ఎవరి ఆరోగ్యం కోసం ఈ ‘స్కీమ్‌’

Modi Health scheme ayushman bhava is very costly - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజలకు ఆరోగ్య భీమాను కల్పించేందుకు ఉద్దేశించిన ‘జాతీయ ఆరోగ్య భద్రతా పథకం (ఎన్‌హెచ్‌స్కీ)’ను ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు పంధ్రాగస్టు సందర్భంగా ప్రారంభిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య భీమాను కల్పించే ఈ పథకానికి ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా దేశంలోని పది వేల కుటుంబాలకు, సరాసరి సగటున కుటుంబంలో ఐదుగురు సభ్యులు ఉంటారనుకుంటే యాభై కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ పథకం చుట్టూ ఇప్పటికే పలు అనుమానాలు ముసురుకొని ఉన్నాయి.

‘ఆయుష్మాన్‌ భారత్‌’లో భాగమైన ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఇంతవరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆమోదించగా ఇంకా పలు రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు వివిధ పద్ధతుల్లో ఆరోగ్య భీమా పథకాలకు ఫలప్రదంగానే అమలు చేస్తుండడం వల్ల ఈ పథకాన్ని తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలో అర్థంకాక తికమక పడుతున్నాయి. 2008 సంవత్సరం నుంచి కేంద్ర ప్రభుత్వం ‘రాష్ట్రీయ స్వస్థత ఆరోగ్య భీమా పథకాన్ని’ అమలు చేస్తోంది. ప్రతి పేద కుటుంబానికి 30 వేల వరకు ఆరోగ్య భీమాను కల్పిస్తున్న ఈ పథకానికి 750 రూపాయలను ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఈ పథకం కింద కేంద్రం 75 శాతం వాటా నిధులను భరిస్తుంటే రాష్ట్రం 25 శాతం నిధులను భరిస్తోంది. ఐదులక్షల రూపాయల కవరేజ్‌ గల కొత్త పథకం వచ్చాక ఈ పాత పథకాన్ని రద్దు చేస్తారా, లేదా అన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఈ రాష్ట్రీయ స్వస్థత ఆరోగ్య భీమా పథకాన్ని మాత్రమే ఉత్తరాది రాష్ట్రాలు, అది కూడా అరకొరగా అమలు చేస్తుంటే, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలు సవ్యంగా అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు సొంత ఆరోగ్య పథకాలతో మిలితం చేసి మరింత పటిష్టంగా అమలు చేస్తున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో లక్ష రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు భీమా కవర్‌తో ఆరోగ్య శ్రీ, పేదల ఆరోగ్య భీమా పథకాలను అమలు చేస్తున్నాయి. కేంద్రం కొత్త పథకాన్ని స్వీకరించి ఇప్పటి వరకు తాము అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను మూలన పడేయాలా? అన్న సందిగ్ధంలో ఈ రాష్ట్రాలు కొట్టుమిట్టాడుతున్నాయి.

కేంద్ర ప్రతిపాదిత ఐదు లక్షల ఆరోగ్య భీమాకు 1,082 రూపాయలను కేంద్రం ప్రీమియంగా నిర్ణయించింది. అయితే ఏ భీమా కంపెనీ ఈ ప్రీమియంకు ఒప్పుకోదని, ప్రీమియంగా ఇంతకన్నా 63 శాతం ఎక్కువగా అంటే, 1,765 రూపాయలను చెల్లించాల్సి వస్తుందని ‘క్రిసిల్‌’ ఓ నివేదికలో వెల్లడించింది. ఇప్పటికే జాతీయ ఆరోగ్య భద్రతా పథకంలో కేంద్రం 60 శాతం భరిస్తుండగా, రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించాలన్నది తెల్సిందే. ఈ అదనపు ప్రీమియం కూడా రాష్ట్రాలే భరించాల్సి రావచ్చు. కేరళలో 41 లక్షల మంది పేదలకు ప్రస్తుతం ఆరోగ్య భీమాను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కీమ్‌లో అక్కడ 22 లక్షల మంది పేదలకు మాత్రమే ఈ స్కీమ్‌ను అమలు చేయాలని సీలింగ్‌ పెట్టారు. ఈ లెక్కన అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న 41 లక్షల మందికి కొత్త పథకాన్ని అమలు చేయాలంటే 19 లక్షల మందికి స్వయంగా ప్రీమియం మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.

25 కోట్లకుగాను, 3.6 కోట్ల మందికే
కేంద్రం ఇప్పటికే అమలు చేస్తున్న ‘రాష్ట్రీయ స్వస్థత భీమా యోజన’ను దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, కేవలం 3.6 కోట్ల మందికి మాత్రమే అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న వారికే కాకుండా రోజువారి దినసరి కూలీలు, ఇంటి పనివాళ్లు, భవన నిర్మాణ కూలీలు, వీధుల్లో వ్యాపారం చేసుకునేవారు, రైల్వే పోర్టర్లు, బీడి కార్మికులు, పారిశుద్ధ పనివాళ్లు, రిక్షా కార్మికులు....ఇలా అసంఘటిత రంగానికి చెందిన ప్రతి ఒక్కరు అర్హులైనప్పటికీ 3.6 కోట్ల మందికి మించి అమలు జరగడం లేదు. ఇప్పుడు దారిద్య్ర రేఖకు దిగువనున్న పది కోట్ల మందికి మాత్రమే అమలు చేయాలనుకుంటున్న కొత్త ఆరోగ్యం పథకం రెండు కోట్ల మందికి దాటటం కూడా మహా ఎక్కువన్నది నిపుణుల అంచనా.

