
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై దాఖలుచేసిన సివిల్, క్రిమినల్ పరువునష్టం కేసులను ఉపసంహరించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంగీకరించారు. ఈ కేసుల్ని సెటిల్ చేసుకుంటామని జైట్లీ, కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టుతో పాటు మరో ట్రయల్ కోర్టు ముందు ఉమ్మడి పిటిషన్లు దాఖలుచేశారు. 2000–13 మధ్యలో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) చైర్మన్‌గా ఉన్న జైట్లీ, ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించడంతో కేజ్రీవాల్‌పై క్రిమినల్ పరువునష్టం కేసు దాఖలైంది.
ఈ ఆరోపణలపై ఇటీవల కేజ్రీవాల్ క్షమాపణలు కోరుతూ లేఖ రాయడంతో కేసును వెనక్కు తీసుకునేందుకు జైట్లీ అంగీకరించారు. అలాగే ఆప్ నేతలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్‌పాయ్, అశుతోష్‌లు కూడా క్షమాపణలు చెప్పడంతో వారిపై కేసుల ఉపసంహరణకూ జైట్లీ అంగీకరించారు. కేజ్రీవాల్, జైట్లీల పిటిషన్లను మంగళవారం కోర్టు విచారిస్తుందని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తెలిపారు. జైట్లీపై ఆరోపణలు చేసిన మరో ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఎలాంటి క్షమాపణలు చెప్పకపోవడంతో ఆయనపై విచారణ కొనసాగనుంది.