‘మరోమారు కారుదే కుర్చీ’

Kadiyam Srihari Critics Lagadapati Rajagopal Exit Polls Survey - Sakshi

లగడపాటే కాదు.. ఎవరూ అంచనా వేయలేరు

సాక్షి, వరంగల్‌ : తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడందరూ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలవైపు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, అన్ని సంస్థల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండగా.. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మాత్రం తెలంగాణలో కూటమి అధికారంలోకి వస్తుందని వెల్లడించారు. ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపై టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కడియం శ్రీహరి స్పందించారు. తెలంగాణలో కూటమి అధికారంలోకి రానుందనే లగడపాటి అంచనాల్ని కొట్టిపడేశారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ పాలనపట్ల పూర్తి విశ్వాసం వ్యక్తమయిందని తెలిపారు. 75 నుంచి 80 సీట్లు సాధించి టీఆర్‌ఎస్‌ మరోమారు అధికారాన్ని చేపట్టనుందని కడియం అభిప్రాయపడ్డారు. సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ ఎలా ఉన్నా టీఆర్‌ఎస్‌ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్య​క్తం చేశారు. ప్రజల నాడీని ఏ సర్వేలు పసిగట్టలేవని వ్యాఖ్యానించారు. డిసెంబర్‌ 11న ప్రజా మద్దతు ఎవరికుందో స్పష్టమవుతుందని అన్నారు. తెలంగాణకు బద్ధవ్యతిరేకి అయిన లగడపాటి తెలంగాణ ప్రజల్ని గందరగోళానికి గురిచేయడానికి ఇలాంటి తప్పుడు సర్వేలు చెప్తున్నారని మండిపడ్డారు.

ముందస్తుకు అందుకే వచ్చాం..
‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర అంత ప్రభావవంతంగా ఉండదు. రాష్ట్రంలో, జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు అంత సులువు కాదు. కేంద్రంలో తగిన పాత్ర ఉండాలనే ముందుస్తుకు వచ్చాం’ అని కడియం పేర్కొన్నారు. అయితే, ముందస్తుకు పోయేటప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులు ఒకేలా లేవని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకులు తెలంగాణపై దృష్టి పెట్టడం కొంత దెబ్బతీసిందని అన్నారు. ఏదేమైనా రెండొంతుల స్థానాలను గెలుచుకొని అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాలు కూడా ముందస్తు ఎన్నికలు జరుపుకొని జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారా అనే ప్రశ్నకు అవేవీ ఇప్పుడు చెప్పలేమన్నారు. టీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారాన్ని సొంతం చేసు​కున్న తర్వాత కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కై పనిచేస్తూ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతారని కడియం వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడమే టీఆర్‌ఎస్‌ కర్తవ్యమని అన్నారు. ‘మా బలం, నినాదం కేసీఆరే. ఎట్టి పరిస్థితుల్లో ఆయనే ముఖ్యమంత్రి. గజ్వెల్‌లో కేసీఆర్‌ మంచి మెజారిటీతో గెలబోతున్నారని జోస్యం చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top