సంక్షోభం.. మధ్యంతరం

Unpredictable consequences after 1983 elections and crisis in TDP - Sakshi

1983 ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం తర్వాత అనూహ్య పరిణామాలు.. 1984 ఆగస్టులో పార్టీలో సంక్షోభం 

ఎన్టీఆర్‌ను గద్దె దించి సీఎంగా నాదెండ్ల ప్రమాణం 

నెల రోజులకే మళ్లీ పగ్గాలు చేపట్టిన ఎన్టీఆర్‌ 

1985లో శాసనసభ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లిన ఎన్టీ రామారావు 

మళ్లీ 202 స్థానాల్లో జయకేతనం 

లోక్‌సభ ఎన్నికల్లోనూ 30 సీట్లలో గెలుపు 

ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు సాగిన కాంగ్రెస్‌ పాలనకు 1983 జనవరి ఎన్నికల్లో సినీనటుడు ఎన్టీ రామారావు నేతృత్వంలోని టీడీపీ అడ్డుకట్ట వేశాక అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985 మార్చిలోనే ఏపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు సీఎం ఎన్టీఆర్‌తో విభేదించారు. రాష్ట్ర కేబినెట్‌లో నెంబర్‌ టూగా తనకు తగినంత గౌరవం లభించడం లేదని భావించిన నాదెండ్ల.. కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్టీఆర్‌ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లినపుడు ఆయన్ను గద్దె దింపే వ్యూహం పన్నారు. స్వపక్షంలోనే అసమ్మతికి కేంద్ర బిందువుగా మారిన నాదెండ్ల, ఆయన అనుయాయులను కేబినెట్‌ నుంచి ఎన్టీఆర్‌ తొలగించారు. అయితే, తనకు 91 మంది టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు 57 మంది కాంగ్రెస్, ఐదుగురు ఎంఐఎం, ఇద్దరు రాష్ట్రీయ సంజయ్‌ మంచ్, ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని (మొత్తం 161 మంది ఎమ్మెల్యేలు) గవర్నర్‌ రాంలాల్‌కు నాదెండ్ల వినతిపత్రం సమర్పించారు. మెజారిటీ కోల్పోయినందున ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయడం, ప్రభుత్వ ఏర్పాటుకు నాదెండ్లను ఆహ్వానించడం, ఆయన ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. నెల రోజుల్లో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని నాదెండ్లకు గడువు విధించారు. స్పీకర్‌ తంగి సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ భీంరెడ్డి కూడా నాదెండ్ల వర్గంలో చేరడంతో బలపరీక్ష సమయంలో ప్రోటెమ్‌ స్పీకర్‌ను నియమించారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు నాదెండ్ల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 

ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా గద్దె దింపడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాలు మొదలయ్యాయి. జనతా, సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్‌దళ్‌తో సహా ఇతర విపక్ష పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతిచ్చాయి. రాష్ట్రంలో నెలరోజుల పాటు తీవ్రస్థాయిలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎన్టీఆర్‌ 161 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ముందు పరేడ్‌ చేయించారు. దీంతో కేంద్రం అప్రతిష్టపాలైన రాంలాల్‌ను తొలగించి శంకర్‌ దయాళ్‌శర్మను కొత్త గవర్నర్‌గా నియమించింది. దీంతోనెల రోజుల్లోనే (1984 సెప్టెంబర్‌) ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఇతర రాజకీయ పక్షాలు అందించిన మద్దతు, ప్రజల సహకారం వంటి సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఆర్‌.. శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా నాదెండ్ల వర్గంలోకి వెళ్లి వచ్చిన ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా కొనసాగడం ఇష్టం లేక అసెంబ్లీని రద్దు చేసి 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. 
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ ముందు ఎమ్మెల్యేల పరేడ్‌ 

లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం సత్తా... 
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఏపీలో అధికారంలోకి వచ్చాక, తొలిసారి 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా సానుభూతి పవనాలు పెల్లుబికినా ఏపీలో అవేమీ పనిచేయలేదు. కాంగ్రెస్‌ కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, జనతా, బీజేపీ, ఎంఐఎం, ఐసీఎస్‌ చెరో సీటు గెలుచుకున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచినవారిలో పి.ఆనందగజపతిరాజు (బొబ్బిలి), భాట్టం శ్రీరామమూర్తి (విశాఖపట్నం), భూపతిరాజు విజయ కుమారరాజు (నరసాపూర్‌), వడ్డే శోభనాద్రీశ్వరరావు (విజయవాడ), నిశ్శంకరరావు వెంకటరత్నం( తెనాలి), ఎన్‌పీ ఝాన్సీలక్ష్మి (చిత్తూరు), ఎరాసు అయ్యపురెడ్డి (కర్నూలు) ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి కావూరు సాంబశివరావు (మచిలీపట్నం), ఆచార్య ఎన్‌జీరంగా (గుంటూరు), సీపీఐ నుంచి సోడే రామయ్య (భద్రాచలం–ఎస్టీ), ఐసీఎస్‌ అభ్యర్థిగా వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్‌ (పార్వతీపురం–ఎస్టీ) విజయం సాధించారు. 

ఓడిన ప్రముఖులు...
కాంగ్రెస్‌ నుంచి ఓడిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి (నరసారావుపేట), కోట్ల విజయభాస్కరరెడ్డి (కర్నూలు), పెండేకంటి వెంకటసుబ్బయ్య (నంద్యాల), చెన్నుపాటి విద్య(విజయవాడ), సింగం బసవపున్నయ్య (తెనాలి), నల్లారి అమరనాథరెడ్డి (చిత్తూరు) ఉన్నారు. 

తెలంగాణలో గెలిచిన ప్రముఖులు... 
మాజీ ముఖ్యమంత్రులు టి.అంజయ్య (కాంగ్రెస్‌–సికింద్రాబాద్‌), జలగం వెంగళరావు (కాంగ్రెస్‌– ఖమ్మం)తో పాటు సూదిని జైపాల్‌రెడ్డి (జనతాపార్టీ–మహబూబ్‌నగర్‌), సుల్తాన్‌ సలావుద్దీన్‌ ఒవైసీ (హైదరాబాద్‌), జె.చొక్కారావు (కరీంనగర్‌), చందుపట్ల జంగారెడ్డి (బీజేపీ–హనుమకొండ), టి.కల్పనాదేవి (టీడీపీ–వరంగల్‌), భీంరెడ్డి నర్సింహారెడ్డి (సీపీఎం–మిర్యాలగూడ) గెలుపొందారు. 
ఓడినవారిలో మాజీ సీఎంలు పీవీ నరసింహారావు (కాంగ్రెస్‌–హనుమకొండ), మర్రి చెన్నారెడ్డి (ఎన్డీపీఐ–కరీంనగర్‌), పి.శివశంకర్‌ (కాంగ్రెస్‌–మెదక్‌), ఎం.మల్లికార్జున్‌ (కాంగ్రెస్‌–మహబూబ్‌నగర్‌), మల్లు అనంతరాములు (కాంగ్రెస్‌–నాగర్‌కర్నూలు–ఎస్సీ) నంది ఎల్లయ్య (కాంగ్రెస్‌–సిద్దిపేట), కమాలుద్దీన్‌ అహ్మద్‌ (కాంగ్రెస్‌ –వరంగల్‌), నల్లమల గిరిప్రసాద్‌ (సీపీఐ–ఖమ్మం), పరసా సత్యనారాయణ (సీపీఎం–ఖమ్మం), చకిలం శ్రీనివాసరావు (కాంగ్రెస్‌ –మిర్యాలగూడ), బండారు దత్తాత్రేయ (బీజేపీ–సికింద్రాబాద్‌), వి.హనుమంతరావు (కాంగ్రెస్‌ –హైదరాబాద్‌) ఉన్నారు. 
నాదెండ్లతో సీఎంగా ప్రమాణం చేయిస్తున్న రామ్‌లాల్‌ 

కూటమిలో కామ్రేడ్లు, కమలనాథులు..
ఈ ఎన్నికల్లో పరస్పర విరుద్ధ రాజకీయ సిద్ధాంతాలున్న వామపక్షాలు, బీజేపీ, జనతా పార్టీలను కలుపుకుని ఎన్టీఆర్‌ కూటమిని రూపొందించారు. ఆగస్టు సంక్షోభం సందర్భంగా టీడీపీకి చేదోడువాదోడుగా నిలిచిన సీపీఐకు 15, సీపీఎంకు 12, బీజేపీకి 10, జనతాపార్టీకి 5 సీట్లు కేటాయించారు. మొత్తం 249 సీట్లకు పోటీ చేసిన టీడీపీ 202 స్థానాల్లో గెలవగా, కేవలం రెండుచోట్ల మాత్రమే డిపాజిట్‌ కోల్పోయింది. సీపీఐ, సీపీఎం చెరో 11 సీట్లు, బీజేపీ 8, జనతా 3 సీట్లు గెలుపొందాయి. ఈ నాలుగు పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థులంతా ధరావతు దక్కించుకోవడం విశేషం. లోక్‌దళ్‌ 14 సీట్లకు పోటీ చేసి అన్నిచోట్లా డిపాజిట్‌ను కోల్పోయింది.  

