రాబోయేది సంకీర్ణమే..

KCR Comments On Narendra Modi And Rahul Gandhi - Sakshi

16 సీట్లు గెలిపిస్తే.. దేశ గతిని మారుస్తా : కేసీఆర్‌

కలిసొచ్చే పార్టీలతో ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతుంది

సింగరేణి కార్మికులకు ఐటీ మాఫీ చేయమన్నా మోదీ చేయలేదు

ప్రధాని చిత్తశుద్ధిని ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు

మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో24 గంటల విద్యుత్‌ ఇవ్వట్లేదు

మోదీని గద్దె దించి రాహుల్‌ను ఎక్కిస్తే ఏమొస్తది?

పథకాలకు ఆయన నెహ్రూ, ఇందిర పేర్లు పెడతారు

గోదావరిఖని సభలో కేసీఆర్‌  

గత ప్రభుత్వాల కంటే సింగరేణి ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. డిపెండెంట్‌ ఉద్యోగాలను 6,742 మందికి ఇచ్చాం. ఉద్యోగం వద్దనుకునే వారికి రూ. 25 లక్షలు, కార్మికులు చనిపోతే రూ. 20 లక్షలిస్తున్నాం. ఆనాడు రూ.లక్ష  ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఆనాడు కొప్పుల ఈశ్వర్‌ను నెల రోజులు జైల్లో పెట్టారు. ఇప్పుడు కార్మికుల ఇళ్లకు ఫ్రీ కరెంట్, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల వడ్డీలేని రుణం ఇస్తున్నాం. అలాగే గోదావరిఖనిలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయిస్తా.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ :  రాష్ట్రంలో పదహారు ఎంపీ సీట్లు గెలిపిస్తే దేశ గతిని మారుస్తానని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో దేనికీ మెజారిటీ రాదని... రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. కలిసొచ్చే ప్రాంతీయ పార్టీలతో కలసి ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ సత్తా చాటుతుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం జరిగిన ప్రచార సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. కేసీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

ఎక్కడో ఓ చోట మొదలు కావాలె...
దేశంలో బీజేపీ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్‌ పోతే బీజేపీ అనే ఆలోచన పోవాలె. దేశాన్ని నాలుగైదేళ్లు పరిపాలించిన ప్రాంతీయ పార్టీలు మినహాయిస్తే కాంగ్రెస్, బీజేపీలే పాలించాయి. ప్రాంతీయ పార్టీలను కూడా వీళ్లు ఎక్కువ కాలం నిలబడనీయలేదు. ఎక్కడో ఓ చోట మొదలు కావాలె. నాకెందుకు పంచాయితీ అనుకుంటె తెలంగాణ వచ్చేదా? గట్లనే దేశం కూడా మారాలె. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్, బీజేపీ లేని ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీని దించి రాహుల్‌ గాంధీని ఎక్కిస్తే దేశానికి ఏమొస్తుంది? పథకాల్లో కేవలం దీన్‌ దయాళ్, శ్యామాప్రసాద్‌ ముఖర్జీ పేర్లు పోయి జవహర్‌లాల్‌ నెహ్రూ, గాంధీ పేర్లు మాత్రమే చేరుతాయి. మోదీ హయాంలో దేశానికి ఒరిగిందేమిటి? బొగ్గు గనుల్లో పని చేసేవాళ్లు మిలిటరీకన్నా ఏమీ తక్కువ కాదు. బొగ్గు గని కార్మికులకు ఆదాయపు పన్ను మాఫీ చేయాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా, నేను స్వయంగా కలిసి మోదీని అభ్యర్థించినా పట్టించుకోలేదు. కార్మికుల ఆదాయపు పన్ను మాఫీ చేస్తే పోయేదేం లేదు. కానీ చెయ్యరు. ఎందుకంటే అడిగేవాడు లేడని. అందుకే దేశంలో ప్రబలమైన, గుణాత్మకమైనమార్పు రావాల్సిందే. నా భరతం పడతామని, కథ చూపిస్తామని భయపెడుతున్నారు, బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.

దేశంలోని నీటి వనరులపై చర్చకు సిద్ధమా?
దేశంలో నీటి వినియోగం, వనరులకు సంబంధించి చర్చకు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సిద్ధమా? నీటి వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని వినియోగించుకోవడంలో విఫలమవడం వల్లే నీటి కొరత దేశాన్ని పీడిస్తోంది. దేశంలో 3.5 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతుంటే అందులో ఎంత మేర వాడుతున్నారనే దానికి సమాధానం లేదు. ఉత్తర భారతదేశంలో ఎక్కడ చూసినా కరెంటు కోతలే. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా 24 గంటల విద్యుత్‌ సరఫరా లేదు. కేవలం తెలంగాణలోనే ఆ సమస్యను అధిగమించాం. ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు అనువైన వనరులు ఉన్నాయి. లేనిదల్లా చిత్తశుద్ధిగల నేతలే. నేను వీటి గురించి నిలదీస్తే పట్టించుకోకుండా జాతకాల గురించి, ఇతర వ్యక్తిగత విషయాలను మోదీ లేవదీస్తున్నారు. ప్రధాని హోదాలో ఉన్న నాయకుడు కేసీఆర్‌ జాతకాలు చూసుకుంటాడని, ఇంకేదో చేస్తాడని మాట్లాడటం సరైనదేనా?

