‘కారు’ స్పీడ్‌ ఆగొద్దు..! | Sakshi
Sakshi News home page

‘కారు’ స్పీడ్‌ ఆగొద్దు..!

Published Thu, Apr 4 2019 12:16 PM

Kavita: Trs Winning Speed Has Not To Stop - Sakshi

సాక్షి, కోరుట్ల: ‘టీఆర్‌ఎస్‌ మీ ఇంటి పార్టీ..కోరుట్ల నాకు సెంటిమెంట్‌ ఊరు..మరోసారి ఆశీర్వదించండి..నిరంతరం అభివృద్ధికి పాటుపడతానని’..నిజామాబాద్‌ లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట కవిత అన్నారు. బుధవారం కోరుట్లలోని పీబీ గార్డెన్స్‌లో టీఆర్‌ఎస్‌లో మున్నురు కాపు సంఘాల చేరిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. మున్నురు కాపు సంఘాలతో పాటు బీడీ టేకేదార్లు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీగా మొదటిసారి గెలిచిన తర్వాత మొట్టమొదటగా కోరుట్లలో ప్రజలు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించి రూ.36లక్షలు కేటాయించానని, అప్పటి నుంచి నిజామాబాద్‌ పార్లమెంట్‌లో అభివృద్ధి పనులు చకచకా సాగాయన్నారు. కోరుట్ల ప్రజల ఆకాంక్షల మేరకు రెవెన్యూ డివిజన్, వంద పడకల ఆసుపత్రి, 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పెద్దపల్లి–నిజామాబాద్‌ రైల్వేలైన్‌ పూర్తి చేయించి కోరుట్లకు రైలు తెప్పించామన్నారు. తిరుపతి, ముంబాయ్‌ రైళ్లు ఇక్కడి నుంచి వెళ్తున్నాయన్నారు.

కోరుట్లలో ముంబాయ్‌ రైలు ఆగేలా ఇప్పటికే చర్యలు చేపట్టామని, కోరుట్ల మున్సిపాల్టీలో అభివృద్ధి పనుల కోసం ఎన్నడూ లేని రీతిలో రూ. 50 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేయిస్తున్నామన్నారు. మళ్లీ తనను గెలిపిస్తే..రానున్న కాలంలో కోరుట్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్‌ను ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మనకు ఎక్కువ మొత్తంలో నిధులు వస్తాయన్నారు. సమావేశంలో మున్నూరు కాపు సంఘాలు, జెడ్పీచైర్‌పర్సన్‌ తుల ఉమ, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ చీటి వెంకట్రావు, మున్సిపల్‌ చైర్మన్‌ గడ్డమీది పవన్, పట్టణ, మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు అన్నం అనిల్, దారిశెట్టి రాజేశ్, నాయకులు యాటం చిట్టి, జక్కుల జగదీశ్వర్, కస్తూరి లక్ష్మీనారాయణ, గుడ్ల మనోహర్, సంగ లింగం, సేనాపతి రాజు, ఆడెపు మధు పాల్గొన్నారు. 

పేదలు ఆత్మగౌరవంతో బతకాలి
కోరుట్లరూరల్‌: రాష్ట్రంలో పేదప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని ఎంపీ కవిత అన్నారు. మండలంలోని అయిలాపూర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ప్రతి గ్రామంలోని పేదలకు డబుల్‌ బెడ్‌రూం నిర్మిస్తామని, మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చినప్పుడు ఇళ్లు లేవని దరఖాస్తులు ఇచ్చే అవకాశం ఎవరికీ ఉండదన్నారు. స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 5లక్షలు ఇస్తామన్నారు. మన రాష్ట్రం నుంచి 16 మందిని లోక్‌సభకు పంపిస్తే మనకు రావలసిన నిధులు బాజాప్త తెచ్చుకోవచ్చని, కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసేదేమీ లేదని, బీజేపీ అంటే భారతీయ జూట్‌ పార్టీ అని, దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌లను నమ్మె పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24గంటల విద్యుత్‌ అందిస్తున్నామని, రైతుబంధు, రైతుబీమా పథకాలతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పిడుగు రాధ సందయ్య, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎంపీపీ టి.భారతి, మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement