ఓడిన ఎన్టీఆర్‌ 

NTR Lost in the 1989 elections and that is TDP First defeat - Sakshi

తెలుగుదేశం తొలి ఓటమి

కల్వకుర్తిలో ఎన్టీఆర్‌ పరాజయం

తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.టి.రామారావు ఏడేళ్ల పాలన తర్వాత (మధ్యలో నాదెండ్ల భాస్కరరావు నెల రోజులు మినహాయిస్తే) 1989 డిసెంబర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం1990 మార్చి వరకూ ఉన్నా లోక్‌సభ ఎన్నికలు ముందే రావడంతో ఎన్టీఆర్‌ జమిలి ఎన్నికలకే నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్షాలతో కలిసి నడిచిన రామారావు..అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలయ్యారు. టీడీపీ స్థాపించాక జరిగిన మొదటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లూ 200కిపైగా సీట్లు లభించగా, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 74 సీట్లే దక్కించుకుని మొదటిసారి ప్రతిపక్షమైంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం రెండు సీట్లే (బొబ్బిలి, నర్సాపురం) సాధించి ఘోర పరాజయం చవిచూసింది.

1983 జనవరి నుంచీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్‌ 1989 డిసెంబర్‌ 3న మళ్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. సీనియర్‌ నేత, పీసీసీ(ఐ) అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1988, 89లో జరిగిన రాజకీయ పరిణామాలు, టీడీపీ సర్కారు వేసిన తప్పటడుగులు, విజయవాడలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు హత్యతో ఆయన సామాజికవర్గంలో తెలుగుదేశంపై పెల్లుబికిన వ్యతిరేకత, 1989 ఆరంభంలో ఒకేసారి తన మంత్రివర్గంలోని సభ్యులందరితో ఎన్టీఆర్‌ రాజీనామా చేయించడం వంటి అనేక కారణాలు టీడీపీ ఓటమికి దోహదంచేశాయి. మూడు నెలలు ముందు జరిగిన తెలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతుందని ఎక్కువ మంది రాజకీయ పరిశీలకులు ఊహించలేకపోయారు. అనంతపురం జిల్లా హిందూపురంతోపాటు మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీచేసిన రామారావు రెండో స్థానంలో ఓడిపోవడం సంచలనం సృష్టించింది.  

అల్లుడికి అందలం! 
ఎన్టీఆర్‌ 1985లో మరోసారి సీఎం అయ్యాక మూడో అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశంలో చేరారు. ఆయనకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఎన్టీఆర్‌ ఇచ్చారు. అయితే ఏ చట్ట సభలోనూ సభ్యత్వం లేని చంద్రబాబుకు కొత్తగా ఏర్పాటు చేసిన కర్షక పరిషత్‌ చైర్మన్‌ పదవి అప్పగించారు. ఈ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా ఎన్టీఆర్‌కు, టీడీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది. ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై ఊచకోత కూడా తెలుగుదేశం ఎస్సీల్లో కొంత మేరకు మద్దతు కోల్పోవడానికి దారితీసింది. నెల్లూరు జిల్లాలో సీనియర్‌ నేత, మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డికి పార్టీ నాయకత్వంతో విభేదాలు రావడంతో పార్టీకి దూరమయ్యారు.

తర్వాత ఒకేసారి మంత్రులందరినీ తొలగించినప్పుడు టీడీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం చేసిన సీనియర్‌ నేతలు ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు, కుందూరు జానారెడ్డి, కేఈ కృష్టమూర్తి వేర్వేరు సమయాల్లో పార్టీ నుంచి బయటికొచ్చి తెలుగునాడు అనే కొత్త పార్టీ ప్రారంభించారు. చివరికి ఎన్నికల ముందు వారంతా కాంగ్రెస్‌లో చేరారు. ఇంత జరిగినా పేద, బడుగు వర్గాల్లో ఎన్టీఆర్‌కు జనాకర్షణ శక్తి తగ్గలేదనీ, తెలుగుదేశమే మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది అంచనావేశారు. కాని, ఏడేళ్ల తెలుగుదేశం పాలనపై జనం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి కాంగ్రెస్‌కే అధికారం కట్టబెట్లారు. 

జెయింట్‌ కిల్లర్‌ చిత్తరంజన్‌! 
ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి  పోటీచేసిన ఎన్టీఆర్‌ అప్పటి జనతాదళ్‌ నేత ఎస్‌ జైపాల్‌రెడ్డి సూచనతో కల్వకుర్తిలో నామినేషన్‌ వేసి కాంగ్రెస్‌ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్‌ చేతిలో ఓడిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆయన రెండోసారి విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చెన్నారెడ్డి  సనత్‌నగర్‌ నుంచి పోటీచేసి గెలిచారు.  
 - సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top