కరువు కావాలంటే బాబు రావాలి

MLA Roja Slams Chandrababu Naidu in Public Meeting - Sakshi

రాష్ట్రం అప్పుల్లో ఉంది... బాబు భార్య ఆస్తులు ఐదురెట్లు పెరిగాయి

కుప్పంను మున్సిపాలిటీ చేయలేడు...

రాష్ట్రాన్ని సింగపూర్‌ చేస్తాడంట

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా సెటైర్లు

పుత్తూరు: ‘కరువు రావాలంటే బాబు రావాలి...ఎరువులు కావాలంటే జగన్‌ రావాలి... బాబు వస్తే రైతులకు ఉరి...జగన్‌ వస్తే రైతులకు మద్దతు ధర...ఎన్నికలకు ముందు అరుం ధతి చూపిస్తాడు... ఎన్నికలయ్యాక భ్రమరావతిని చూపిస్తాడు...సొంత నియోజకవర్గం కుప్పంను మున్సిపాలిటీ చేయలేడు గాని...రాష్ట్రాన్ని మాత్రం సింగపూర్‌ చేస్తాడంట...రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.60 వేలు అప్పు పెట్టాడు...మనవడు దేవాన్ష్‌కు మాత్రం రూ.19 కోట్లు ఇచ్చాడు... రాష్ట్రం అప్పుల్లో ఉంటే భార్య భువనేశ్వరి ఆస్తులు మాత్రం ఐదు రెట్లు పెరిగాయి...కోడలు బ్రహ్మణికి హైదరాబాద్‌లో ఐస్‌క్రీం ఫ్యాక్టరీ పెట్టిస్తాడు... రాష్ట్రంలో సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూసివేస్తాడు’...అంటూ వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్‌కే రోజా సీఎం చంద్రబాబును కడిగి పారేశారు. పట్టణంలోని మండపం వద్ద శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో నిర్వహిం చారు. ఆమె మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కావాలో... పూటకో మాట చెప్పే వెన్నుపోటు చక్రవర్తి చంద్రబాబు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు.

జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అందుకే నోట్ల కట్టలతో పాటు హత్యలు, దౌర్జన్యాలతో ప్రజలను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. పుట్టిన జిల్లాకు ఏమీ చేయని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారని నిలదీశారు. ఇన్నాళ్లు జాతిని, జాతి నాయకులను, జాతి అధికారులను నమ్ముకున్న చంద్రబాబునాయుడు జగన్‌ సునామీని చూసి బెంబేలెత్తుతున్నారని, దీంతో జాతి నాయకులకు బదులు జాతీ య నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడు చెప్పే ప్రతి అబద్ధానికీ సమాధానం ఇవ్వగలరా అని జాతీయ నాయకులను ఆమె సూటిగా ప్రశ్నించారు. నగరి, పుత్తూరు అభివృద్ధి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలోనే జరిగిందని ఆమె స్పష్టం చేశారు. పుత్తూరు, నగరిలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు, పుత్తూరులో ఫ్‌లైఓవర్, అండర్‌ బ్రిడ్జి, నగరిలో ఈటీపీ ప్లాంట్‌ తదితర రూ.కోట్ల విలువైన అభివృద్ధి పనులు మహానేత హయాంలో జరిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. నగరి నియోజకవర్గంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని, చిత్తూరు, రేణిగుంట çసహకార షుగర్‌ ఫ్యాక్టరీలు తెరిపించాలని, గాలేరు–నగరి సుజల స్రవంతిని పూర్తిచేసి సాగు, తాగునీరు అందించాలని ఆమె జగన్‌మోహన్‌రెడ్డికి విన్నవించారు. క్షత్రియ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, రాయలసీమ వ్యక్తిని చైర్మన్‌గా నియమించాలని, చేనేత పరిశ్రమకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని కోరారు.

పంచభూతాలు ఆశీర్వదిస్తున్నాయి..
జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని పంచభూతాలు ఆశీర్వదిస్తున్నాయని ఆ పార్టీ చిత్తూరు పార్లమెంట్‌ అభ్యర్థి రెడ్డెప్ప అన్నారు. పుత్తూరులో అన్నా క్యాంటీన్‌ ఏర్పాటులో విఫలమయ్యారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీల దాష్టీకా లకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. పుత్తూరులో శివాలయం భూములు టీడీపీ నాయకులు అన్యాక్రాంతం చేసుకున్నారని ఆరోపించారు. నగరి నియోజకవర్గంలోని రైల్వే స్టేషన్ల సమస్యలపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి, సత్యవేడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top