మరోవైపు కాంగ్రెస్‌ మొత్తం 292 సీట్లకు పోటీపడి 50 స్థానాలు దక్కించుకుంది. 19 చోట్ల డిపాజిట్లు దక్కలేదు. 1983 ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీ బలం పదిసీట్ల మేర తగ్గింది. ఎంఐఎం ఏడు స్థానాల్లో పోటీ చేసి ఐదు చోట్ల గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన 1,337 మందిలో అత్యధికశాతం ధరావతు కోల్పోయారు. 

బడ్జెట్‌ వివరాలు లీక్‌.. కేబినెట్‌ ఔట్‌... 
శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందే దానికి సంబంధించిన వివరాలు కొన్ని తెలుగుపత్రికల్లో ముందుగానే లీక్‌ అయ్యాయనే కోపంతో 1989 ఆరంభంలో ఎన్టీ రామారావు మంత్రుల నుంచి రాజీనామాలు స్వీకరించి 23 మంది కొత్తవారితో కేబినెట్‌ ఏర్పాటుచేశారు. దీంతో కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు తదితర మంత్రులు అసెంబ్లీకి రాజీనామా చేయగా,  కుందూరు జానారెడ్డి పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎన్టీఆర్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది.  

తెలంగాణ నుంచి ఒకే మహిళ... 
ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిపి (అన్ని పార్టీల నుంచి) అత్యధిక సంఖ్యలో 66 మంది మహిళలు పోటీచేయగా.. పదిమందే గెలుపొందారు. వారిలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి 9 మంది గెలవగా, తెలంగాణ నుంచి ఒక్కరే ఉన్నారు. తెలంగాణ నుంచే 24 మంది (15 మంది ఇండిపెండెంట్లు) పోటీచేశారు.  కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏడుగురు, టీడీపీ నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. షాద్‌నగర్‌ (ఎస్సీ) సీటు నుంచి ఎం.ఇందిర (టీడీపీ) గెలుపొందారు. ఈ ప్రాంతం నుంచి మొత్తం 17 మందికి ధరావతు కూడా దక్కలేదు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ (ఎస్సీ) స్థానం నుంచి ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన జెట్టి ఈశ్వరీబాయి, కేపీ జయశ్రీ డిపాజిట్లు కోల్పోయారు.  

