‘బహిష్కరణ’పై న్యాయ పోరాటం 

Komatireddy and Sampath was filed a petition in the High Court - Sakshi

      హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన కోమటిరెడ్డి, సంపత్‌ 

     మా సభ్యత్వ రద్దు, నియోజకవర్గాల ఖాళీ ఉత్తర్వులను రద్దు చేయండి 

     ఎన్నికలు నిర్వహించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించండి

     సభ వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా ఆదేశాలివ్వండి 

     గవర్నర్‌ ప్రసంగం సభా వ్యవహారాల కిందకు రాదు 

     ఆ మేరకు మాపై స్పీకర్‌ చర్యలు తీసుకోజాలరు 

     సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వేటు వేశారని ఆవేదన 

     నేడు విచారణ జరుపుతామన్న న్యాయమూర్తి

సాక్షి, హైదరాబాద్‌: తమను శాసనసభ నుంచి బహిష్కరించడంతోపాటు, నల్లగొండ, ఆలంపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ శాసనసభ కార్యదర్శి జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎ.సంపత్‌కుమార్‌ న్యాయ పోరాటం ప్రారంభించారు. గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలును నిలిపేయడంతోపాటు, ఆ నోటిఫికేషన్‌ ఆధారంగా నల్లగొండ, అలంపూర్‌ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మండలి చైర్మన్‌పై హెడ్‌ సెట్‌ విసిరేసి ఆయనను గాయపరిచామని చెప్పి తమ శాసన సభ్యత్వాలను రద్దు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల కార్యదర్శులను ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. తమ బహిష్కరణ, తమ అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ శాసనసభ వ్యవహారాలకు, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమని, సహజ న్యాయ సూత్రాలను కాలరాస్తూ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఏకపక్షంగా ప్రకటించాలని కోర్టును కోరారు. గురువారం ఉదయం ఈ వ్యాజ్యం గురించి కోమటిరెడ్డి, సంపత్‌ల తరఫు న్యాయవాది న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ముందు ప్రస్తావించారు. దీనిపై విచారణ జరపాలని అభ్యర్థించారు. స్పందించిన న్యాయమూర్తి శుక్రవారం విచారణ జరుపుతామని తెలిపారు. 

వ్యక్తిగత పగకు బాధితులయ్యాం 
‘అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ అలుపెరగని పోరాటం చేస్తున్నాం. పోరాటాలు, చర్చలు, బహిరంగ సవాళ్ల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాం. ఈ నేపథ్యంలోనే మేం ముఖ్యమంత్రి, ఆయన సహచరుల వ్యక్తిగత పగకు బాధితులుగా మారాం. అందుకే మమ్మల్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పదే పదే ప్రశ్నిస్తున్న మమ్మల్ని భవిష్యత్తులో శాసనసభలో అడుగుపెట్టనివ్వబోమని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. 2018 బడ్జెట్‌ సెషన్‌ ప్రారంభానికి ముందు శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి ఈ నెల 12న గవర్నర్‌ ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగానికి ఆటంకం కలిగించామంటూ 13వ తేదీన ఆశ్చర్యకరంగా శాసన సభా వ్యవహారాల మంత్రి మా ఇద్దరినీ సభ నుంచి బహిష్కరిస్తూ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి అనుగుణంగా మా నియోజకవర్గాలైన నల్లగొండ, ఆలంపూర్‌లు ఖాళీ అయినట్లు పేర్కొంటూ ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. రాజ్యాంగంలోని అధికరణలు 175, 176 ప్రకారం సభా సమావేశాలకు సంబంధించి గవర్నర్‌ ప్రసంగానికి ముందూ, తర్వాతా ప్రతీ సభ్యుడు సభ హుందాతనాన్ని కాపాడాల్సి ఉంటుంది. అలాగే గవర్నర్‌ ప్రసంగానికి ఏ రకంగానూ అంతరాయం కలిగించడానికి వీల్లేదు. అయితే రాజ్యాంగ నిబంధనలు, శాసనసభ నిర్వహణ నిబంధనల్లో గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగించిన సభ్యుడిని సస్పెండ్‌ చేయవచ్చని ఎక్కడా లేదు. సభాపతి స్థానాన్ని గానీ, సభను గానీ కించపరిచినప్పడు, సభా వ్యవహారాలను నిరాటంకంగా అడ్డుకున్నప్పుడు స్పీకర్‌ సంబంధిత సభ్యుడిని సస్పెండ్‌ చేయవచ్చు. అది కూడా ఓ సెషన్‌కు మాత్రమే పరిమితం. కానీ తమను గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగించామంటూ బహిష్కరించారు’అని పిటిషన్‌లో పేర్కొన్నారు. 

