హిందీయేతర ప్రజలపై యుద్ధ ప్రకటనే

Kerala CM attacks Shah on Hindi pitch - Sakshi

అమిత్‌ షా దేశ భాష హిందీ వ్యాఖ్యలపై కేరళ సీఎం వ్యాఖ్య

కేంద్రం హిందీని నిరంకుశంగా రుద్దాలని చూస్తోందన్న స్టాలిన్‌

8వ షెడ్యూల్‌లోని భాషలన్నిటినీ సమానంగా చూడాలి: సీపీఎం

తిరువనంతపురం/చెన్నై/పుదుచ్చేరి/న్యూఢిల్లీ: దేశాన్ని ఏకం చేయగల సత్తా ఉన్న ఏకైక భాష హిందీ అంటూ హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. కేంద్రం తమపై హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందంటూ తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం మంత్రి ప్రకటన తమ మాతృభాషను అమితంగా ప్రేమించే హిందీయేతర ప్రాంతాల ప్రజలపై దండయాత్ర ప్రకటించడమేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పేర్కొన్నారు.

దేశం ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే, కేంద్రం ఈ వివాదాస్పద అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఫేస్‌బుక్‌లో ఆరోపించారు. భాషా ప్రాతిపదికన ప్రజల్లో వైషమ్యాలు సృష్టించి, విడదీయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్‌ నేత రమేశ్‌ చెన్నితాల ఆరోపించారు. దేశ మంతటా ఒకే భాషను అమలు చేయాలన్న ప్రయత్నాలు ఐక్యతకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని సీపీఎం పేర్కొంది. రాజ్యాంగం 8వ షెడ్యూల్‌లో పేర్కొన్న జాతీయ భాషలన్నిటినీ సమానంగా గౌరవించాలని కేంద్రాన్ని కోరింది.

ప్రతిపక్షాలు ఏకం కావాలి: స్టాలిన్‌
కేంద్రం హిందీని ప్రజలపై బలవంతంగా రుద్దాలని చూస్తోందని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ విమర్శించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ.. నీట్‌తోపాటు రైల్వే, తపాలా శాఖలు నిర్వహించే పోటీ పరీక్షల్లో తమిళనాడు వివక్షకు గురవుతోందని ఆరోపించారు. హిందీని జాతీయ భాషగా మార్చాలన్న కేంద్రం ప్రయత్నాలపై గతంలో మాదిరిగానే అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాలన్నారు. హిందీని ఉమ్మడి భాషగా మార్చాలన్న కేంద్రం ప్రయత్నాలను పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఖండించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top