72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...

Kurasala Kannababu Speech In Special Assembly Session On AP Capital - Sakshi

72 ఏళ్లు గడిచినా.. ఇంకా కరువు ప్రాంతంగానే ఉన్నాం

వెనుకబాటు కారణంగానే ఉద్యమాలు

అమరావతితో గత ప్రభుత్వం విఫలమైంది

శాసనసభలో మంత్రి కురసాల కన్నబాబు

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు అనాలోచిత రాజకీయ నిర్ణయాల కారణంగానే ఆంధ్రరాష్ట్ర ప్రజలు రాజధాని లేకుండా మిగిలిపోయారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 72 ఏళ్లు గడిచినా.. ఇంకా కరువు ప్రాంతంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఒక్క ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలపై కుట్రపూరింతగా వివక్ష చూపడం వల్లనే వెనుకబడి పోతున్నాయని అన్నారు. కేవలం వెనుకబాటు తనం కారణంగానే తెలంగాణ ఉద్యమం​ వచ్చిందని, విభజన అనంతరం హైదరాబాద్‌ నుంచి పారిపోయి రావడానికి చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. సోమవారం శాసన సభలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి కన్నబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు.

‘ప్రాంతాలపై వివక్ష చూపడం ఏ ప్రభుత్వానికి సరైనది కాదు. 1953లో ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిప్పుడు కర్నూలును రాజధానిగా నిర్మించాలి అనుకున్నాం. అంతలోనే ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుతో తిరిగి హైదరాబాద్‌ వెళ్లిపోయాం. 2014లో రాష్ట్ర విభజనతో మళ్లీ హైదరాబాద్‌ నుంచి సర్దుకుని రావాల్సి వచ్చింది. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నా.. చంద్రబాబు నాయుడు ఎందుకు పారిపోయి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీటన్నింటిపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చసాగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జీఎన్‌రావు, బీసీజీ, హైపవర్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలన్ని వికేంద్రీకరణ జరపాలని నిర్థారించాయి. వీటకంటే ముందే కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణకే ముగ్గుచూపింది.

సూపర్‌ క్యాపిటల్‌ను నిర్మించవద్దని కూడా సూచించింది. శివరామకృష్ణ కమిటీ ప్రధానంగా మూడు సూచనలు చేసింది. గ్రీన్‌ఫీల్డ్‌ నగరం, ఉన్న నగరాన్ని విస్తరించడం, అభివృద్ధి వికేంద్రీకరణ. గత ప్రభుత్వం గ్రీన్‌ ఫీల్డ్‌సిటీ పద్దతిని ఎంచుకుని బొక్కబోర్లా పడింది. అమరావతి నిర్మాణం చేపట్టింది. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. చివరికి రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు కనీసం వాళ్లకు ఫ్లాట్లు కూడా ఇవ్వలేకపోయింది. దీనికి చంద్రబాబు నాయుడు రాజకీయ నిర్ణయాలే కారణం. ఐదేళ్ల పాటు విదేశీ బృందాలు, గ్రాఫిక్స్‌లు, సినిమా డైరెక్టర్లను తెచ్చి డిజైన్లు చేశారు. రాష్ట్రాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పుదోవ పట్టించారు.’అని అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top