ఒకేసారి 2 లక్షల రుణమాఫీ

Kodandaram released the TJS Manifesto - Sakshi

     తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు

     ఉపాధి లభించే వరకు రూ.3వేల భృతి 

     బీపీఎల్‌ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు 

     పేద కుటుంబాలకు వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ 

     కౌలు రైతులకూ ప్రభుత్వ పథకాల వర్తింపు

     అమరులు, ఉద్యమకారుల ఆకాంక్షల సాధనే లక్ష్యం

     టీజేఎస్‌ మేనిఫెస్టో విడుదల చేసిన పార్టీ అధ్యక్షుడు కోదండరాం

సాక్షి, హైదరాబాద్‌: అసమానతలు లేని తెలంగాణ సాధన, పరిపాలనలో మార్పు, అమరులు, ఉద్యమ కారుల ఆకాంక్షల సాధన ప్రాతిపదికగా తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) తన ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. పారదర్శక, ప్రజాస్వామిక, బాధ్యతాయుత సుపరిపాలన ధ్యేయంగా తాము పని చేస్తామని.. విధాన నిర్ణయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రతిరోజు ఉదయం ఒక గంటపాటు ప్రజలకు అందుబాటులో ఉండేలా పౌర సమాజ సూచనలు, సలహాలు తీసుకునేలా పరిపాలన చేస్తామని పేర్కొంది. సామాజిక న్యా యం, సాధికారత, అందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ ఉపాధి కల్పన, వ్యవసాయ అభివృద్ధి ప్రధానాంశాలుగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను మంగళవారం పార్టీ అధ్యక్షుడు కోదండరాం విడుదల చేశారు.  

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలివీ.. 
- రైతులకు ఒకేసారి రూ.2 లక్షల పంటరుణాల మాఫీ
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు. ఉపాధి లభించే వరకు రూ.3 వేల నిరుద్యోగ భృతి
ఉద్యమ కాలంలో ఉద్యమకారులపై పెట్టిన కేసులను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎత్తివేత
వాస్తవ కౌలుదారులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం
తెలంగాణ మ్యూజియంగా ప్రగతిభవన్‌
పేదరైతులను నిరాశ్రయులను చేస్తున్న 2016 భూసేకరణ చట్టం తొలగింపు, 2013 భూసేకరణ చట్టం యథావిధిగా అమలు
ప్రైవేటు యూనివర్సిటీల చట్టం రద్దు
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ఆర్టికల్‌ 8 రద్దుకు కృషి
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల ఫిర్యాదుల కోసం వారానికి మూడు గంటల కేటాయింపు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల మీడియం బోధన. ప్రతి మండలంలో ఐటీఐ ఏర్పాటు
పేద, మద్య తరగతి ప్రజల ఆరోగ్య వ్యవస్థను మెరుగుపర్చడానికి ఢిల్లీ తరహాలో ‘బస్తీ క్లినిక్‌’ల ఏర్పాటు
జిల్లా స్థాయిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు
రిజర్వ్‌ పంచాయతీలకు రూ.10 లక్షల గ్రాంట్‌
గ్రామ పంచాయతీ సిబ్బంది రెగ్యులరైజేషన్‌
హైదరాబాద్‌ నగర ట్రాఫిక్‌ అధ్యయనం, రోడ్ల మరమ్మతులు
గృహనిర్మాణం కోసం బీపీఎల్‌ కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లింపు
పేద కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 100–200 యూనిట్ల వరకు సగం ధరకే విద్యుత్తు. గృహ, వ్యాపార, కుటీర పరిశ్రమలు, దోభిఘాట్, హెయిర్‌సెలూన్లకు విద్యుత్‌చార్జీల తగ్గింపు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకం, కొత్త ఓపెన్‌ కాస్ట్‌ గనులకు అనుమతి నిరాకరణ
చేనేత కార్మికులకు 8 గంటల పనిదినం. లేబర్‌ యాక్టు అమలు
గీత కార్మికులకు రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.6లక్షల జీవిత బీమా
గీత కార్మికులకు గృహానిర్మాణ పథకం కింద రూ.5 లక్షలు
పెట్రోల్, డీజీల్, గ్యాస్‌ రేట్లపై రాష్ట్ర పన్నులు తగ్గింపు
ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు
బీసీ, ముస్లిం మైనార్టీల కోసం సబ్‌ప్లాన్‌
అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలకు 3 నెలల పాటు ఆర్థిక సహాయం
వికలాంగుల పింఛను రూ.2500కు పెంపు
అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోగా అమరులకు స్మృతివనం
సీపీఎస్‌ విధానం రద్దు. వేతన పెంపు కమిటీ సిఫా ర్సులు అమలు
కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత
బెల్టుషాపుల మూసివేత. పర్మిట్‌ రూముల రద్దు
65 సంవత్సరాల పైబడిన జర్నలిస్టులకు పెన్షన్‌
బీడీ కార్మికులకు నెలకు రూ.3వేల పెన్షన్‌.

