
సాక్షి, చెన్నై: తన పుట్టినరోజున రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హీరో కమల్‌హాసన్ స్పందించారు. ప్రచారం జరుగుతున్నట్లుగా 7వ తేదీన పార్టీ ప్రకటన ఉండదని ఆయన స్పష్టం చేశారు. తన పుట్టిన రోజున(నవంబర్ 7) అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని గురువారం తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆయన తరచూ రాజకీయ విమర్శలు చేస్తూ సొంత పార్టీ పెట్టడం ఖాయమనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించారు.
అభిమాన సంఘాల నేతలతో ఇటీవల కమల్ సమావేశమయ్యారు. ఆ సమయంలో అభిమాని మాట్లాడుతూ.. కమల్ పుట్టినరోజు నాడు పార్టీని ప్రకటిస్తారని మీడియాకు చెప్పారు. ముఖ్యమైన ప్రకటనలు పుట్టిన రోజు చేస్తానని తమిళ వారపత్రికకు రాస్తున్న ధారావాహికలో కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో నవంబర్ 7వ తేదీన పార్టీ ప్రకటన ఖాయమనే ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని గురువారం మీడియా ప్రధానంగా ప్రచారం చేసింది.
వీటిపై కమల్ హాసన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నవంబర్ 7వ తేదీన పార్టీ ప్రకటన ఉండబోదని స్పష్టం చేశారు. ఆ రోజున అభిమానులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ప్రకటిస్తానని ఆయన తెలిపారు. మీడియా ఊహజనిత కథనాలకు కట్టుబడి పార్టీని ప్రకటించబోనని వ్యాఖ్యానించారు. అభిమానులతో సమావేశం కావడం చాలా సంవత్సారాల నుంచి కొనసాగుతోందని చెప్పారు.