ఆర్థిక వనరుల వినియోగం తెలియదా?
రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర రూ. 13 లక్షల కోట్ల వరకు నిల్వలున్నాయి. మహారత్న కంపెనీల దగ్గర మరో రూ. 13 లక్షల కోట్లు మూలుగుతున్నాయి. అయినా వాటిని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏంటి? దేశంలో కొందరు వ్యాపారులు ఇన్‌కంటాక్స్‌ ఎగ్గొడతరు. అది బ్లాక్‌మనీగా మిగిలిపోతుంది. దాన్ని ప్రభుత్వ ఖజానాకు మళ్లించాలి. అయితే పన్ను ఎగవేసిన వ్యాపారులు 30 శాతం కట్టమంటేనే ఎగబెడుతున్నప్పుడు ఎగవేసిన పన్ను మీద అదనపు పన్నులు వేసి కట్టమంటే కడ్తరా? ఇండోనేసియా అనే మన పొరుగునున్న చిన్న దేశంలో ఎగవేసిన ఐటీని రాబట్టుకునేందుకు కేవలం 4 శాతం పన్ను కట్టాలని అడిగితే ఏకంగా రూ. 25 లక్షల కోట్లు సమకూరాయి. ఇలాంటి ప్రయత్నం చేస్తే మన దేశంలో ఎన్ని లక్షల కోట్లు తెల్లధనంగా మారేది? కాంగ్రెస్, బీజేపీల పాలనపట్ల ప్రజలు విసుగు చెందారు. వారి సభలకు ప్రజలు హాజరు కావడం లేదు. ఉన్న వసతులు, వనరులు, అవకాశాలు వాడుకోలేని వాళ్లే పరస్పరం నిందారోపణలు చేసుకొని తికమక పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి వారి మాయలకు మోసపోకండి, ఆలోచించండి.

సింగరేణి కార్మికులకు ఎన్నో చేశాం...
గత ప్రభుత్వాల కంటే సింగరేణి ఉద్యోగులకు టీఆర్‌ఎస్‌ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. డిపెండెంట్‌ ఉద్యోగాలను 6,742 మందికి ఇచ్చాం. మిగిలిన వారికి ఇప్పించే బాధ్యత నాది. ఉద్యోగం వద్దనుకునే వారికి రూ. 25 లక్షలు, కార్మికులు చనిపోతే రూ. 20 లక్షలు ఇస్తున్నాం. ఆనాడు లక్ష రూపాయలు ఇవ్వమన్నా ఇవ్వలేదు. ఆనాడు కొప్పుల ఈశ్వర్‌ను నెల రోజులు జైల్ల పెట్టారు. ఇప్పుడు కార్మికుల ఇండ్లకు ఫ్రీ కరెంట్, క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, ఇంటి నిర్మాణానికి రూ. 10 లక్షల వడ్డీలేని రుణం ఇస్తున్నాం. ఇంకా మిగిలి సమస్యలను కూడా పరిష్కరిస్తా. గోదావరిఖనిలో మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయిస్తా.

వచ్చే ఐదేళ్లలో రూ. 10 లక్షల కోట్ల అభివృద్ధి పనులు...
మంచిర్యాల జిల్లా కావాల్నని కొట్లాడితే ఇవ్వలేదు. మనం మంచిర్యాలతోపాటు పెద్దపల్లిని కూడా జిల్లా చేసుకున్నాం. అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును మీ జిల్లాలోనే కడుతున్నం. 200 కిలోమీటర్ల గోదావరి ఎల్లకాలం జీవనదిలా ఉండబోతోంది. క్యాతనపల్లి, నస్పూరు కలిపి మంచిర్యాల కార్పొరేషన్‌ చేయాలన్న కోరికను నెరవేరుస్తం. చెన్నూరును రెవెన్యూ డివిజన్‌ చేస్తా. పోడు భూముల సమస్యలు, రైతులకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. రైతులకు పట్టాల విషయంలో ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు. కొత్త రెవెన్యూ చట్టం తెస్తున్నాం. మేం రెవెన్యూ ఉద్యోగులకు వ్యతిరేకం కాదు. తెలంగాణ రాక ముందు మనం ఎట్లుండె... ఇప్పుడెట్ల ఉన్నం అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

ఆగం కావద్దు. ఎన్నికలు రాంగనే చాలా మంది బయలుదేరుతరు. చాలా విషయాలు చెపుతరు. అన్నీ వినాలి. ఆలోచన చేయాలి. తర్వాత మనం నిర్ణయం తీసుకోవాలి. రాబోయే ఐదేండ్లలో అభివృద్ధి పనుల కోసం రూ. 10 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. తరువాత ఐదేండ్లలో కలిపి రూ. 30 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కోటీ 25 లక్షల ఎకరాలను సశ్యశ్యామలం చేసి సుజల తెలంగాణ సాధించుకుంటాం. ఉన్నత విద్యావంతుడు వెంకటేశ్‌ నేతను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలి. నేతకాని సమాజానికి ప్రతినిధిగా ఆయన్ను పంపించాలి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ జనరల్‌ కె. కేశవరావు, రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాసరి మనోహర్‌రెడ్డి, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పుట్టా మధుతోపాటు బిరుదు రాజమల్లు, సోమారపు సత్యనారాయణ, గడ్డం అరవింద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top