ఒక్క రూపాయన్నా ఖర్చు చేశారా?

Kishan reddy comments on TRS - Sakshi

పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులనూ పక్కదారి పట్టించారు 

రాష్ట్ర ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి విమర్శలు

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదని బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం నుంచి కేంద్రం ఒక్కో గ్రామ పంచాయతీకి సగటున రూ.80 లక్షల చొప్పున కేటాయించిన నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తండా లు, చెంచు గూడేలను పంచాయతీలుగా మారుస్తామని గతంలో హామీ ఇచ్చిన సీఎం కె.చంద్రశేఖర్‌రావు, దాన్ని పట్టించుకోకుండా పంచాయతీ శాఖ చట్ట సవరణకు సిద్ధపడ్డారని విమర్శించారు. ఈ చట్ట సవరణ ఉద్దేశాలేంటో ప్రజలకు స్పష్టం చేయాలని, అన్ని వర్గాల సలహాలు తీసుకుని పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ల హక్కులను హరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం, వారికి మరిన్ని హక్కులు కల్పిస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు చేసిందేమిటో ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. 

ఎన్నిసార్లు వచ్చారు.. ఎన్నిసార్లు వెళ్లారు.. 
సీఎం కేసీఆర్‌ సచివాలయానికి ఎన్ని సార్లు వచ్చారు, గవర్నర్‌ను కలిసేందుకు రాజ్‌భవన్‌కు ఎన్నిసార్లు వెళ్లారో ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరుతున్నట్టు తెలిపారు. మూడున్నరేళ్ల పాలన తర్వాత టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో కొందరు కళ్లు తెరవటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఉద్యమకారులను వేధించిన వారు ఇప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్నారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నించటాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. గతంలో కోదండరాంను రకరకాల కారణాలతో అరెస్టు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి మంద కృష్ణ మాదిగ, టీడీపీ నేత ఒంటేరు ప్రతాపరెడ్డిని అరెస్టు చేసిందని ఆరోపించారు. పార్టీ నుంచి వైదొలిగే ఆలోచనలో ఉన్న సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డితో మాట్లాడతామని, పార్టీపై ఆయనకున్న అపోహలను నివృత్తి చేసేందుకు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top