కార్పొరేట్‌ ఆస్పత్రలు కోసమే
ఉత్తరాదిలో కార్పొరేట్‌ వైద్యం అంతగా విస్తరించలేదు. అక్కడ ఆరోగ్య భీమా పథకాలు అంతంత మాత్రమవడం కూడా ఒక కారణం. ఇటు దక్షిణాదిలో కార్పొరేట్‌ ఆస్పత్రులు విస్తరించినప్పటికీ గ్రామీణ ప్రాంతాలకు అవి ఇప్పటికీ దూరంగా ఉన్నాయి. కార్పొరేట్‌ వైద్యం ఖరీదవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో అవి నిలదొక్కుకోలేక పోతున్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రవేశ పెట్టిన ఐదు లక్షల భద్రతా పథకం వల్ల కార్పొరేట్‌ ఆస్పత్రులు గ్రామీణ ప్రాంతాలకు దూసుకుపోతాయని, అందుకోసమే మోదీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను తీసుకొస్తున్నదని బెంగళూరులోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సహ వ్యవస్థాపకులు, డైరెక్టర్‌ ఎన్‌. దేవదాసన్‌ లాంటి వాళ్లు విమర్శిస్తున్నారు.

మూడు లక్షలు చాలు
తమిళనాడులో ఏటా 72 వేల రూపాయలకన్నా తక్కువ ఆదాయం కలిగిన పేద ప్రజల కోసం రెండు రకాల ఆరోగ్య భీమా పథాన్ని అమలు చేస్తున్నారు. 1205 రకాల వైద్యానికి లక్ష రూపాయలు, 254 రకాల వైద్యానికి రెండు లక్షల రూపాయలను అమలు చేస్తున్నారు. 2009 నుంచి ఈ పథకం సవ్యంగా అమలు జరుగుతున్నది. మహారాష్ట్రలో ఒకటిన్నర లక్షల రూపాయను, రాజస్థాన్‌లో మైనర్‌ వైద్యానికి 30 వేల రూపాయలను మేజర్‌ వైద్యానికి మూడు లక్షల రూపాయలను బీమాను అమలు చేస్తున్నారు. ఈ లెక్కన మోదీ ప్రారంభిస్తున్న జాతీయ ఆరోగ్య భీమా స్కీమ్‌ కింద మూడు లక్షల రూపాయల భీమాను కల్పిస్తే సరిపోతుందని జిందాల్‌ గ్లోబల్‌ యూనివర్శిటీలోని ‘స్కూల్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీ’ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఇంద్రానిల్‌ ముఖోపాధ్యాయ్‌ అభిప్రాయపడ్డారు.

క్యాన్సర్, అవయవ మార్పిడి కాస్ట్లీ..!
క్యాన్సర్, గుండె, కిడ్నీల మార్పిడి లాంటి శస్త్ర చికిత్సలకే ఐదు లక్షల రూపాయలకు మించి ఖర్చు అవుతుంది. మిగితా జబ్బులన్నింటికి మూడు లక్షల కవరేజ్‌తోని వైద్యం చేయవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎక్కువ ఖర్చయ్యే వైద్యం కోసం ఎక్కువ కవరేజీ, తక్కువ ఖర్చయ్యే వాటికి తక్కువ కవరేజ్‌తో భీమా పథకాలను అమలు చేయడం ఉత్తమమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎక్కువ కవరేజీ వల్ల కార్పొరేట్‌ ఆస్పత్రులు లాభ పడడమే కాకుండా అనవసరమైన పరీక్షలు, చికిత్సలు చేస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ‘రాష్ట్రీయ స్వస్థత భీమా యోజన’ కింద 2011లో బీహార్‌లో 700 మంది మహిళలకు అనవసరంగా కార్పొరేట్‌ ఆస్పత్రులు  శస్త్ర చికిత్సలు చేసి గర్భసంచులు తొలగించారు. ఇలాంటి కేసులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, చత్తీస్‌గ«ఢ్‌లలోనూ వెలుగు చూశాయి. 1996 నుంచి 2014 మధ్య కార్పొరేట్‌ వైద్యం మరీ ఖరీదై పోయిందని ఓ ఆధ్యయనం తెలియజేయగా, ఏటా ఎనిమిది శాతం మంది మధ్య తరగతి ప్రజలు వైద్యం కారణంగా పేదవారుగా మారిపోతున్నారని మరో అధ్యయనం వెల్లడించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top