అప్పుడు మాటలు.. ఇప్పుడు మూటలు!

Nothing wrong in allying with tdp : Jana Reddy - Sakshi

సెంటిమెంట్‌తో మరోసారి ఎన్నికల్లో నెగ్గే ప్రయత్నం

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై జానారెడ్డి ధ్వజం

అధికార దాహంతోనే ముందస్తుకు వెళ్లారు

రాహుల్‌ ఇంటికి వస్తేనే చంద్రబాబును కలిశాం

పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నేడు స్పష్టత అని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మాటలు చెప్పిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. ఇప్పుడు మూటలు విప్పుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఎద్దేవా చేశారు. ఏ కారణంతో తొమ్మిది నెలల ముందు ఎన్నికలకు వెళ్లారో ఇప్పటివరకు చెప్పలేకపోవడం అసమర్థతే అని దుయ్యబట్టారు. సెంట్‌మెంట్‌తో ప్రజలను రెచ్చగొట్టి మరోసారి ఓట్లు దండుకునేందుకు కేసీఆర్‌ యత్నిస్తున్నారని ఆరోపించారు. పొత్తుల వ్యవహారం, సీట్ల సర్దుబాటుపై శుక్రవారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు.

పొత్తులపై శనివారం పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని, తమ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుబాయి పర్యటనలో ఉండటం వల్ల ఇంకా ఖరారు కాలేదని వివరించారు. అభ్యర్థుల జాబితా ఖరారు కాగానే హైదరాబాద్‌లో విడుదల చేస్తామని, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఢిల్లీలో ఉండటం వల్ల అక్కడ విడుదల చేయడం కూడా తప్పేమీ కాదంటూ టీఆర్‌ఎస్‌ ఆరోపణలను కొట్టిపారేశారు. బీసీలకు సీట్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ వచ్చిన ఆరోపణలపై జానారెడ్డి క్లారిటీ ఇచ్చారు.

కేవలం కాం గ్రెస్‌ పార్టీ తరఫున కాకుండా భాగస్వామ్య పార్టీల్లో కూడా బీసీలున్నారని, గతంలో ఇచ్చినట్టుగానే బీసీలకు సీట్లు కేటాయింపు ఉంటుందని వివరణ ఇచ్చారు. జనగామ నుంచి టీజేఎస్‌ తరఫున కోదండరాం పోటీ చేస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, జనగామ సీటు పొన్నాల లక్ష్మయ్యకే ఇస్తారని భావిస్తున్నట్టు జానారెడ్డి పేర్కొన్నారు. పొత్తుల్లో భాగంగా ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేయాలన్నదానిపై శనివారం తుది చర్చలుంటా యని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో భాగస్వామ్య పక్షాలకు స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.

అవి నాన్సెన్స్‌ వ్యాఖ్యలు...
మహాకూటమి మొత్తం చంద్రబాబు చేతిలో ఉందని వస్తున్న వ్యాఖ్యలపై జానారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. అవి నాన్సెన్స్‌ వ్యాఖ్యలని, టీఆర్‌ఎస్‌ నేతలు పనిగట్టుకొని ఆరోపించినంత మాత్రాన తమకేం ఇబ్బంది లేదని స్పష్టంచేశారు. పొత్తుల కమిటీ చైర్మన్‌ తాను కాదని, కేవలం పార్టీలతో చర్చించాలని సూచించిన మేరకే టీజేఎస్, సీపీఐ, టీడీపీతో చర్చించానని తెలిపారు.

దేశంలో ఏ పార్టీ కూడా మూడు నెలల ముందు టికెట్లు ప్రకటించలేదని, కేసీఆర్‌కు అధికార దాహం ఉండటం వల్లే ముందస్తుకు వెళ్లి టికెట్లు కూడా ముందస్తుగా ప్రకటించారని విమర్శించారు. కేసీఆర్‌ ఫ్రంట్‌ పేరుతో ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ తదితర ప్రాంతాల్లో తిరిగారని, కానీ చివరకు అది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌కు వంద సీట్లు రాకపోతే కేటీఆర్‌ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సవాల్‌పై జానారెడ్డి స్పందిస్తూ.. పని అయిపోతే ఎవరైనా సన్యాసమే తీసుకుంటారని చమత్కరించారు.

