ఓటరు దేవా.. నమోనమః | MLA candidates Campaign in every area to attract voters | Sakshi
Sakshi News home page

ఓటరు దేవా.. నమోనమః

Dec 1 2018 1:26 AM | Updated on Mar 18 2019 9:02 PM

MLA candidates Campaign in every area to attract voters - Sakshi

తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రం క్రమంగా ఉత్కంఠ దశకు చేరుకుంటోంది. ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న సెప్టెంబర్‌ 6 నుంచి వేడెక్కుతూ వస్తున్న రాష్ట్ర రాజకీయం తుది అంకానికి చేరుకుంది. పోలింగ్‌కు  వారం రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్‌ నెలకొంది. ఈ వారం రోజుల కష్టంపైనే రానున్న ఐదేళ్ల రాజకీయ భవిష్యత్‌ ఆధారపడి ఉండడంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే, ఓటరు దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు తాము పడుతున్న పాట్లు ఎలాంటి ఫలితాన్నిస్తాయోనన్న ఆలోచన అభ్యర్థులకు కంట నిద్ర లేకుండా చేస్తోంది. 
    –సాక్షి, హైదరాబాద్‌

మార్మోగుతున్న  పల్లెలు 
ఇన్నాళ్లూ అభ్యర్థుల ఎంపిక, పొత్తుల కసరత్తుతో కాలం గడిచినా గత వారం రోజులుగా తెలంగాణ పల్లెల్లో జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష ప్రజాకూటమితో పాటు ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కాళ్లకు బలపాలు కట్టుకుని పల్లెల్లో తిరుగుతున్నారు. ఊరూ వాడా తిరుగుతూ తమకు ఓటేయాలని ఓటరు దేవుళ్లను వేడుకుంటున్నారు. ఓటర్లను ఆకర్షించేందుకు అనేక ఫీట్లు చేస్తూ పాట్లు పడుతున్నారు. ఈ అభ్యర్థులకు తోడు రాష్ట్ర, జాతీయ నేతలు కూడా ప్రచారపర్వంలోకి అడుగుపెట్టటంతో గత ఐదారు రోజులుగా ఎన్నికల ప్రచారం మార్మోగిపోతోంది. ఓ వైపు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ నెల 19 నుంచి రోజుకు నాలుగైదు నియోజకవర్గాలను చకచకా చుట్టేస్తుండగా, ఇటు ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ కీలక నేత సోనియాగాంధీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అమిత్‌ షా, వివిధ పార్టీల అగ్రనేతలు సుష్మా స్వరాజ్, గులాంనబీ ఆజాద్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, బీఎస్పీ అధినేత మాయావతి లాంటి నేతలు రాష్ట్రానికి రావడంతో ప్రచార సందడి నెలకొంది.  

రసకందాయంగా ప్రచారం
ప్రచార గడువు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు తమ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌లో ఆ పార్టీ అధినేత కేసీఆర్, కీలక నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లు రాష్ట్రమంతా చుట్టివస్తూ ప్రత్యర్థులపై మాటల దాడులు చేస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి చెప్పడంతో పాటు తెలంగాణ భవిష్యత్‌ పదిలంగా ఉండాలంటే మరోవైపు చూడవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్‌ పక్షాన రాహుల్, సోనియాగాంధీలతో పాటు కూటమి నేతలు చంద్రబాబు, ఉత్తమ్, కోదండరాం, రేవంత్‌రెడ్డిలు అధికార పార్టీ శిబిరంపై మాటల తూటాలతో ప్రచారానికి పదును పెడుతున్నారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌షాలూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను విమర్శిస్తుండటం, వారికి కేసీఆర్, రాహుల్‌ కౌంటర్‌లు ఇస్తుండటంతో ఎన్నికల ప్రచార పర్వం రసకందాయంగా సాగుతోంది.  

ఆ రెండ్రోజులే కీలకం.. 
ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎంత ప్రచారం చేసినా ఎన్నికలకు ముందు రెండ్రోజులు ఎలా ఉంటుందనేది అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రచారం డిసెంబర్‌ 5 నాటికి పూర్తవుతుండటంతో అంతకంటే ముందు రెండ్రోజులు, ఆ తర్వాతి రెండ్రోజులే కీలకంగా మారాయి. అంతకుముందు ఎన్ని అంచనాలున్నా.. చివరి రెండ్రోజుల్లోనే అవన్నీ తల్లకిందులైన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ప్రచార ఘట్టంలో ప్రాధాన్యత సంతరించుకునే ఆ రెండ్రోజుల కోసం అభ్యర్థులు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఓటర్లకు గాలం వేసి, వారిని తమవైపు తిప్పుకునేందుకు తాయిలాలిచ్చే సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. వీలున్నంత మేర డబ్బు, మద్యం పంపిణీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే దిశలో అడుగులు వేస్తున్నట్టు సమాచారం. మున్సిపల్‌ వార్డులు, పంచాయతీల్లో తాజా, మాజీ ప్రజా ప్రతి‘నిధుల’కే డబ్బుల పంపిణీని అప్పగించినట్లు చర్చ జరుగుతోంది. అయితే, ప్రతీ ఎన్నికల్లో జరిగిన విధంగానే ఈసారి కూడా 5, 6 తేదీల్లో డబ్బు, మద్యం పంపిణీకి పెద్ద ఎత్తున పథకం పన్నినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళలకైతే చీర, సారె, ఇతర వస్తువులు అందించే అవకాశాలూ లేకపోలేదని అంటున్నారు.  

ఈసీ డేగ కన్ను
రాజకీయ పార్టీలు, అభ్యర్థుల వ్యూహాలు ఎలా ఉన్నా ఈసారి మాత్రం ఎన్నికల సంఘం డేగ కన్ను వేసింది. గట్టి నిఘా పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలను అడ్డుకునేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. ప్రత్యేక స్క్వాడ్‌ బృందాల సాయంతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి అక్రమ వ్యవహారాలకు చెక్‌ పెట్టేందుకు యత్నిస్తోంది. చివరి రెండ్రోజుల్లో మరింత గట్టిగా నిఘా పెట్టి డబ్బు, మద్యం, తాయిలాల పంపిణీని అడ్డుకోవడానికి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement