమస్యలు పరిష్కరించటంలో మంత్రుల కమిటీ విఫలమైంది. ఇదే అదనుగా ప్రతిపక్ష కాంగ్రెస్.. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడింది. కర్ణాటక పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న తమకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ గవర్నర్‌ను డిమాండ్ చేస్తోంది. మొత్తానికి మూడు నెలలపాటు అధికారానికి దూరంగా ఉన్న పారికర్‌కు, సమస్యలు స్వాగతం పలకటం.. వాటిని పరిష్కరించే పనిలో ఆయన తలమునకలయ్యారు.