గెలిచిన, ఓడిన ప్రముఖులు... 
ఈ ఎన్నికల్లో సీఎం ఎన్టీ రామారావు  మూడుచోట్ల  (గుడివాడ, హిందూపురం, నల్లగొండ) నుంచి పోటీచేసి గెలుపొందారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. మహరాజ్‌గంజ్‌ నుంచి గెలిచిన సీనియర్‌ న్యాయవాది జి.నారాయణరావు (టీడీపీ) ఆ తర్వాత సభాపతిగా నియమితులయ్యారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (టీడీపీ) సిద్దిపేట నుంచి 15వేలకు పైగా మెజారిటీతో మొదటిసారి గెలుపొందారు. నరసాపూర్‌ నుంచి చిలుముల విఠల్‌రెడ్డి (సీపీఐ) సి.జగన్నాథరావు (కాంగ్రెస్‌)పై విజయం సాధించారు. జహీరాబాద్‌ నుంచి ఎం.బాగారెడ్డి గెలిచారు. ఆందోల్‌ (ఎస్సీ) సీటు నుంచి సి.రాజనర్సింహ (కాంగ్రెస్‌)పై మల్యాల రాజయ్య (టీడీపీ) విజయం సాధించారు. జీవీ సుధాకరరావు (కాంగ్రెస్‌– లక్సెట్టిపేట), దుద్దిళ్ల శ్రీపాదరావు (కాంగ్రెస్‌–మంథని), చెన్నమనేని రాజేశ్వరరావు (సీపీఐ–సిరిసిల్ల) చెన్నమనేని విద్యాసాగరరావు (బీజేపీ–మెట్‌పల్లి), కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్‌–చలకుర్తి) నాగం జనార్దనరెడ్డి (టీడీపీ–నాగర్‌కర్నూలు),  చిట్టెం నర్సిరెడ్డి ( మక్తల్‌–జనతాపార్టీ), నర్రారాఘవరెడ్డి (సీపీఎం–నకిరేకల్‌) దేశిని చినమల్లయ్య (సీపీఐ–ఇందుర్తి), నెమురుగొమ్ముల యతిరాజారావు (టీడీపీ–చెన్నూరు), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (టీడీపీ–పరిగి), పి.ఇంద్రారెడ్డి (చేవెళ్ల–టీడీపీ), నాయిని నర్సింహారెడ్డి (జనతాపార్టీ), ఆలె నరేంద్ర (బీజేపీ–హిమాయత్‌నగర్‌), మహ్మద్‌ రజబ్‌ అలీ (సీపీఐ–సుజాతనగర్‌), రావుల రవీంద్రనాథ్‌రెడ్డి (బీజేపీ–ఆలంపూర్‌), శ్రీపతి రాజేశ్వర్‌ (టీడీపీ–సనత్‌నగర్‌), అల్లాడి పి.రాజ్‌కుమార్‌ (టీడీపీ–సికింద్రాబాద్‌), పి.జనార్దనరెడ్డి (కాంగ్రెస్‌–ఖైరతాబాద్‌), నల్లు ఇంద్రసేనారెడ్డి (బీజేపీ–మలక్‌పేట), బద్ధం బాల్‌రెడ్డి (బీజేపీ–కార్వాన్‌) ,కరణం రామచంద్రరావు (టీడీపీ–మెదక్‌), ఎలిమినేటి మాధవరెడ్డి (టీడీపీ–భువనగిరి), ఎస్‌.వేణుగోపాలాచారి (టీడీపీ–నిర్మల్‌), గుండా మల్లేష్‌ (సీపీఐ–ఆసిఫాబాద్‌ ఎస్సీ), సి.ఆనందరావు (టీడీపీ–కరీంనగర్‌), జి.రాజేశం గౌడ్‌ (టీడీపీ–జగిత్యాల), రామసహాయం సురేందర్‌రెడ్డి (కాంగ్రెస్‌–డోర్నకల్‌), మద్దికాయల ఓంకార్‌ (నర్సంపేట–ఎంసీపీఐæ), వన్నాల శ్రీరాములు (బీజేపీ–వర్థన్నపేట), అజ్మీరా చందూలాల్‌ (టీడీపీ–ములుగు ఎస్టీ),  కుంజా బొజ్జి (సీపీఎం–భద్రాచలం ఎస్టీ), చందా లింగయ్య (కాంగ్రెస్‌–బూర్గుంపహాడ్‌), తుమ్మల నాగేశ్వరరావు (టీడీపీ–సత్తుపల్లి), బోడెపూడి వెంకటేశ్వరరావు (సీపీ ఎం–మధిర), గుమ్మడి నర్సయ్య (సీపీఐఎంఎల్‌–ఇల్లెందు ఎస్టీ), ఉజ్జిని నారాయణరావు ( సీపీఐ– మునుగోడు) విజయపతాకం ఎగురవేశారు. 

ఓడిన  అభ్యర్థులు...  
ప్రజాస్వామ్య తెలుగుదేశం టికెట్‌పై పోటీచేసిన నాదెండ్ల భాస్కరరావు (మలక్‌పేట), మల్లుస్వరాజ్యం (సీపీఎం–తుంగతుర్తి), కాంగ్రెస్‌ నుంచి డీకే సమరసింహారెడ్డి (గద్వాల), జి.చిన్నారెడ్డి (వనపర్తి), శనిగరం సంతోష్‌రెడ్డి (ఆర్మూరు), జి.గడ్డెన్న (ముథోల్‌), గీట్ల ముకుందరెడ్డి (పెద్దపల్లి), వి.జగపతిరావు (కరీంనగర్‌), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), రాంరెడ్డి వెంకటరెడ్డి (సుజాతనగర్‌),రాగ్యానాయక్‌ (చలకుర్తి) ఓటమి చవిచూశారు.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top