ఢిల్లీలో మనమే చక్రం తిప్పాలి: కేటీఆర్‌

KCR Struggling For Minorities Says KTR - Sakshi

హైదరాబాద్‌: మైనార్టీల సంక్షేమం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భారీగా నిధులు మంజూరు చేసి వారి అభివృద్ధికి పాటుపడుతున్నారని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శనివారం ఇక్కడ కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని అల్లాపూర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌ చౌరస్తాలో ఆ పార్టీ నియోజకవర్గ మైనార్టీ సెల్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి ఓటేస్తే ప్రధాని నరేంద్ర మోదీకి లాభం, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి మేలు, టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులకు ఓటేస్తే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఢిల్లీకోటపై గులాబీ జెండా ఎగరవేయాలో, వద్దో తెలంగాణ ప్రజలు నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఢిల్లీలో మనం చక్రం తిప్పాలంటే మన రాష్ట్రంలో ఉన్న 16 టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఓటర్లకు పిలుపునిచ్చారు.

మైనార్టీల కోసం తెలంగాణ ప్రభుత్వం గురుకుల, రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసిందని, ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి లక్ష రూపాయలు వెచ్చిస్తోందని అన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకువ దీటుగా మైనార్టీ గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. షాదీ ముబారక్‌ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలైన మైనారిటీ యువతుల పెళ్లిళ్లకు మేలు చేకూరిందని తెలిపారు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాగాలు, జపాలు చేస్తే మోదీకి ఏమి అవసరం. ఆయన కూడా యాగాలకు వస్తే తీర్థ ప్రసాదాలు అందజేస్తాం’అని అన్నారు. తన ఐదేళ్ల పాలనలో మోదీ ఏ రోజు కూడా తెలంగాణ ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. 3 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మాధవరం కృష్ణారావుకు వచ్చిన మెజార్టీకన్నా రాజశేఖర్‌రెడ్డికి భారీ మెజార్టీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు మహ్మద్‌ గౌసుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పాలి
కులమతాల పేరుతో రాజకీయాలు చేస్తున్న జాతీయ పార్టీలకు బుద్ధిచెప్పి అభివృద్ది, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని బోరబండ, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్‌లో బస్తీలు ఎక్కువని, అలాగే సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నారు. డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి రాబోయే ఆరునెలల కాలంలో పూర్తి చేసి ఇస్తామన్నారు.  నియోజకవర్గంలోని కోడెద్దు లాంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ ఉన్నారని, ఎంపీగా జోడెద్దులాంటి సాయికిరణ్‌ యాదవ్‌ను గెలిపిస్తే ఇద్దరు కలిసి జోడెద్దుల్లాగా అభివృద్ధి చేస్తారన్నారు.

ఇద్దరు ఎంపీలతో కేసీఆర్‌ తెలంగాణా తెచ్చిన మొనగాడని, 16మంది ఎంపీలను  గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచి నిధులు, ఎన్నో భారీ పథకాలు తెస్తారని హామీ ఇచ్చారు. నగరంలోని  మెట్రో రైలును భవిష్యత్తులో 200 కిలోమీటర్ల మేర విస్తరించడానికి కృషి చేస్తామన్నారు.  ఎమ్మెల్యే  గోపీనాథ్, అభ్యర్థి సాయికిరణ్‌ యాద వ్, డిప్యూటీ  మేయర్‌ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్‌ సంజయ్‌గౌడ్‌  తదితరులు పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో స్థానికులు రోడ్‌షోలో పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top