మన పాలనా వ్యవస్థకు ఏమైంది?

How Will Improve Indian Governance - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రభుత్వ పాలనారంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంలోని  నరేంద్ర మోదీ ప్రభుత్వం గతేడాది శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లోకి ఆయా రంగాల్లో అనుభవం ఉన్న తొమ్మిది మంది అధికారులను సంయుక్త కార్యదర్శి స్థాయిలో తాత్కాలిక (మూడేళ్లు కనిష్టం, అయిదేళ్లు గరిష్టం) ప్రాతిపదికపై తీసుకుంది. వివిధ రంగాల్లో అనుభవం ఉన్న 40-45 ఏళ్ల ఐఏఎస్‌ యేతర అధికారుల నియామకానికి కేంద్రంలోని యూపీఎస్‌సీ 2018, జూన్‌ నెలలో దరఖాస్తులను ఆహ్వానించింది. వారిలో తొమ్మిది మందిని ఎంపిక చేసి వారికి కాంట్రాక్టు పద్ధతిపై వారిని సంయుక్త కార్యదర్శి హోదాలో నియమించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రభుత్వంలోని అన్ని రంగాల్లోకి పాలనాపరమైన అనుభవజ్ఞులైన ఐఏఎస్‌ యేతరులను తీసుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. తద్వారా తమంత వారు లేరనే ఐఏఎస్‌ల అనవసరపు అహంకారాన్ని దెబ్బతీయడంతోపాటు పాలనావ్యవస్థను మెరగుపర్చవచ్చన్నది కూడా మోదీ ప్రభుత్వం ఉద్దేశం. 

వివిధ రాష్ట్రాల గవర్నర్ల పదవుల్లోకి ఆరెస్సెస్‌ నాయకులను తీసుకున్నట్లుగానే వారిని ప్రభుత్వ పాలనలోకి తీసుకోవడానికి మార్గమే ఈ కొత్త విధానమంటూ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాయి. వారి విమర్శల్లో నిజం ఉందా ? నిజంగానే ఐఏఎస్‌లకు అహంకారం పెరిగిందా ? వారి, వారి అనుభవ రాహిత్యం వల్ల దేశంలో పాలనా వ్యవస్థ కుంటుపడిందా ? బయటి నుంచి వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన వారిని తీసుకున్నట్లయితే ప్రయోజనం ఉంటుందా ? ప్రస్తుతం మన పాలనా వ్యవస్థ ఎలా ఉంది ? అన్న అంశాలపై చర్చ జరుగుతుందనుకున్న తరుణంలోనే ఎన్నికలు వచ్చి పడడంతో ఈ అంశం మరుగున పడి పోయింది. 

భారత దేశంలో పాలనా వ్యవస్థ సవ్యంగా లేదని పౌరులెవరైనా ఒప్పుకుంటారు. కానీ అది ఆసియాలోనే అత్యంత అధ్వాన్నంగా ఉందన్న విషయం వారికి తెలియదు. ఆసియా దేశాల పాలనా వ్యవస్థలపై హాంకాంగ్‌కు చెందిన ‘పొలిటికల్‌ అండ్‌ ఎకనామిక్‌ రిస్క్‌ కన్సల్టెన్సీ’ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. సకాంలో పౌరులకు సరైన సేవలను అందించడంలో విఫలం అవుతుండడం వల్లనే భారత పాలనా వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. దీనికి మొట్టమొదటి కారణం ఐఏఎస్‌ అధికారులు చాలా తక్కువగా ఉండడం. తద్వారా సేవల్లో ఆలస్యం జరగడం, తొందరగా పనులు కావడం కోసం అవినీతిని ఆశ్రయించడం, అందుకు అధికారులు అలవాటుపడడం, రెండు ప్రధాన కారణాలయితే మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా మూడో కారణం ఆయా రంగాల్లో ఐఏఎస్‌ అధికారులకు సరైన అనుభవం లేకపోవడం. ఒక్క చివరి కారణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటే వ్యవస్థలో ఆశించిన మార్పులు అసాధ్యం. 

ఐఏఎస్‌ అధికారులు అంతగా పనికి రారనుకోవడం పొరపాటు. వారికి కూడా వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చినట్లయితే వారూ అన్ని విధాల పనికి వస్తారు. ప్రస్తుతం బిజినెస్‌ స్కూళ్లలో వివిధ రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలా ఐఏఎస్‌లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇప్పించవచ్చు. ప్రస్తుతం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ అకాడమీలో ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చే సౌకర్యాలు లేవు. వాటిని పెంచాల్సిన అవసరం ఉంది. దేశంలో నేడు మంజూరైన 20 శాతం ఐఏఎస్‌ పోస్టులు ఖాళీగా ఉండడానికి కారణం, వారికి శిక్షణ ఇచ్చేందుకు అకాడమీలో వసతులు లేకపోవడమేనని కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. అలాంటప్పుడు శిక్షణా సౌకర్యాలను పెంచేందుకు కృషి చేయాలిగదా! దేశంలో ప్రస్తుతం 6,500 ఐఏఎస్‌ పోస్టులు ఉన్నాయి. వారందరికి ‘జనరల్‌ ఫిజిషియన్‌’లా ఒకే రకమైన శిక్షణ ఉంటోంది.

ఒకప్పుడు ఏ రోగం వచ్చినా జనరల్‌ ఫిజిషియన్‌ దగ్గరకు వెళ్లేవాళ్లం. ఇప్పుడు కాలం మారింది. సమస్యను బట్టి అంకాలజిస్ట్, కార్డియాలోజిస్ట్, పిడియాట్రిషన్‌ వద్దకు వెళ్తున్నాం గదా! ఐఏఎస్‌ల ఏకఛత్రాధిపత్యం లేకుండా చేయాలంటే దానికి సమాంతరంగా మరో అధికార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రత్యేయ అడ్మినిష్ట్రేషన్‌ స్కూళ్లను ఏర్పాటు చేయవచ్చు. ఏది ఏమైన కేవలం తొమ్మిది మందిని సంయుక్త కార్యదర్శి స్థాయిలో నిపుణులను ప్రయోగాత్మకంగా తీసుకుంటే అది విజయమయిందో, విఫలమయిందో చెప్పలేం. కనీసం వంద మందిని తీసుకొని ఉంటే ఆ ప్రయోగానికి ఓ అర్థం ఉండేది. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top