సర్వేలపై నమ్మకం లేదు...
ఇండియాటుడే నిర్వహించిన సర్వేను జర్నలిస్టులు ప్రస్తావించగా.. అమెరికాలో జరిగిన ఎన్నికల సందర్భంలో ఇదే జాతీయ మీడియా సర్వేలో హిల్లరీ క్లింటన్‌ గెలుస్తుందని చెప్పారని, కానీ చివరకు ఎవరు గెలిచారో చూసుకోవాలని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తమిళనాడులో గత ఎన్నికల సర్వేల్లో డీఎంకే గెలుస్తుందని వచ్చినా, చివరకు అన్నాడీఎంకే గెలిచిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీలో ఎవరు సీఎం అయినా అభ్యంతరం లేదని, కుటుంబంలో రెండు సీట్ల వ్యవహారంపై అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నారు.

తన కుమారుడికి మిర్యాలగూడ టికెట్‌ విషయంలో అధిష్టానం ఆదేశాల ప్రకారమే వెళ్తామని, గతంలో కూడా అధిష్టానం ఆదేశంతో పోటీచేయలేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో బాబు జోక్యం ఉండదని, ఉంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను ఎవరు అడ్డుకున్నా ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రాజెక్టుల విషయంలో బాబు లేఖలు రాశారని ఆరోపిస్తున్న కేసీఆర్‌కు, చంద్రబాబుతో మాట్లాడుకొని ఒప్పించే దైర్యం లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్‌ పోలవరంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాజెక్టులపై లేఖలు రాయలేదా అని ప్రశ్నించారు.

మా ఇంటికే బాబు వచ్చాడు...
చంద్రబాబును కలిసేందుకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలంతా వేచి చూశారని, ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటూ జర్నలిస్టులు ప్రశ్నించగా, జానారెడ్డి స్పందిస్తూ.. ‘‘మేమేమీ చంద్రబాబు ఇంటికి గానీ కార్యాలయానికి గానీ వెళ్లలేదు. ఆయనే మా పార్టీ అధినేత రాహుల్‌ ఇంటికి వచ్చారు. రాహుల్‌ ఇల్లంటే మా ఇల్లే. అక్కడ చంద్రబాబు ఉండటం వల్ల కలిశాం. అంతేగానీ మేమేమీ బాబు కోసం వెయిట్‌ చేయలేదు.

ఈ విషయంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు. కూటమిలో టీడీపీ భాగస్వామ్య పార్టీ. అలాంటప్పుడు చంద్రబాబుతో చర్చించడం తప్పెలా అవుతుంది’’అని ప్రశ్నించారు. ఏపీ భవన్‌లో ఉన్నప్పుడు కూడా ఒకే చాంబర్లో కలిసి చర్చించామని తెలిపారు. ఒకప్పుడు తన ఇంటి ఎదుట కూడా చాలామంది నేతలు నిలబడ్డారని, కావాలంటే పాత ఫొటోలు రిలీజ్‌ చేస్తా చూసుకోవాలంటూ టీఆర్‌ఎస్‌కు బదులిచ్చారు.

నెమ్మదిగా వెళ్లిన తాబేలుదే విజయం..
ఎన్నికల్లో పరిగెత్తిన కుందేలు పడుకోబోతోందని, నెమ్మదిగా వెళ్తున్న తాబేలు గెలుస్తోందని జానారెడ్డి జోస్యం చెప్పారు. టికెట్లపరంగా అందరికీ అవకాశాలు ఇవ్వాలనుకున్నా పొత్తుల వల్ల సమస్య వచ్చిందన్నారు. ఓయూ విద్యార్థి నేతలకు ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టికెట్ల కేటాయింపు ఉండనుందని తెలిపారు. తన కొడుకైనా, ఇంకెవరైనా గెలుపొందే అవకాశాలుంటేనే ఎంపిక చేస్తున్నామని స్పష్టంచేశారు. ఈ సారి ఎన్నికల్లో కేసీఆర్‌ రికార్డు బ్రేక్‌ చేస్తామని, ఎన్నో హామీలిచ్చి అమలుచేసిన ఎన్టీఆర్‌కే 1989లో ఓటమి తప్పలేదని గుర్తుచేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top