సభా వ్యవహారాల కిందికి రాదు 
‘గవర్నర్‌ ప్రసంగానికీ, సభా వ్యవహారాలకు సంబంధమే లేదు. సభా వ్యవహారాలపై పలువురు నిపుణులు రాసిన పుస్తకాలను బట్టి ముఖ్యంగా సుభాష్‌ సి.కశ్యప్‌ రాసిన పార్లమెంటరీ ప్రొసీజర్, థర్డ్‌ ఎడిషన్‌ను పరిశీలిస్తే, రాష్ట్రపతి, గవర్నర్‌ ప్రసంగాలు సభా వ్యవహారాల పరిధిలోకి రావు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో సభకు గవర్నరే నేతృత్వం వహిస్తారు. అప్పుడు జరిగేవి సభా వ్యవహారాలు కాదు. వాటి విషయంలో స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోజాలరు. గవర్నర్‌ ప్రసంగం ముగిశాకే సభా వ్యవహారాలు ప్రారంభమవుతాయి. అప్పటి నుంచే సభా నిబంధనలు అమల్లోకి వస్తాయి. మేం గవర్నర్‌ ప్రసంగానికి అంతరాయం కలిగించామని, సభలో హుందాగా వ్యవహరించలేదని సభా వర్గాలు మాకు 12వ తేదీన చెప్పలేదు. ఈ విషయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వడం గానీ, వివరణ కోరడం గానీ చేయలేదు. గవర్నర్‌ ప్రసంగ సమయంలో మిగిలిన పార్టీలు కూడా వాకౌట్‌ చేశాయి. ఇది కూడా సభ హుందాతనానికి విరుద్ధంగా వ్యవహరించడమే. వారు చేసింది తప్పు కానప్పుడు మేం చేసింది ఎలా తప్పు అవుతుంది? గవర్నర్‌ ప్రసంగం సమయంలో బల్లలు చరుస్తూ నిరసన తెలియజేయడం సభా హుందాతనాన్ని కాలరాయడమైతే, అదే ప్రసంగాన్ని, ముఖ్యమంత్రిని కీర్తిస్తూ బల్లలు చరిచిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బల్లలు చరిచిన వారినీ, కొన్ని పార్టీలను వదిలేసి మాపైనే చర్యలు తీసుకోవడం అన్యాయం. చట్టాలు చేసే సభలోనే సమానత్వం లేదన్న విషయం రుజువైంది. గవర్నర్‌ ప్రసంగం సభా వ్యవహారాల కిందకు రాదు. అందువల్ల మమ్మల్ని సభ నుంచి బహిష్కరిస్తూ అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులు చట్ట ప్రకారం చెల్లుబాటు కావు. కాబట్టి ఆ ఉత్తర్వులను రద్దు చేయండి’అని కోర్టును కోరారు. 

వీడియో ఫుటేజీని బయటపెట్టలేదు 
‘శాసనమండలి చైర్మన్‌పై హెడ్‌ సెట్‌ విసరడంతోపాటు, మరో సభ్యుడు పదే పదే నినాదాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. హెడ్‌ సెట్‌ విసిరిన తర్వాత కూడా మండలి చైర్మన్, స్పీకర్, గవర్నర్‌ సరదాగా మాట్లాడుకున్నారు. గవర్నర్‌ వెళ్తున్నప్పుడు ఆయన కారు వరకు వెళ్లి వీడ్కోలు పలికారు. ఆ తర్వాతనే మండలి చైర్మన్‌ తన కంటికి గాయమైందంటూ ఫిర్యాదు చేశారు. సాయంత్రానికి కంటికి బ్యాండేజ్‌ వేసుకున్నారు. చైర్మన్‌ ఇలా చేయడం ప్రభుత్వ కుట్రలో భాగమే. మేం హెడ్‌ సెట్‌ విసరడం వల్ల చైర్మన్‌కు గాయమై ఉంటే అది వీడియో ఫుటేజీలో తప్పక ఉండి తీరుతుంది. అయితే ఆ ఫుటేజీని ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. మా వల్ల చైర్మన్‌ గాయపడ్డారని ఆరోపిస్తూ, ఆ ఫుటేజీని మాకు ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. వీడియో ఫుటేజీని ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఫుటేజీని బయటపెట్టకుండానే మమ్మల్ని బహిష్కరిస్తూ శాసన వ్యవహారాల మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ వీడియో ఫుటేజీని కోర్టు ముందుంచేలా అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించండి’అని కోమటిరెడ్డి, సంపత్‌ తమ పిటిషన్‌లో విన్నవించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top