ఎన్నికల అధికారిపై ఫిర్యాదు..
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి చింతా స్వామిని తప్పుదారి పట్టించిన ఎన్నికల అధికారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కోదండరాం తెలిపారు. నామినేషన్‌ సమయంలో రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థిని ఒక్కరు, రికగ్నైజ్డ్‌ పార్టీ అభ్యర్థిని పది మంది బలపరచాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తమ పార్టీ అభ్యర్థి పది మందిని తీసుకెళ్లినప్పటికీ.. అక్కడి ఎన్నికల అధికారి ఒక్కరు బలపరిస్తే సరిపోతుందని చెప్పారని తెలిపారు. దీంతో ప్రస్తుతం తమ పార్టీ అభ్యర్థి నామినేషన్‌ గందరగోళంలో పడిందన్నారు.

ముందు మీరు..తర్వాతే మేం!
ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ తమకు ఇస్తామన్న 8 స్థానాలను పూర్తిస్థాయిలో కేటాయించకపోగా.. వరంగల్‌ ఈస్ట్, మిర్యాలగూడ, మహబూబ్‌నగర్‌లలో రెండు స్థానాలను ఇస్తామని చెప్పి, వాటిని కూడా తేల్చలేదని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. తమకు ఇచ్చిన స్థానాల్లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థులను పోటీలో నిలిపిన నేపథ్యంలో ముందుగా వారు విత్‌డ్రా చేసుకోవాలని, తర్వాతే తాము ఆ పని చేస్తామని స్పష్టంచేశారు. మంగళవారం టీజేఎస్‌ కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌ చేశారు. తాము కూటమి లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని, అయితే అందుకు తమ పార్టీని ఫణంగా పెట్టే పరిస్థితి తెచ్చుకోలేమని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రయోజనం కోసం కాకుండా, ఇవాళ నష్టం జరిగినా.. రేపు కూటమి బతికే విధంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.

ఉమ్మడి ఎజెండా అమలు విషయంలో కూటమిలోని ఇతర పక్షాలు సహకరించకపోతే ఊరుకోబోమని స్పష్టంచేశారు. కూటమిని సరిగ్గా నడిపిస్తేనే ప్రజలకు లాభం జరుగుతుందని, ఈ విషయాన్ని కూటమిలో పెద్ద పక్షమైన కాంగ్రెస్‌ గుర్తించనంత కాలం ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడ్డారు. ఆ పాత్రను సరిగ్గా నిర్వహించాలంటే కాంగ్రెస్‌ కొంత కలుపుకొని పోయే తత్వం, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించాలని సూచించారు. వరంగల్‌ ఈస్ట్‌ తమకు ఇస్తామన్నందునే ఇన్నయ్యను బరిలో దింపామని కోదండరాం తెలిపారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ తక్షణ ప్రయోజనాల రీత్యా మరో అభ్యర్థికి సీటు ఇచ్చిందన్నారు. ఇప్పటికీ తమకు ఇచ్చిన స్థానాలను వదిలిపెట్టకుండా వెంట పడితే ఎలా? అన్న అభిప్రాయం ప్రజల్లో వచ్చిందన్నారు. ఇది కూటమికి నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. తమకు ఇస్తామన్న మిర్యాలగూడ సీటును ఆర్‌.కృష్ణయ్యకు ఇచ్చారని, ఆ విషయం తమకు చెప్పలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముందుగానే ఈ విషయం చెబితే తమ పార్టీ అభ్యర్థిని నిలిపే విషయంలో ఆలోచించేవారమని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top