బాబు, పవన్‌ లిక్కర్‌ రాజకీయం

Nagari MLA RK Roja Slams Chandrababu naidu And Pawan Kalyan - Sakshi

చిత్తూరు, నగరి : మద్యం షాపులు తెరవడం, ధరలు పెంచడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అనవసర రాజకీయం చేస్తున్నారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. మద్యం విక్రయాలు రాష్ట్రానికి ఆదాయ వనరైనా అక్కచెల్లెమ్మల పసుపుకుంకుమలను కాపాడేందుకు సీఎం దశలవారీ మద్య నిషేధానికి పూనుకున్నారన్నారు. ఇప్పటికే 33 శాతం మద్యం షాపులు మూసేశారన్నారు. ఎన్టీఆర్‌ మద్య నిషేధం తెస్తే దాన్ని తొలగించి 40 వేల బెల్టుషాపులు తెరిచి ఆడవారి జీవితాలతో ఆడుకున్న చంద్రబాబు నేడు మద్యం విక్రయాల గురించి మాట్లాడటం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించిన తీరుగా ఉందన్నారు.

బుధవారం ఆమె నగరిలో విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజకమైన పాలన చూసి ఓర్వలేకే టీడీపీ నాయకులు ఆయనపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లాక్‌డౌన్‌ సమయంలో ఉచిత రేషన్, రూ.వెయ్యి, పింఛన్‌ అందించి ప్రజలను ఆదుకుంటూ ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగనన్న చూపుతున్నారన్నారు. టీడీపీలో ఉన్న సమయంలో, బయటకు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు చేసిన తప్పులపై నిలదీస్తుండడంతో తొలి నుంచి తనను టీడీపీ నాయకులు టార్గెట్‌ చేస్తున్నారన్నారు. గతంలో అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేయడం, మీటింగ్‌కు రాకుండా అడ్డుకోవడం అందులో భాగమేనన్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో తన నియోజకవర్గ ప్రజలకు ఎంతో సేవ చేశానని, చేస్తున్నానని అన్నారు. మంచి చేసే వారిని ప్రోత్సహించాలని, బురదచల్లడం సబబుకాదని హితవుపలికారు. తన నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకిందన్నారు.

పవన్‌ కల్యాణ్‌ బాధ్యత లేని వ్యక్తి
జనసేన పార్టీ తరఫున రెండు స్థానాల్లో పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసి ఓడిపోయారని, పార్టీ అధ్యక్షుడు ఓటమి పాలవడం చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదని ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. 2014లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టినా తాము ప్రజల వెంటే నడిచామని, అందుకే జగనన్నను సీఎం చేశారని అన్నారు. పవన్‌కల్యాణ్‌లా ట్విట్టర్లు, జూమ్‌ యాప్‌ల ద్వారా ఏసీ రూమ్‌లో కూర్చుని విమర్శలు చేయలేదని దుయ్యబట్టారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top