అసెంబ్లీలో ‘మద్యం’ గోల!

Palla rajeswar reddy on congress - Sakshi

కాంగ్రెస్‌ సభ్యులు తాగి వచ్చారన్న టీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా

బూతులు తిడుతూ దాడి చేశారంటూ ఆరోపణ..

భగ్గుమన్న విపక్షం

అధికారపక్షం తీరు సిగ్గుచేటంటూ మండిపాటు

దమ్ముంటే సీఎంతో సహా అందరూ పరీక్షకు సిద్ధపడాలని సవాల్‌

రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చుతున్నారంటూ విమర్శలు

లాబీల్లోనూ మద్యం రగడపైనే చర్చ

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల తొలిరోజున అధికార, విపక్షాల మధ్య ‘మద్యం’చిచ్చుపెట్టింది. విపక్ష కాంగ్రెస్‌ సభ్యులు తాగి వచ్చారంటూ అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. అటు కాంగ్రెస్‌ నేతలు కూడా అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఈ విషయంపైనే చర్చోపచర్చలు జరగడం గమనార్హం.

అసలేం జరిగింది..?
సభ ప్రారంభం కాగానే గవర్నర్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ సభ్యులు పోడి యం వైపు దూసుకొచ్చారు. మార్షల్స్‌ వారిని అడ్డుకోవడంతో నినాదాలు చేస్తూ ఆందోళనలకు దిగారు. ఆ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన మైక్‌సెట్‌ తగిలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ కంటికి గాయాలయ్యాయి. దీనిపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలకు దిగారు.

కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తాగి వచ్చారని.. శాసనవ్యవస్థ తలదించుకునేలా ప్రవర్తించారని ఆరోపించారు. సభ్యులు జానారెడ్డిపై తూలిపడ్డారని, దాంతో ఆయన లేచి వెళ్లిపోయారని పేర్కొన్నారు. తాగి వచ్చి బూతులు తిడుతూ, భౌతిక దాడులకు దిగిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేయాలన్నారు.

భగ్గుమన్న కాంగ్రెస్‌
ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ భగ్గుమంది. ఆ సమయంలో సీఎల్పీ కార్యాల యంలో ఉన్న ఎమ్మెల్యే సంపత్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ తదితరులు పల్లా వ్యాఖ్యను ఖండించాలని నిర్ణయించారు. దీనిపై మీడియా పాయింట్‌లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సమాచారమివ్వడంతో... ఆయన అధికార పక్షంపై ఘాటుగా విమర్శలు చేశారు. తాగి వచ్చారని అధికారపక్ష సభ్యులు ఆరోపించడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

అధికారపక్షానికి దమ్ముంటే సీఎంతో సహా అందరు టీఆర్‌ఎస్‌ సభ్యులు, కాంగ్రెస్‌ సభ్యులు కలసి ల్యాబ్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుందామని... ఎవరి ఒంట్లో ఆల్కహాల్‌ ఉందో తేలిపోతుందని సవాల్‌ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనకు సీఎం కారణమని.. ఘటనలో తనకూ గాయాలయ్యా యని చెప్పారు. కానీ తప్పుడు వ్యాఖ్యలు చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉండేందుకు అనర్హుడని విమర్శించారు.

‘‘మీ తాగుబోతుల సంఘాల కోసం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11.30 గంటల దాకా వైన్స్‌లకు అనుమతిచ్చింది మీరు (టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం) కాదా.. బంగారు తెలంగాణ చేస్తామని చెప్పి తాగుబోతుల తెలంగాణ చేసింది మీరు కాదా..’’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ పల్లా వ్యాఖ్యలు సరికాదని.. ఈ వ్యాఖ్యలు సభలో ఉన్న ప్రతి సభ్యుడిని అవమానించినట్టేనని సీఎల్పీ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షం విమర్శలపై అధికారపక్షం తిరిగి కౌంటర్‌ చేయకపోయినా.. అసెంబ్లీ లాబీల్లో సభ్యుల మధ్య ‘మద్యం’ వ్యాఖ్యలపైనే తీవ్ర చర్చ జరిగింది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top